ఒకే కుటుంబంలో నలుగురికి పాజిటివ్‌

1 Apr, 2020 11:00 IST|Sakshi
వెలవెలబోతున్న వెంకటాపురం కాలనీ 

క్వారంటైన్‌లో 26 మంది 

పద్మనాభం (భీమిలి): పద్మనాభం మండలం వెంకటాపురంలో కరోనా కల్లోలం సృష్టించింది. దీంతో గ్రామస్తులతో పాటు పరిసర గ్రామాలకు చెందిన వారు కూడా పది రోజుల నుంచి భయాందోళనల మధ్య గడుపుతున్నారు.  గ్రామంలోకి లండన్‌ నుంచి వచ్చిన యువకుడికి కరోనా వైరస్‌ సోకినట్టు గతనెల 22న విశాఖ చెస్టు ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు. దీంతో అదే రోజు యువకుడి కుటుంబంలో నలుగురితో పాటు 23 మందిని విశాఖ ఆస్పత్రికి తరలించారు. కాగా వీరిలో యువకుడి తండ్రికి 26న పాజిటివ్‌ వచ్చింది. ఈ నేపథ్యంలో ఇతను ఎవరిని కలిశారో తెలుసుకుని మరో 10 మందిని తరలించారు. రెండు విడతల్లో మొత్తం 33 మందిని ఆసుపత్రికి తరలించారు. కాగా యువకుడి సోదరి, తల్లికి కరోనా పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు. దీంతో గ్రామంలో నాలుగు కేసులు నమోదు కావడంతో  గ్రామస్తులు భయంతో బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. (వణుకుతున్న వెంకటాపురం)  

ఇద్దరు ఇంటికి.. మిగిలిన వారు క్వారంటైన్‌లో.. 
వీరి ఇంట్లో ఇద్దరి పనిమనుషులతో పాటు యువకుడి నాన్నమ్మకు నెగిటివ్‌ రావడంతో ఇళ్లకు  పంపించేశారు. మిగతా 26 మంది క్వారంటైన్‌లో ఉన్నారు. వీరికి  సంబంధించి రిపోర్టులు ఇంకా రాకపోవడంతో వీరి కుంటుంబ సభ్యులతో పాటు వీరు కలిసిన వారు భయాందోళన నడుమ కాలం గడుపుతున్నారు.  రిపోర్టుల కోసం ఒళ్లంతా కళ్లు చేసుకుని ఎదురు చూస్తున్నారు.  

దిగ్భంధంలో గ్రామం 
కరోనా వైరస్‌ ప్రబలడంతో వెంకటాపురాన్ని దిగ్భందించారు. గ్రామస్తులను ఇళ్లకే పరిమితం కావాలని అధికారులు హెచ్చరించారు. గ్రామానికి మూడు వైపులా పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేసి వెంకటాపురం గ్రామస్తులు ఇతర గ్రామాల్లోకి వెళ్లకుండా కట్టడి చేశారు. కరోనా వైరస్‌ భయంతో వెంకటాపురం గ్రామం ఊసేత్తెతే మిగతా గ్రామల ప్రజలు హడలిపోతున్నారు. దీని వల్ల వెంకటాపురం ప్రజలను అటు మజ్జిపేట, ఇటు రేవిడి గ్రామస్తులు రానివ్వడం లేదు.  

దూరం పెట్టేశారు 
పదిరోజులుగా ఈ రెండు పంచాయతీలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి. పంచాయతీ ప్రజల ఆందోళన కారణంగా మంగళవారం నుంచి రేవిడికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న రౌతులపాలెం వరకు వంట గ్యాస్‌ సరఫరా జరుగుతోంది. వీరికి మాస్క్‌లు, శానిటైజర్లు, డెటాల్, కర్చీఫ్‌లు అందుబాటులో లేకుండా పోయాయి. ఈ ప్రాంతంలో పండించిన కూరగాయలు కరోనా భయంతో గ్రామాలను దాటకుండానే పశువులకు ఆహారమయిపోతున్నాయి.  

ఎటూ రానివ్వడం లేదు 
వంట గ్యాస్‌ పది రోజులుగా ఈ ప్రాంతానికి రాలేదు. తెచ్చుకుందామంటే ఇటు మహారాజుపేట వైపు అటు పాండ్రంగి వైపు రానివ్వడం లేదు. పోరాడితే ఈ రోజు నుంచి అది కూడా మూడు కిలోమీటర్ల దూరంలో రౌతులపాలెం చెరువు వద్దకు వచ్చి సిలిండర్లు విడిపించుకోమంటున్నారు. – పిల్లి ఆదినారాయణ, రేవిడి

దాణా కోసం కటకట 
పది రోజులగా పశువులకు దాణా సరఫరా నిలిచిపోయింది. దాణా కోసం విజయనగరం వెళ్తామంటే లాక్‌డౌన్‌ కారణంగా పోలీసులు అనుమతించడం లేదు. పశువులు నీరసించిపోతున్నాయి. పాలదిగుబడి గణనీయంగా తగ్గిపోయింది.  – భూపతిరాజు రాజేష్‌, డెయిరీ యజమాని, రేవిడి

మరిన్ని వార్తలు