ప్రముఖులు ఏడాదికి ఒకసారే తిరుమలకు రావాలి!

4 Jun, 2019 10:04 IST|Sakshi

సాక్షి, తిరుమల: ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుటుంబసభ్యులతో కలిసి మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సామాన్య భక్తుడిలా సాంప్రదాయ దుస్తులతో వైకుంఠ ద్వారం మీదుగా ఆలయంలోకి ప్రవేశించిన వెంకయ్యనాయుడికి మహాద్వారం వద్ద టీటీడీ ప్రధాన అర్చకులు సాదర స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఆకలి, అవినీతి లేని సమాజం నిర్మాణం కావాలి. దైవదర్శనం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. వర్షాలు బాగా కురవాలి. ప్రకృతి వైపరీత్యాలు లేకుండా ఉండాలి’ అని ఆయన అన్నారు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే ప్రముఖులు శ్రీవారి దర్శనానికి రావాలని, తద్వారా సామాన్య భక్తులకు ఇబ్బంది కలుగకుండా ఉంటుందని పేర్కొన్నారు. తాను రాజకీయాల్లో లేనని, భవిష్యత్తులోనూ ఆ ఆలోచన లేదని స్పష్టం చేశారు.

అసమానతలు, ఘర్షణలు లేని సమాజం కావాలని కోరుకుంటున్నానని తెలిపారు. దేశానికి సేవ చేసుకునే శక్తిని ఇవ్వమని శ్రీవారి సన్నిధిలో మూడు రోజులు ఉంటున్నానని, దైవదర్శనం, సాహిత్యం, సత్సంగంతో ఆ శక్తి వస్తుందని విశ్వసిస్తున్నానని పేర్కొన్నారు. తిరుమలలో జరిగే అన్నదానం, నాద నీరాజనం కార్యక్రమాల్లో పాల్గొంటానని, భక్తి, ముక్తితోనే శక్తి వస్తుందని వెంకయ్యనాయుడు అన్నారు.

మరిన్ని వార్తలు