రైస్‌ మిల్లులపై విజి‘లెన్స్‌’

10 Dec, 2018 12:31 IST|Sakshi
రైసుమిల్లులో నిల్వ చేసిన బియ్యం బస్తాలు

 సత్యనారాయణ రైస్‌ మిల్లులో సోదాలు

రూ.40 లక్షల విలువైన 130 టన్నుల కోటా బియ్యం పట్టివేత

విశాఖపట్నం, రాంబిల్లి(యలమంచిలి), యలమంచిలిరూరల్‌: తెరువుపల్లి పరిధిలో రాంబిల్లి మండలం ఎస్సీ కాలనీ వద్ద గల సత్యనారాయణ రైస్‌ అండ్‌ ఫ్లోర్‌ మిల్లుపై శనివారం అర్ధరాత్రి విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు దాడులు చేశారు. అప్పటికే మిల్లు బయట కోటా బియ్యం బస్తాలు ఉన్నాయి. ఆ తర్వాత మరో ఆటోలో 18 బస్తాలు బియ్యం రాగానే అక్కడే మాటువేసిన విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు. విజిలెన్స్‌ ఎస్పీ కోటేశ్వరరావు నేతృత్వంలో డీఎస్సీ పీఎం నాయుడు పర్యవేక్షణలో విజిలెన్స్‌ అధికారులు దిమిలికి చెందిన చక్కా సత్యనారాయణ అలియాస్‌ నానాజీకి చెందిన రెండు రైసుమిల్లులు, వాటికి ఆనుకొని ఉన్న గదిలోనూ సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీ స్థాయిలో రేషన్‌ బియ్యం నిల్వలు బయట పడ్డాయి.

130 టన్నుల బియ్యం బస్తాలు పట్టుబడినట్టు విజిలెన్స్‌ ఎస్పీ కోటేశ్వరరావు విలేకరులకు తెలిపారు. ఈ బియ్యం విలువ రూ 40 లక్షలు ఉంటుందన్నారు. ఆటోను సీజ్‌ చేసి, ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు.  కోటా బియ్యాన్ని కొనుగోలు చేసి మిల్లులో రీసైక్లింగ్‌(పాలిష్‌)చేసి నాణ్యత గల బియ్యంగా మార్కెట్‌లో అమ్మడంతో పాటు పౌర సరఫరాల శాఖకు పంపడం చేస్తున్నారని తెలిపారు. రైసుమిల్లు యాజమాన్యంపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. కాగా గతంలో కూడా ఈ రైసుమిల్లులో రేషన్‌ బియ్యం పట్టుబడిన ఘటలున్నాయి. ఈ దాడుల్లో విజిలెన్స్‌ సీఐ ఎన్‌. శ్రీనివాసరావు, విజిలెన్స్‌ తహసీల్దార్‌ సుమబాల, సీఎస్‌డీటీ మురళి తదితరులు పాల్గొన్నారు. అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో పేదల బియ్యం పక్కదారి పడుతున్నాయన్న ఆరోపణలు సర్వత్రా వ్యక్తం అవుతోంది.

విజిలెన్స్‌ దాడులతో కలకలం
దిమిలి వద్ద రైసుమిల్లులపై ఆదివారం అధికారులు దాడులు చేయడం కలకలం సృష్టించింది. పేదల బియ్యంతో అక్రమ వ్యాపారం చేస్తూ కోట్లు కొల్లగొడుతున్న వ్యాపారులు ఉలిక్కి పడ్డారు. అయితే ఇలా పట్టుకున్న కేసులు కోర్టుల్లో  వీగిపోవడం, అధికారుల ఉదాసీనత కారణంగా పేదల బియ్యం పక్కదారి పడుతూనే ఉంది. ఇకనైనా అధికారులు పటిష్టమైన  చర్యలు తీసుకొని పేదల బియ్యం పక్కదారి పట్టకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా