పశువులకు ఇకపై ఆధార్‌

22 Apr, 2018 09:08 IST|Sakshi

వీరపునాయునిపల్లె : ఇప్పటివరకు మనుషులకు ఉన్న ఆధార్‌ నెంబర్‌ను ఇకపై పశువులకు కేటాయించే కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం చేపడుతోంది. పశు సంజీవని పథకంలో భాగంగా ఆనాఫ్‌ పేరుతో పాడి ఆవులు, గేదెలకు 12  అంకెలతో కూడిన ట్యాగును అమర్చుతారు. ఇనాఫ్‌ పేరుతో మొబైల్‌ యాప్‌ కూడా రూపొందించి ఈ కార్యక్రమానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికపుడు తెలుసుకునేలా చేస్తోంది. 
ఆన్‌లైన్‌లో పూర్తి సమాచారం
ట్యాగులోని 12 అంకెల ఆధారంగా పశువు పూర్తి సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. ఆ పశువు  ఎపుడు ఎక్కడ పుట్టింది. ఏజాతికి చెందింది, దాని యజమాని ఎవరు, ఇంతవరకు ఎన్ని ఈతలు ఈనింది, ఎన్ని పాలు ఇస్తుంది. ఏదైనా జబ్బు చేసినపుడు చికిత్స పొందిందా..లేదా.. ఎంత విలువ చేస్తుంది. ఇలా పశువు  పూర్తి సమాచారం అందులో ఉంటుంది. ఎవరైనా పశువును కొనాలనుకుంటే దాని నెంబర్‌ ఆధారంగా పెద్ద శ్రమ లేకుండా ఆన్‌లైన్‌లోనే పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.  
మందులు, దాణా పంపిణీ
పశువులకు సాధారణంగా వచ్చే వ్యాధులు, నివారణ మందులు, పోషక విలువలతో కలిగిన దాణా, పశుగ్రాసం, బీమా సాయం, ఇకమీదట పశువుకు తగిలించిన ట్యాగులోని బిల్ల ఆధారంగా జరుగుతాయని అధికారులు తెలిపారు. పరిమితికి మించి మందులు, దాణా, పశుగ్రాసం యజమాని పొందే అవకాశం ఉండదని తెలిపారు. బీమా సాయం కూడా ఒకసారికి మించి తీసుకునే వీలు ఉండదని అధికారులు చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు