నేడు జిల్లాకు ఉపరాష్ట్రపతి

24 Aug, 2019 08:21 IST|Sakshi

మూడు రోజుల పాటు వెంకయ్యనాయుడు పర్యటన

25న గూడూరులో ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభం

అదే రోజు నెల్లూరులో వీఎస్‌యూ స్నాతకోత్సవానికి హాజరు

26న మిథాని పరిశ్రమకు శంకుస్థాపన

రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ రాక

సాక్షి, నెల్లూరు: భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంక్యనాయుడు శని వారం నుంచి మూడు రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సోమవారం జిల్లాకు రానున్నారు. ఉపరాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు రాష్ట్రగవర్నర్‌  బిశ్వభూషణ్‌ హరిచందన్‌ శనివారం నెల్లూరు నగరానికి వస్తున్నారు. అలాగే రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్, హోం శాఖ సహాయమంత్రి జీ కిషన్‌రెడ్డి పాల్గొంటా రు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు 24వ తేదీ మధ్యాహ్నం  12.20 గంటలకు చెన్నై ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో 1.20 గంటలకు నెల్లూరులోని పోలీస్‌ పరేడ్‌  గ్రౌండ్‌కు చేరుకుంటారు. అనంతరం నగరంలోని సర్ధార్‌ పటేల్‌ నగర్‌లోని స్వగృహానికి చేరుకుంటారు. మధ్నాహ్నం 3 గంటలకు నగరం నుంచి వెంకటాచలం రైల్వే స్టేషన్‌కు చేరుకుని ప్రత్యేక రైలులో చెర్లోపల్లి రైల్వేస్టేషన్‌కు చేరుకుంటారు. మార్గమధ్యంలో వెలిగొండల్లో నూతనంగా నిర్మించిన రైల్వే టన్నెల్‌ను పరిశీలిస్తారు. మళ్లీ తిరుగుప్రయాణమైన వెంకటాచలం చేరుకుని స్వర్ణభారత్‌ ట్రస్ట్‌లో రాత్రి బస చేస్తారు.

25వ తేదీ ఉదయం స్వర్ణభారత్‌ ట్రస్ట్‌లో ఏర్పాటు చేసే ఉచిత వైద్యశిబిరాన్ని ప్రారంభిస్తారు. ఆనంతరం గూడురు రైల్వే స్టేషన్‌కు చేరుకుని గూడూరు–విజయవాడ నడుమ నూతనంగా ఏర్పాటు చేసిన న్యూ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభిస్తారు. ఆనంతరం నెల్లూరు చేరుకుని కస్తూర్బా కళాక్షేత్రంలో జరిగే విక్రమ సింహపురి వర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు వీపీఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌కు చేరుకుంటారు. అక్కడ ఉపరాష్ట్రపతిగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా స్నేహితులు, శ్రేయోభిలాషులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి స్వర్ణభారత్‌ ట్రస్ట్‌కు చేరుకుంటారు. 26వ తేదీ ఉదయం 10.45 గంటలకు వెంకటాచలంలోని స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ నుంచి బయలుదేరి కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం బొడ్డువారిపాళెం గ్రామానికి చేరుకుంటారు. అక్కడ  మిశ్రధాతు నిగమ్‌ లిమిటెడ్‌ (మిథాని) నూతనంగా నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్‌ అల్యూమినియం అలీ ప్రొడక్షన్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం నాలుగు గంటలకు నెల్లూరు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. విజయవాడలోని ఆత్కూరులోని స్వర్ణభారత్‌ ట్రస్ట్‌లో రాత్రి బస చేస్తారు. ఉపరాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ శనివారం నెల్లూరు నగరానికి చేరుకొని ఉపరాష్ట్రపతికి స్వాగతం పలకనున్నారు. 

26న రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ రాక
కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఈ నెల 26వ తేదీ నెల్లూరుకు రానున్నారు. ఢిల్లీ నుంచి నేరుగా రేణిగుంటకు విమానంలో చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో నెల్లూరు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌కు చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గన బయలుదేరి బొడ్డువారిపాళెంలో నూతనంగా నిర్మించనున్న అల్యూమినయం ప్లాంట్‌ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఉపరాష్ట్రపతి నివాసంలో ఏర్పాటు చేసిన విందులో  పాల్గొంటారు.

నేడు గవర్నర్‌ రాక
నెల్లూరు(పొగతోట): రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ శనివారం నెల్లూరుకు రానున్నారు. ఉదయం విజయవాడలోని గన్నవరం విమానశ్రయం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.00 గంటలకు నెల్లూరు పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి నెల్లూరు ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 1.20 గంటలకు పోలీసుపరేడ్‌ గ్రౌండ్‌కు చేరుకుని ఉపరాష్ట్రపతికి స్వాగతం పలుకుతారు. అనంతరం ఉపరాష్ట్రపతితో కలిసి ఆయన నివాసానికి చేరుకుంటారు. మధ్యాహ్నం విజయవాడకు బయలుదేరివెళతారు.

భారీ బందోబస్తు
నెల్లూరు(క్రైమ్‌): ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు శనివారం జిల్లాకు రానున్నారు. ఈ నెల 26వ తేదీ వరకు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. శనివారం ఏపీ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ , 26వ తేదీన రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ కూడా జిల్లాకు రానున్నారు. దీంతో జిల్లా పోలీసు యంత్రాగం అప్రమత్తమైంది. భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. 1,294 మంది బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా ఎస్పీ ఐశ్వర్వ రస్తోగి చర్యలు చేపట్టారు. ఉపరాష్ట్రపతి పర్యటించే ప్రాంతాల్లో కల్వర్లు, రహదారులను బాంబ్, డాగ్‌ స్క్వాడ్‌లు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. అడుగడుగునా భారీగా పోలీసు బలగాలను మోహరించారు.

సిబ్బందికి సూచనలు చేస్తున్న ఎస్పీ ఐశ్వర్యరస్తోగి 
ట్రయన్‌ రన్‌ పూర్తి
ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. స్వర్ణభారతి ట్రస్ట్, వీపీఆర్‌ కన్వెన్షన్‌లో జరిగే కార్యక్రమాలకు లైజన్‌ ఆఫీసర్‌గా నాయుడుపేట ఎస్సై డీ వెంకటేశ్వరరావును నియమించారు. శుక్రవారం నెల్లూరులోని ఉమేష్‌చంద్ర మెమోరియల్‌ కాన్ఫరెన్స్‌ హాలు వద్ద బందోబస్తు విధుల్లో పాల్గొంటున్న సిబ్బందితో ఎస్పీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప రాష్ట్రపతి, కేంద్రమంత్రులు, రాష్ట్ర గవర్నర్‌ పర్యటనల దృష్ట్యా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. వారు పర్యటించే సమయంలో ఆయా ప్రాంతాల్లో వాహనాలను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరాదన్నారు. ట్రాఫిక్‌ అంతరాయం తలెత్తకుండా వాహనాలను దారి మళ్లించాలని సూచించారు. హెలిప్యాడ్, అభివృద్ధి కార్యక్రమాల వద్ద ముందస్తు అనుమతి పొందిన వారు మినహా ఇతరులను అనుమతించరాదని సూచించారు. బందోబస్తు విధుల్లో పాల్గొనే సిబ్బంది విధిగా ఐడీ కార్డులు, డ్యూటీపాస్‌లు వెంట ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ వీరభద్రుడు, ఎస్‌బీ డీఎస్పీ ఎన్‌.కోటారెడ్డి, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు. 

>
మరిన్ని వార్తలు