అట్రాసిటీ కేసుల్లో అందని సత్వర న్యాయం

13 Dec, 2013 00:17 IST|Sakshi

కాకినాడ కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఎస్సీ,ఎస్టీ అత్యాచార కేసుల్లో సత్వర న్యా యం జరగక పోగా కేసు నమోదు సమయంలోనే బాధితులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, వివిధ దళిత సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం కలెక్టరేట్ విధానగౌతమి హాల్లో కలెక్టర్ నీతూ ప్రసాద్ అధ్యక్షతన కమిటీ సమావేశం జరిగింది. కమిటీ సభ్యులు, దళిత సంఘాల నాయకులు, బాధితుల నుంచి కలెక్టర్ ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు.
 దళిత సంఘాల నేతలు మాట్లాడుతూ అనేక అట్రాసిటీ కేసులు పెండింగులో ఉంటున్నాయన్నారు. కేసులపై సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని,  నిర్వీర్యం చేస్తున్నారని  ఆరోపించారు. ఎస్సీ,ఎస్టీ విద్యార్థుల కుల ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం జరుగుతోందని కమిటీ సభ్యుడు ధనరాశి శ్యాం సుందర్ అన్నారు. అట్రాసిటీ కేసుల్లో బాధితులకు పరిహారం అందడంలేదన్నారు.
 పెదపూడి మండలం కరకుదురులో ఆక్రమణలో ఉన్న14.55 ఎకరాల అసైన్డ్ భూమి విషయమై మూడుసార్లు కమిటీ సమావేశాల్లో ఫిర్యాదు చేసినా పరిష్కారం కాలేదని దళిత బహుజన ఫ్రంట్ జిల్లా నాయకులు చెంగళరావు, అప్పారావు అన్నారు. 1976లో 27మంది ఎస్సీలకు పట్టాలు ఇచ్చి  స్వాధీనం చేసిన ఈ భూమిని అగ్రవర్ణ వ్యక్తి ఆక్రమించుకుని చేపల చెరువులు సాగు చేస్తున్నాడని ఆరోపించారు. అధికారులు స్పందించి ఈ భూమిని లబ్ధిదారులకు స్వాధీనపరిచే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి యాదగిరి, సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డెరైక్టర్ మధుసూదనరావు, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ సిరి, అదనపు వైద్యాధికారి పవన్‌కుమార్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు