లాక్‌డౌన్‌ వేళ.. ఆన్‌లైన్‌ బాట

27 Mar, 2020 05:34 IST|Sakshi

అమాంతంగా పెరిగిన ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ వీక్షణం

నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌ప్రైమ్, హాట్‌స్టార్‌ తదితర ఓటీటీల వ్యూయర్‌షిప్‌ 25శాతం పెరుగుదల

సర్వీసు ప్రొవైడర్లపై అధిక లోడుతో ట్రాయ్‌ మార్గదర్శకాలు

హెచ్‌డీ కాకుండా ఎస్‌డీ క్వాలిటీతోనే ఓటీటీల ప్రసారాలు

సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా దేశమంతా లాక్‌డౌన్‌ నడుస్తోంది.. దాదాపు ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు.. ఈ నేపథ్యంలో.. ఓవర్‌ ద టాప్‌( ఓటీటీ) ప్లాట్‌ఫామ్స్‌ తెరలపై బొమ్మలు మరింతగా సందడి చేస్తున్నాయి. ప్రజలు తమ స్మార్ట్‌ టీవీలు, స్మార్ట్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లలో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌ ప్రైమ్, హాట్‌స్టార్, ఆహా  తదితర ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు అతుక్కుపోతున్నారు. తమకు ఇష్టమైన సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు, ఇతర కార్యక్రమాలు తెగ చూసేస్తున్నారు. దీంతో గత పది రోజుల్లో ఓటీటీల వ్యూయర్‌షిప్‌ 25శాతం పెరిగింది.  
►లాక్‌డౌన్‌ నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌ ప్రై మ్, హాట్‌స్టార్, జీ5, హంగామా డిజిటల్, ఆహా.. వంటి ఓటీటీ ప్లాట్‌ ఫామ్స్‌ మరింతగా విస్తరిస్తున్నాయి.  
►రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్, టాటాస్కై వంటి డీటీహెచ్‌ సర్వీసులు కూడా తమ ప్యాకేజీల్లో ఓటీటీలకు ప్రాధాన్యమిస్తున్నాయి.  
►రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఓటీటీల వీక్షణం అంతకంతకూ పెరుగుతోంది.  
►గతంలో ఉదయం 6 నుంచి 8, తిరిగి సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు ఓటీటీల వ్యూయర్‌షిప్‌నకు పీక్‌ టైమ్‌గా ఉండగా.. ఇప్పుడు ఉదయం 6 గంటల నుంచి అర్థరాత్రి వరకు పీక్‌ టైమ్‌గా ఉంటోంది.  
►ఓటీటీల వ్యూయర్‌షిప్‌ తక్కువ ఉండే మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల సమయంలోనూ ప్రస్తుతం వ్యూయర్‌షిప్‌ బాగా పెరిగింది. 
►ఇక లాక్‌డౌన్‌ సమయంలో.. చూడదగ్గ సూపర్‌హిట్‌లు, అవార్డులు సాధించిన సినిమాలు, ఇతర కార్యక్రమాల జాబితాలను కూడా జాతీయ, ప్రాంతీయ న్యూస్‌ చానళ్లు ప్రత్యేకంగా వివరిస్తుండటంతో ప్రజలు వాటిని చూసేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు.   
►ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు కొత్త చందాదారులు పెద్ద సంఖ్యలో చేరుతున్నారు కూడా.  
►ఏప్రిల్‌ 14 వరకు ఇదే పరిస్థితి కొనసాగనున్నట్లు పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

హెడ్‌డీ లేదు.. ఎస్‌డీనే..  క్వాలిటీనే..
►లాక్‌డౌన్‌ నేపథ్యంలో పలు ఐటీ, ఇతర కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోమ్‌ విధానాన్ని అమలు చేస్తుండటంతో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలందించే టెలికాం సంస్థలు, ఇంటర్నెట్‌ సర్వీసు ప్రొవైడర్లపై లోడ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది.
►మరోవైపు ఇళ్లల్లో ఉన్న వాళ్లు ఓటీటీల ద్వారా సినిమాలు, ఇతర కార్యక్రమాలను ఎక్కువగా చూస్తుండటంతో లోడ్‌ మరింత అధికమవుతోంది.
►ఈ నేపథ్యంలో  టెలికాం సర్వీసు ప్రొవైడర్ల సేవలకు విఘాతం కలుగకుండా ఉండేందుకు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ అన్నీ తమ ప్రసారాలను హెడ్‌డీ కాకుండా ఎస్‌డీ క్వాలిటీతో ఇవ్వాలని  కేంద్ర టెలికాం శాఖ ఆదేశించింది. 

ఆన్‌లైన్‌  పుస్తకాలూ  ఫ్రీ 
►ఆన్‌లైన్‌లో పుస్తకాలను అందిస్తున్న సంస్థలన్నీ వాటి సేవలను ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించాయి.  
►అమెజాన్‌ బుక్స్, కేంబ్రిడ్జ్‌ బుక్స్‌ లాంటి సంస్థలతో ప్రపంచంలోని దాదాపు అన్ని సంస్థలు ఆన్‌లైన్‌లో పుస్తకాలు చదువుకునేందుకు చార్జీలు వసూలు చేయడం లేదు. 
►పిల్లలు ఇష్టపడే పలురకాల చిత్రాలను కూడా ప్రఖ్యాత సంస్థలు ఉచితంగా అందిస్తున్నాయి. అందులో అమర్‌చిత్రకథ లాంటి వెబ్‌సైట్లు కూడా ఉన్నాయి.

మరిన్ని వార్తలు