వ్యాపారుల ఉల్లికిపాటు

26 Sep, 2019 13:02 IST|Sakshi
ఏలూరులోని ఉల్లి హోల్‌సేల్‌ షాపుల్లో తనిఖీలు చేస్తోన్న అధికారులు

ఉల్లి హోల్‌సేల్‌ దుకాణాలపై విజిలెన్స్‌ దాడులు

ఏలూరు టౌన్‌: ఏలూరులోని ఉల్లి హోల్‌సేల్‌ దుకాణాలపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు అగ్రికల్చర్‌ మార్కెట్‌ కమిటీ సిబ్బందితో కలిసి సంయుక్తంగా దాడులు చేశారు. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి ఎస్‌.వరదరాజు ఆదేశాలతో విజిలెన్స్‌ డీఎస్పీ కేవీ రమణ ఆధ్వర్యంలో ఈ దాడులు చేపట్టారు. ఏలూరులోని శ్రీ సూర్యట్రేడర్స్, కేఆర్‌ ఆనియన్స్,శ్రీ భార్గవి ఆనియన్స్‌ హోల్‌సేల్‌ దుకాణల్లో అవినీతి జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. భారీ ఎత్తున ఉల్లిని దిగుమతి చేసి విక్రయాలు చేస్తూ లెక్కల్లో తక్కువగా చూపిస్తూ ప్రభుత్వానికి రూ.లక్షల్లో మార్కెట్‌ సెస్‌ ఎగ్గొడుతున్నట్టు అధికారులు గుర్తించారు. దుకాణాల గిడ్డంగుల్లో టన్నుల్లో ఉల్లిని నిల్వ చేసిన యజమానులు వాటికి సరైన రికార్డులు చూపించలేకపోయారు.

అవకతవకలు ఇలా..
సూర్య ట్రేడర్స్‌ యజమాని రవికుమార్‌ ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచీ ఇప్పటి వరకూ సుమారు 80 టన్నుల ఉల్లిని కొన్నారు. మొత్తం ఉల్లిని విక్రయించేసి రికార్డుల్లో మాత్రం 48 టన్నులు మాత్రమే నమోదు చేశారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన మార్కెట్‌ సెస్‌ను ఎగ్గొట్టారు. గత మూడేళ్ళుగా ఏలూరు అగ్రికల్చర్‌ మార్కెట్‌ కమిటీకి చెల్లించాల్సిన అసెస్మెంట్‌ కూడా సమర్పించలేదని అధికారులు గుర్తించారు. అలాగే కేఆర్‌ ఆనియన్స్‌ దుకాణంలో ఏప్రిల్‌ 11,464 టన్నుల సరకు విక్రయించినట్టు తేలింది. కానీ మార్కెట్‌ సెస్‌ను చెల్లించలేదు. సుమారు రూ.4లక్షల మేర సెస్‌ చెల్లించాలని అధికారుల అంచనా. దుకాణంలో మరో 20 టన్నుల ఉల్లి సరుకు నిల్వ ఉంచారు. వీటికి సరైన పత్రాలు లేవు. ఈ షాపులో రెండు ఎలక్ట్రానిక్‌ కాటాల లైసెన్స్‌ రెన్యూవల్‌ చేయకపోవటంతో తూనికలు, కొలతల శాఖ అధికారులు రెండు కేసులు నమోదు చేశారు. శ్రీ భార్గవి ఆనియన్స్‌ దుకాణాన్ని అసలు రికార్డులు లేకుండానే నిర్వహిస్తున్నారు. 21 టన్నుల ఉల్లిపాయలు ఉండడంతో విక్రయాలు నిలుపుదల చేసేలా ఏఎంసీ అధికారులకు సూచనలు ఇచ్చారు. ఈ మూడు దుకాణాల్లో సుమారు రూ.25 లక్షల విలువైన ఉల్లిపాయలు నిల్వ చేయటం, విక్రయించటం జరిగినట్లు విజిలెన్స్‌ అధికారులు గుర్తించారు. దాడుల్లో విజిలెన్స్‌ సీఐ జీవీవీ నాగేశ్వరరావు, ఏవో ఎం.శ్రీనివాసకుమార్, తహసీల్థార్‌ పీ.రవికుమార్, ఎస్‌ఐ కే.ఏసుబాబు, ఏఎంసీ సూపర్‌వైజర్‌ ఉన్నారు.

మరిన్ని వార్తలు