త్రిశంకు స్వర్గంలో వెటర్నరీ డాక్టర్లు

14 Oct, 2013 00:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ఆ వెటర్నరీ విద్యార్థులంత అదృష్టవంతులూ లేరు.. దురదృష్టవంతులూ లేరు. రాష్ట్రం లో పశువైద్యుల కొరత తీవ్రంగా ఉండడంతో బీవీఎస్సీ కోర్సు పూర్తయితే చాలు. ఇంటర్వ్యూలు కూడా లేకుండా ఉద్యోగాలు దొరికేవి. అలా వీరు అదృష్టవంతులు. అయితే, వారు చదివిన కాలేజీలకు గుర్తింపు రాకపోవడంతో డిగ్రీలు చెల్లనివిగా మారిపోయాయి. దీంతో వారు దురదృష్టవంతులుగా మిగిలి పోయారు. రాష్ట్రంలోని కోరుట్ల, ప్రొద్దుటూరు పశువైద్య కళాశాలలు నిబంధనలు పాటించనందున వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(వీసీఐ) గుర్తింపు రద్దు చేసింది. దీంతో వారు ఉద్యోగాలకు అర్హులు కాకుండా పోయారు. వివరాలిలా ఉన్నాయి.

 

పశువైద్య విద్య ప్రాధాన్యం గుర్తించిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి 2008-09లో కోరుట్ల, ప్రొద్దుటూరుల్లో రెండు వెటర్నరీ కళాశాలను ప్రారంభించారు. వైఎస్ మరణానంతరం సర్కార్ వీటిని పట్టించుకోలేదు. భవనాలు, అధ్యాపకులు, ప్రయోగశాలల ఊసే లేదు. వాటి గురించి హెచ్చరించినా స్పందన లేకపోవడంతో వీసీఐ ఆ రెండు కళాశాలల గుర్తింపు రద్దు చేసింది. అడ్మిషన్లను సైతం నిరాకరించింది. దీంతో ఆగమేఘాలమీద స్పందిం చిన రాష్ట్ర ప్రభుత్వం సిబ్బంది నియామకాలు పూర్తి చేసింది. భవనాల నిర్మాణం ప్రారంభించింది. ఈ ఏడాదికి అడ్మిషన్లకు అనుమతి సాధించింది. అయితే, ఐదేళ్ల క్రితం ప్రారంభమైన ఈ కాలేజీల్లో మొదటి బ్యాచ్ పూర్తయి ఈ నెలలో విద్యార్థులకు పట్టాలు కూడా వచ్చాయి. కానీ, ఆ కాలేజీల డిగ్రీలను వీసీఐ గుర్తించలేదు. రాష్ట్రంలో 469 వెటర్నరీ డాక్టర్ల పోస్టుల భర్తీకి ఇటీవలే నోటిఫికేషన్ జారీ అయింది. ఆపోస్టులకు ఈ రెండు కాలేజీల్లో పట్టాలు పొందినవారు అర్హులు కాకుండాపోయారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా త మ భవిష్యత్తు అంధకారమైందని ఆ కాలేజీలకు చెంది న 60 మంది గ్రాడ్యుయేట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
 త్వరలో గుర్తింపు వస్తుంది: డీన్ చంద్రశేఖర్‌రావు
 
 ప్రొద్దుటూరు, కోరుట్ల విద్యార్థుల సమస్యను పరిష్కరిస్తామని వెటర్నరీ యూనివర్సిటీ డీన్ చంద్రశేఖర్ రావు తెలిపారు. ఆ రెండు కాలేజీల డిగ్రీలకు త్వరలోనే వీసీఐ గుర్తింపు వస్తుందన్నారు.
 

మరిన్ని వార్తలు