మన జిల్లాలో అరుదైన శాసనం..!

19 Jun, 2018 10:53 IST|Sakshi

మగ్దూమ్‌ సాహెబ్‌ కొట్టాల గ్రామంలో వెలుగుచూసిన వైనం

భైరవాలయం వద్ద మరిన్ని శిథిలాలు

లిపి చదివేందుకు యత్నాలు

జిల్లా చరిత్ర వెలుగుచూసే అవకాశం

సాక్షి, కడప కల్చరల్‌ : మన జిల్లాలో మరో శాసనం వెలుగుచూసింది. కడప నుంచి గండి వాటర్‌ వర్క్స్‌కు వెళ్లే దారిలో తూర్పునగల గుట్టపై మగ్దూమ్‌ సాహెబ్‌  కొట్టాల గ్రామంలో పురాతన శాసనం వెలుగులోకి వచ్చింది.    యానాదులు ఉంటున్న  ఈ గ్రామం కడప నగరం నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి పురాతనమైన శిథిలమై మొండిగోడలు మాత్రమే మిగిలి ఉన్న ఆలయంలో మూడేళ్ల క్రితం వరకు భైరవేశ్వరస్వామి విగ్రహం తల మాత్రమే ఉండేది. దానికి స్థానికులు పూజలు చేసేవారు. కాగా 2015లో కడపకు చెందిన ప్రైవేటు ఉపాధ్యాయుడు, ‘బాసట స్వచ్ఛంద సంస్థ’ అధ్యక్షులు మేరువ బాలాజీరావు ఆ గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నారు.  ఈ క్రమంలో ఆయన తన సభ్యులతో కలిసి పురాతన ఆలయాన్ని  పునర్నిర్మించారు. భైరవేశ్వరుని నూతన విగ్రహాన్ని తయారు చేయించి మూలవిరాట్టుగా ప్రతిష్టించారు.  ఆలయ ప్రాంగణంలో కనిపించిన భైరవేశ్వరుని శిథిల మూలమూర్తి, ఇతర దేవతా విగ్రహాలను ఆలయం చుట్టూ ప్రహరీగా నిలిపారు.


వెలుగు చూసిందిలా...
బాలాజీరావు ద్వారా సమాచారం తెలుసుకున్న ‘సాక్షి’ ప్రతినిధి ఆ ఆలయాన్ని సందర్శించారు.  ఆలయ  వివరాలుగల శాసనాలు, ఇతర ఆనవాళ్ల గురించి ఆరా తీశారు. ఆలయం ఎదురుగా ముళ్లపొదల్లో ఉన్న శాసనాన్ని స్థానికులు బయటకు తీశారు. అందులోని లిపిని గమనించిన సాక్షి ప్రతినిధి దాన్ని చరిత్ర పరిశోధకులు విద్వాన్‌ కట్టా నరసింహులుకు పంపారు. ఆయన దాన్ని పరిశీలించి ఆ బండపై ‘శ్రీ సమరాదిత్య’ అన్న అక్షరాలు ఉన్నాయని తెలిపారు. ఆ పురాతన లిపిని మరింత స్పష్టంగా పరిశీలించేందుకు మైసూరు పురాతత్వశాఖ ప్రతినిధులకు పంపారు. దాంతో పాటు మరో ఇద్దరు చారిత్రక పరిశోధకులకు కూడా పంపారు.  కాగా ఇంతవరకు చేసిన పరిశోధనలో జిల్లాలోని పెద్దముడియం గ్రామాన్ని సమరాదిత్య తదితర ప్రభువులు పాలించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోందని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఆలయం వద్ద లభించిన బండపై గల అక్షరాలు తక్కువే అయినా దీని ద్వారా జిల్లాకు సంబంధించిన మరింత చరిత్ర లభించే అవకాశం ఉందని ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా ప్రతినిధులు, చరిత్ర పరిశోధకులు చెబుతున్నారు. 

చరిత్ర వెలుగులోకి వస్తుంది...
ఈ గ్రామంలోని శ్రీ భైరవేశ్వరస్వామి ఆలయాన్ని చూసిన పెద్దలంతా ఇది పురాతనమైన ఆలయమని చెబుతున్నారు. ప్రస్తుతం లభించిన ఈ శాసనంలోని వివరాలు తెలిస్తే గ్రామచరిత్రతోపాటు జిల్లా చరిత్ర కూడా మరికొంత వెలుగుచూసే అవకాశం ఉంది.  
– మేరువ బాలాజీరావు, అధ్యక్షులు, బాసట స్వచ్ఛంద సేవా సంస్థ, కడప 

మరిన్ని వార్తలు