ఆ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయండి: ఉప రాష్ట్రపతి

18 Feb, 2020 18:42 IST|Sakshi

కేంద్ర క్రీడా మంత్రికి ఉప రాష్ట్రపతి ఆదేశం

సాక్షి, ఢిల్లీ: తెలుగు రాష్ట్రా ల్లో క్రీడల అభివృద్ధికి చేపట్టిన ప్రాజెక్టుల పనులు వేగవంతం చేయాలని కేంద్ర క్రీడా మంత్రిని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆదేశించారు. ప్రైవేటు రంగాన్ని కూడా క్రీడాభివృద్ధిలో భాగస్వాములు చేయాలని సూచించారు. మంగళవారం ఉప రాష్ట్రపతి ఆయన నివాసంలో క్రీడా మంత్రి కిరణ్‌ రిజిజు , ఆ శాఖ కార్యదర్శి రాధే శ్యాం జులానియాతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల్లో క్రీడాభివృద్ధికి కేంద్రం తీసుకుంటున్న చర్యలు, వివిధ క్రీడా ప్రాంగణాల నిర్మాణ దశల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మొగళ్లపాలెంలో మల్టీపర్పస్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, విజయనగరంలోని విజ్జీ స్టేడియంలో మల్టీపర్పస్ ఇండోర్ హాల్, విశాఖపట్టణంలోని కొమ్మడి మిని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్, తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని జిల్లా క్రీడాప్రాధికార కేంద్ర మైదానంలో ఆస్ట్రో టర్ఫ్ హాకీ ఫీల్డ్ ఏర్పాటుతోపాటు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో క్రీడావసతులు తదితర అంశాలపై ఉప రాష్ట్రపతి ఆరా తీశారు.

గచ్చిబౌలి స్టేడియాన్ని సద్వినియోగపర్చుకోండి..
మంత్రి  సమాధానమిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌లో పలు ఇండోర్ స్టేడియంలతో పాటు, ఇతర ప్రాజెక్టుల కోసం నిధులు విడుదల చేశామని.. అయితే నిధుల  వినియోగ వివరాలు (యూసీలు) రావడం ఆలస్యం కావడంతో తదుపరి పనుల్లో జాప్యం అవుతున్నాయని వెల్లడించారు. యూసీలను తెప్పించుకుని..వీలైనంత త్వరగా మిగిలిన పనులను పూర్తి చేయాలని ఉపరాష్ట్రపతి ఆదేశించారని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశం మధ్యలో  ఏపీ క్రీడా శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌తో కూడా ఉప రాష్ట్రపతి చర్చించారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో అత్యాధునిక వసతులున్నాయని.. అక్కడ జాతీయస్థాయి క్రీడలు నిర్వహించి సద్వినియోగపరుచుకోవాలని ఆయన సూచించారు. 

కేంద్రాన్ని అభినందించిన ఉప రాష్ట్రపతి
దేశంలో క్రీడా రంగాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చర్యలను ఉప రాష్ట్రపతి అభినందించారు. మానవ వనరుల అభివృద్ధి, పెట్రోలియం సహా పలు శాఖలు.. దేశంలో క్రీడాభివృద్ధి కోసం క్రీడా మంత్రిత్వ శాఖకు తమవంతు సహకారం అందించేలా చర్చలు జరపాలని కూడా ఆయన సూచించారు. యూనివర్సిటీలు, కాలేజీలు కూడా క్రీడలను  ప్రోత్సహించాలని..ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణను రూపొందించుకోవాలని ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా