డిగ్రీ ఫైనలియర్‌లోనే ఐదు ఉద్యోగాలు!

4 May, 2019 20:49 IST|Sakshi

సాక్షి, జమ్మలమడుగు: పెద్ద పెద్ద చదువులు చదివి ఏదో ఒక ఉద్యోగం వస్తే చాలు అనుకునే వారికి ఈ పేదింటి బిడ్డ ఆదర్శంగా నిలిచింది. ఉద్యోగం పొందడానికి మరీ ఉన్నత చదువులే అక్కరలేదని నిరూపించి శభాష్‌ అనిపించుకుందీ అమ్మాయి. ఈమె ప్రతిభకు ఉద్యోగావకాశాలు దాసోహామయ్యాయి. ఒకటా రెండా ఏకంగా అయిదు సంస్థల్లో ఉద్యోగాలు ఈమె తలుపు తట్టాయి. చిన్నప్పటి నుంచి పట్టుదలగా చదివి రాణించడమే ఇందుకు కారణం. వైఎస్సార్‌ జిల్లా మైలవరం మండలం వేపరాలలో చేనేత కుటుంబానికి చెందిన బడిగించల క్రిష్టమూర్తి, రుణ్మికీల కుమార్తె భాగ్యలక్ష్మి. 10వ తరగతి వరకు గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో చదువుకుంది. జమ్మలమడుగులోని ఎస్పీ జూనియర్, డీగ్రీకాలేజీలో ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్‌ చేసింది. డిగ్రీ మొదటి సంవత్సరంలో 9.5 శాతం, రెండో సంవత్సరంలో 9.3 శాతం మార్కులు సాధించింది. ప్రస్తుతం మూడో సంవత్సరం పరీక్షలు రాసి ఫలితాల కోసం నిరీక్షిస్తోంది. చదువు సాగిస్తూనే తల్లితండ్రులకు ఆసరాగా ఉండాలని ఇంట్లో దుస్తులు కుడుతోంది. బాల్యం నుంచి పట్టుదల మెండుగా ఉన్న భాగ్యలక్ష్మి ప్రణాళికాబద్ధంగా చదువుకోవడం అలవాటు చేసుకుంది.

ఈ ఏడాది జనవరి నుంచి తిరుపతిలో విప్రో, టీసీఎస్‌.. కాకినాడలో క్యాప్‌ జెమినీ, హైదరాబాద్‌లో ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్‌ కంపెనీలు సెలెక్షన్లు నిర్వహించాయి. రాసిన ప్రతి పరీక్షలోనూ ఈమెను విజయం వరించింది. ఉద్యోగవకాశాలు తలుపు తట్టాయి. కంపెనీలు ఆఫర్‌ లెటర్లు పంపాయి. ఏకంగా ఐదు ఉద్యోగాలకు అర్హత సాధించడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేవు. భాగ్యలక్ష్మి ప్రతిభకు వేపరాల గ్రామస్తులు
హర్షం వ్యక్తం చేస్తున్నారు. డిగ్రీ ఫలితాలు వచ్చాక ఇందులో మంచి ఆఫర్‌ను ఎంపిక చేసుకుని చేరతానని భాగ్యలక్ష్మి ‘సాక్షి’తో చెప్పింది. చదువుతోపాటే భవిష్యత్‌కు బాటవేసుకోవాలని... ప్రతిభను చాటుకుంటే కచ్చితంగా ఉద్యోగావకాశాలు వస్తాయని జమ్మలమడుగుకు చెందిన విద్యావేత్త పి.నాగేశ్వరరెడ్డి చెప్పారు. 

మరిన్ని వార్తలు