పేటలో విజిలెన్స్ దాడులు

7 Jan, 2014 05:39 IST|Sakshi

 భానుపురి, న్యూస్‌లైన్ : సూర్యాపేట పట్టణంలో సోమవారం జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ రవివర్మ ఆధ్వర్యంలో సిబ్బంది ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. పట్టణ సమీపంలోని జీవీవీ గార్డెన్స్ ఎదురుగా గల కొల్లూరు వీరస్వామి నివాసంలో కర్నాటి నాగరాజు అనే వ్యాపారి గ్రామాల్లోని ప్రజల వద్ద కొనుగోలు చేసి అక్రమంగా నిల్వ చేసిన 176 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. అదే విధంగా పట్టణంలోని పలు చోట్ల రేషన్‌బియ్యం కొనుగోలు చేసి నిల్వ చేసిన మరో నాలుగు దుకాణాల్లో 179 క్వింటాళ్లు సీజ్ చేశారు. వారిపై 6ఏ కింద కేసులు నమోదు చేసి సీజ్ చేసిన బియ్యాన్ని ట్రేడ్ లెసైన్స్ కలిగిన వ్యాపారులకు అప్పగించారు.

 అదే విధంగా పట్టణంలోని రైతు బజార్ సమీపంలో గల మానస ఆయిల్ ఏజెన్సీలో అధికారులు తనిఖీ చేశారు. రికార్డులను సీజ్ చేసి తీసుకెళ్లారు. ఏజెన్సీలో 82వేల లీటర్ల వివిధ రకాల ఆయిల్ నిల్వ ఉంది. మూడేళ్లుగా ఏజెన్సీ వారు ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులను పరిశీలించనున్నట్లు ఎస్పీ తెలిపారు. విచారణ చేయడానికి కొన్ని రోజులు పడుతుందని, అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణ అయితే ఏజెన్సీ నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు. దాడుల్లో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐలు మోహన్‌రావు, స్వామి, డీఈ రవీందర్, డీసీటీవో లెనిన్, ఏవో శ్రీధర్‌రెడ్డి , సివిల్ సప్లయి టాస్క్‌ఫోర్స్ అధికారులు మహమూద్‌అలీ, ఆర్‌ఐలు శ్రీకాంత్, బ్రహ్మయ్య తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు