కేసు నమోదవడం ఖాయం: ఎస్పీ వెంకట్‌రెడ్డి

22 Feb, 2020 12:44 IST|Sakshi

సాక్షి, తిరుపతి : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఈఎస్‌ఐ కుంభకోణంలో ఇద్దరు మాజీ మంత్రులకు ప్రమేయం ఉన్నట్లు తమకు ఆధారాలు లభించాయని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్పీ వెంకట్‌రెడ్డి తెలిపారు. మందుల కొనుగోళ్లు, ల్యాబ్ కిట్స్, బయోమెట్రిక్ మెషీన్లు, టెలీహెల్త్ సర్వీసెస్ అంశాలలో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం అయ్యాయని పేర్కొన్నారు. టెలీసర్వీసెస్‌కు చెందిన కాల్‌లిస్ట్‌ ఏపీది కాకుండా తెలంగాణాది ఇచ్చారని.. ఆ కాల్‌లిస్టును పరిశీలించగా బోగస్‌ అని తేలిందన్నారు. పేషెంట్స్‌ ఫోన్లు చేయకున్నా చేసినట్లు బిల్లులు చూపించారని తెలిపారు. ఎస్పీ వెంకట్‌రెడ్డి శనివారం మాట్లాడుతూ.. సీవరేజ్‌ ప్లాంట్లను నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఆదోనిలోని ఆస్పత్రిని మార్చినా.. పాత ఆస్పత్రిలోని ప్లాంట్‌ పేరుతోనే బిల్లులు పొందారని తెలిపారు. ఇందుకు మాజీ మంత్రి అచ్చెన్నాయుడు సిఫారసు చేశారని పేర్కొన్నారు.(ఏపీ ఈఎస్‌ఐలో భారీ కుంభకోణం)

‘నకిలీ కొటేషన్స్ పెట్టి కాంటాక్ట్ దక్కించుకున్నారు. అనవసర మందులు కొన్నారు. వాటిని వినియోగించలేదు. చాలా ఆసుపత్రుల్లో డ్రగ్స్ గోడౌన్స్‌కే పరిమితమయ్యాయి. అవసరానికి మించి మందులు కొనుగోలు చేశారు. చెల్లింపుల్లో కూడా నిబంధనలు ఉల్లంఘించారు. అవినీతికి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించి మొత్తం నివేదికను ప్రభుత్వానికి పంపించాం. మూడు నెలల పాటు విచారణ జరిపాం. గత ఐదు సంవత్సరాలలో కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం అయ్యాయి. ఇందులో ముగ్గురు డైరెక్టర్లు కీలక పాత్ర పోషించారు. ఓ మాజీ మంత్రి కుమారుడి పాత్ర కూడా ఉంది. అక్రమాలకు పాల్పడ్డ వారి మీద క్రిమినల్‌ కేసుల నమోదుకు సిఫారసు చేశాం. వారిపై కేసులు నమోదు కావడం ఖాయం’’ వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు.

బీసీ అయితే మాత్రం..
ఈఎస్ఐ స్కాంలో మాజీ మంత్రి అచ్చెంనాయుడు ప్రధాన నిందితుడని సీనియర్‌ న్యాయవాది పొనక జనార్ధన్‌రెడ్డి అన్నారు. 2016 నవంబరు 25న టెలీ హెల్త్ సర్వీసెస్ ప్రై లిమిటెడ్‌కు వర్క్ ఆర్డర్స్ జారీ చేశారని పేర్కొన్నారు. అధికారులను నిబంధనలు పాటించాలని చెప్పాల్సిన మంత్రి.. ఏకంగా ఏంఓయూ చేసుకోవాలని అదేశాలు జారీ చేయడం విడ్డూరం అన్నారు. ‘టెలీహెల్త్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవాలని అచ్చెంనాయుడు ఆదేశాలు జారీ చేశారు. కుంభకోణాలు చేసే వారికి కుల, లింగ, ప్రాంత విచక్షణలు ఉండవు. అచ్చెంనాయుడు బీసీ అయితే స్కాంపై విచారణ చేయకూడదా? జూన్ 2, 2014 నుంచి జరిగిన ప్రభుత్వ ఒప్పందాలన్నింటిపై సిట్ విచారణ పరిధిలోకి వస్తాయి’ అని పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు