సీబీఐ అంటే బాబుకు భయం

17 Nov, 2018 13:41 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి

నాలుగున్నరేళ్ల పాలనలో లక్షల కోట్ల అవినీతి

నిష్పక్షపాత విచారణ జరిగితే సీఎంతో సహా సగం మంత్రి మండలి జైలుకే

విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): సీబీఐ, ఈడీ, ఐటీ, సీవీసీ తదితర కేంద్ర ప్రభుత్వ విచారణ సంస్థల పేరెత్తితే  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గజగజ వణికిపోతున్నారని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.  నాలుగున్నరేళ్ల పాలనలో నీరు–చెట్టు–మట్టిలోనే లక్షల కోట్లు అవినీతికి పాల్పడిందన్నారు. వీటిన్నింటిపై నిష్పక్షపాత విచారణ జరిపితే సీఎం చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేష్‌తో సహా సగం మంది మంత్రి మండలి సభ్యులు జైలుకు వెళతారన్నారు. అందుకోసమే రాష్ట్రంలో సీబీఐ విచారణ  జరగడానికి వీలు లేదంటూ కన్సెంట్‌ అర్డన్‌ను ఉపసంహరించుకున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.16 వేల కోట్ల నుంచి రూ.58 వేల కోట్లకు పెంచారన్నారు. ఇందులో లెక్కలేనంత అవినీతి జరిగిందని, దీని వెనుకాల బీజేపీ  పాత్ర కూడా ఉందన్నారు.  ఎక్కడైనా జాతీయ ప్రాజెక్టులను  కేంద్ర ప్రభుత్వం నిర్మించి జాతికి అంకితం చేస్తుందన్నారు. కమీషన్ల కోసం పోలవరాన్ని చంద్రబాబు చేపట్టి వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారన్నారు. విశాఖపట్టణం ఎయిర్‌పోర్టులో తమ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నంలో సీఎం చంద్రబాబు పాత్ర  ఉందన్నారు. దీనిపై హైకోర్టు  సీబీఐ విచారణకు ఆదేశించే అవకాశం ఉన్న నేపథ్యంలో డ్రామాకు తెరతీశారన్నారు. గతంలో అస్సాం ప్రభుత్వం కూడా ఇదే మాదిరిగా సీబీఐ విచారణ జరపడానికి వీల్లేదని జీఓ తెస్తే సుప్రీంకోర్టు కొట్టి వేసిందన్నారు. త్వరలోనే సుప్రీంకోర్టు, హైకోర్టుల నుంచి అస్సాం మాదిరి తీర్పులే వస్తాయన్నారు. కొంచెం ఆలస్యమైనా సీఎం, మంత్రుల అవినీతి, అక్రమాలపై విచారణ జరగడం..జైలుకెళ్లడం ఖాయమన్నారు.  

విచారణకు భయమెందుకు?  
తమ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యయత్నం కేసును టీడీపీ రాజకీయం చేస్తోందన్నారు.  కత్తి చిన్నదని చెబుతున్న సీఎం సీబీఐ విచారణకు ఎందుకు జంకుతున్నారని ప్రశ్నించారు.   చిన్న బ్లేడుతో కూడా ప్రాణం తీయవచ్చనే విషయం  తెలుసుకోవాలని సూచించారు.    

ఓటుకు నోటు కేసును ఏసీబీ ఏమి చేసింది?
ఉద్యోగులు లంచం తీసుకుంటూ పట్టుబడితే గుడ్డలు విప్పి విచారణ చేసే ఏసీబీ..ఓటుకు నోటు కేసులో రూ.కోట్ల రూపాయలతో అడ్డంగా చిక్కిన బాబును  ఏం చేసిందని ప్రశ్నించారు. ఏసీబీ సీఎం చేతిలో ఉండే సంస్థ అని మండిపడ్డారు.  సీఎం చంద్రబాబునాయుడుకు దమ్ముంటే  కాగ్‌ ను రద్దు చేయాలని ఆయన సవాల్‌ విసిరారు. కార్యక్రమంలో యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అక్కిమి అనుమంతరెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు శివరామిరెడ్డి నాయకులు విష్ణువర్ధన్‌రెడ్డి, వై.రాజశేఖరరెడ్డి, శ్రీనివాసరెడ్డి, దిలిప్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు