బడి బస్సులపై విజి‘లెన్స్‌’!

10 Jan, 2019 12:55 IST|Sakshi
బందరులో బస్సులను తనిఖీ చేస్తున్న విజిలెన్స్‌ అధికారులు

బందరు, గుడివాడ మండలాల్లో తనిఖీలు

బయటపడ్డ నిర్వహణ లోపాలు

ఆరు ప్రైవేటు పాఠశాలల బస్సులు సీజ్‌

38 కేసులు నమోదు

చదువులు, రవాణ పేరిట వేలాది రూపాయలు దండుకుంటున్న పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల భద్రతను గాలికొదిలేశాయి. జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలల ఆధ్వర్యంలో నడుస్తోన్న బస్సుల్లో డొల్లతనం బుధవారం విజిలెన్స్‌ తనిఖీల్లో బట్టబయలైంది. జిల్లాలో గుడివాడ, బందరు మండలాల్లోని ఎనిమిది ప్రైవేటు పాఠశాలలకు చెందిన 42 బస్సులను విజిలెన్స్, రవాణ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో బస్సుల్లో ఉన్న లోపాలు అధికారులు గుర్తించి.. 6 బస్సులను సీజ్‌ చేయడమే కాకుండా ఎంవీఐ యాక్ట్‌ కింద మరో 38 బస్సులపై కేసులు నమోదు చేశారు.

సాక్షి, అమరావతిబ్యూరో/గుడివాడ/కోనేరు సెంటర్‌ :  ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫీజులు వసూలు చేయడంలో చూపించే శ్రద్ధను.. ఆ విద్యార్థులను పాఠశాలలకు తరలించేందుకు, తిరిగి వారిని గమ్యస్థానాలకు చేర్చే విషయంలో చూపడం లేదు.  నిత్యం వినియోగిస్తున్న బస్సుల నిర్వహణను గాలికొదిలేశాయి. డాక్యుమెంట్ల పరంగా అన్ని బస్సులు పక్కాగా ఉన్నప్పటికీ భద్రత పరంగా మాత్రం నాసిరకమేనని తేలింది. అలాగే కనీస మౌలిక సౌకర్యాలు కూడా చాలా బస్సుల్లో కనిపించని పరిస్థితి. ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే మాత్రం విద్యార్థుల ప్రాణాలకు పెనుముప్పే వాటిల్లే అవకాశం పొంచి ఉంది. 90 శాతం బస్సుల్లో అగ్నిమాపక నివారణ పరికరాలు లేకుండానే బస్సులు  రహదారులు ఎక్కుతున్నాయి. చాలా మంది డ్రైవర్లు నిబంధనలు పాటించడం లేదు. యూనిఫాం వేసుకోవడం మానేశారు. బస్సును శుభ్రంగా ఉంచుకోవడం లేదు. డ్రైవర్ల వెనుక ఉండాల్సి రూట్‌మ్యాప్‌ జాడే కనిపించడం లేదు.

బయటపడ్డ డొల్లతనం
బస్సుల నిర్వహణ, తదితర అంశాలపై పలు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో విజిలెన్స్‌ ఎస్పీ వి. హర్షవర్ధన్‌రాజు ఆదేశాలతో విజిలెన్స్, రవాణా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం అధికారులు జిల్లాలో బందరు, గుడివాడ మండలాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో భాష్యం, రవీంద్రభారతి, విశ్వభారతి, శ్రీచైతన్య, విద్యాలయ, కేకేఆర్‌ గౌతం పాఠశాలలకు చెందిన 41 బస్సులను తనిఖీలు చేసిన అధికారులు బస్సుల నిర్వహణ పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. భద్రతాపరంగా అధ్వానంగా ఉన్న 6 బస్సులను సీజ్‌ చేశారు. మరో 38 బస్సులపై రవాణా చట్టం కింద కేసులు నమోదు చేసి యాజమాన్యాలకు నోటీసులు అందజేశారు. అలాగే వాటిని మరమ్మతులు చేసిన తర్వాత రవాణా శాఖ వద్ద అనుమతి పొందాకే వాటిని రోడ్లపై అనుమతించాలని ఆదేశించినట్లు విజిలెన్స్‌ డీఎస్పీ విజయ్‌పాల్‌ తెలిపారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్‌ ఇన్‌స్పెక్టర్లు, మోటర్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు