నిలువునా ముంచారు

5 Aug, 2014 02:49 IST|Sakshi
నిలువునా ముంచారు

మచిలీపట్నం : బొమ్మరిల్లు ఫామ్స్ అండ్ విల్లాస్ ఇండియా లిమిటెడ్ అక్రమాలపై ఆ సంస్థ ఏజెంట్లు, ఉద్యోగులు, డిపాజిటర్లు ఆందోళన బాటపట్టారు. పైసాపైసా కూడబెట్టుకున్న డబ్బు దోచుకున్నారని డిపాజిటర్లు, సంస్థ చేసిన మోసానికి తాము బలవుతున్నామని ఏజెంట్లు, ఉద్యోగులు మండిపడుతున్నారు. ఈ మేరకు తమకు న్యాయం చేయాలని బొమ్మరిల్లు ఫామ్స్ అండ్ విల్లాస్ సంస్థ ఉద్యోగులు, డిపాజిట్‌దారులు సోమవారం స్థానిక కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. సంస్థ ప్రతినిధులు వెంటనే వచ్చి డిపాజిట్ సొమ్మును తిరిగి ఇవ్వాలని, లేదా ఇళ్ల స్థలాలు చూపించాలని నినాదాలు చేశారు. అనంతరం బొమ్మరిల్లు సంస్థ ప్రతినిధులపై చర్యలు తీసుకోవాలిన కోరుతూ ప్రజావాణిలో జేసీ జె.మురళీకి వినతిపత్రం అందజేశారు.
 
ఇదీ అసలు కథ..
 
రెండు సంవత్సరాల మూడు నెలల క్రితం మచిలీపట్నంలోని ఈడేపల్లిలో బొమ్మరిల్లు ఫామ్స్ అండ్ విల్లాస్ ఇండియా లిమిటెడ్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సంస్థను హైదరాబాదులో రిజిస్ట్రేషన్ చేశారు. విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నడిపారు. రోజువారీ వసూళ్లు చేయాలని కొంతమంది ఏజెంట్లను నియమించారు. ఈ మేరకు పలు విధాలుగా డిపాజిట్ల సేకరించారు.

గూడూరు మండలం పర్ణశాలలో 32 ఎకరాలను కొనుగోలు చేసి ఎనిమిది కోట్ల వ్యయంతో శ్రీరామరాజ్యం వెంచర్‌ను, బందరు మండలం గోకవరంలో 11 ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఒయాసిస్ సిటీ వెంచర్‌లను ప్రారంభించారు. ఈ భూములు బొమ్మరిల్లు ఫామ్స్ అండ్ విల్లాస్ ఇండియా లిమిటెడ్‌కు రిజిస్ట్రేషన్ చేసినట్లు అందరినీ నమ్మించారు. ఇళ్ల స్థలాలు విక్రయించాలని డిపాజిటర్లు,  కార్యాలయ ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలో ఇళ్ల స్థలాలు, డిపాజిట్లు, రోజువారీ వసూళ్ల ద్వారా మచిలీపట్నం కార్యాలయం నుంచి రూ.2.60 కోట్లను జమ చేశారు. డిపాజిట్ల గడువు ముగిసినా నగదు చెల్లించకుండా మొహం చాటేశారు.
 
ఎనిమిది నెలలుగా పత్తాలేరు
 
గత ఎనిమిది నెలలుగా బొమ్మరిల్లు సంస్థ యజమాని రాయల రాజారావు తప్పించుకు తిరుగుతున్నాడని కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించిన ఆ సంస్థ ఏజెంట్లు, కార్యాలయ ఉద్యోగులు చెబుతున్నారు. గూడూరు మండలం పర్ణశాలలో ఏర్పాటుచేసిన శ్రీరామరాజ్యం వెంచర్‌లోని స్థలాలను విక్రయించి డిపాజిటర్లకు నగదు చెల్లిస్తామని చెబుతున్నారని, కానీ ఒక్కరికి కూడా డబ్బు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. డిపాజిటర్లు తమపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని, వారికి సమాధానం చెప్పుకోలేకపోతున్నామని ఏజెంట్లు వాపోయారు. నవీన్‌మిట్టల్ కాలనీకి చెందిన లీలానాగమణి అనే ఏజెంట్‌పై డిపాజిటర్లు తీవ్రంగా ఒత్తిడి తేవటంతో వారితో వాగ్వాదానికి దిగిన ఆమె గొంతు మూగబోయిందని సహచరులు తెలిపారు.
 
పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందన శూన్యం
 
బొమ్మరిల్లు ఫామ్స్ అండ్ విల్లాస్ ఇండియా లిమిటెడ్ సంస్థపై తాము ఫిబ్రవరిలో చిలకలపూడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని, అయినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఏజెంట్లు తెలిపారు. బొమ్మరిల్లు సంస్థ నుంచి డిపాజిటర్లకు సొమ్ము చెల్లించేందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జేసీ మురళీకి ఇచ్చిన వినతిపత్రంలో కోరినట్లు చెప్పారు. బొమ్మరిల్లు సంస్థ యజమాని టీడీపీ నేత కావడం వల్లే ఆయన తప్పించుకు తిరుగుతున్నాడని ఏజెంట్లు తెలిపారు. ఎనిమిది నెలలుగా డిపాజిట్ల చెల్లింపుపై మిన్నకుండిపోయిన సంస్థ యజమాని రాజారావు.. కలెక్టరేట్ వద్ద తాము ఆందోళన చేస్తుంటే వెంటనే విరమించాలని ఫోన్ ద్వారా ఒత్తిడి తెస్తున్నారని బాధితులు చెప్పారు.
 

మరిన్ని వార్తలు