నాణ్యత డొల్ల.. ఆరోగ్యం గుల్ల

19 Dec, 2018 13:40 IST|Sakshi
వండిన ఆహారపదార్థాలను పరిశీలిస్తున్న విజిలెన్స్‌ అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ నూతలపాటి పూర్ణచంద్రరావు, సిబ్బంది

కంపుకొట్టే శనగపిండి.. నాసిరకం బియ్యం, కారం, నూనెల్లో లోపించిన నాణ్యత.. డైట్‌ క్యాంటీన్‌ పరిసరాల్లో అపరిశుభ్ర వాతావరణం.. ఇవి విజయవాడ సర్వజనాస్పత్రిలో విజిలెన్స్, ఫుడ్‌కంట్రోల్‌ అధికారుల తనిఖీల్లో కనిపించిన దృశ్యాలు. రోగులకు అందిస్తున్న ఆహారంలో నాణ్యత లోపించిందన్న ఫిర్యాదులతో అధికారులు మంగళవారం సాయంత్రం ఆస్పత్రిలోని డైట్‌ క్యాంటీన్‌లో ఆకస్మిక తనిఖీలు చేశారు.

లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పెట్టే ఆహారంలో నాణ్యత లోపించింది. సుద్దయిన అన్నం.. నీళ్ల చారు, మజ్జిక రోగులకు అందిస్తుండటంపై విజిలెన్స్‌ అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో విజిలెన్స్‌ ఎస్పీ హర్షవర్థన్‌రాజు ఆదేశాలతో జిల్లా ఆహార నియంత్రణ అధికారులతో కలిసి మంగళవారం సాయంత్రం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రోగులకు ఆహారం తయారు చేసే డైట్‌ క్యాంటీన్‌లోని పలు పదార్థాలను పరిశీలించడంతో పాటు, వాటిని తయారు చేసే వస్తువుల నాణ్యతపై సైతం పరిశీలించారు. శాంపిళ్లను సేకరించారు. అంతేకాక క్యాంటీన్‌లో 20 కేజీల రేషన్‌ బియ్యం ఉండటాన్ని సైతం విజిలెన్స్‌ అధికారులు గుర్తించారు. వంటకు వాడే ఉప్పు, కారం.. నూనె, చింతపండులతో పాటు, బియ్యం శాంపిళ్లను సేకరించి, ఆస్పత్రి డైటీషియన్‌ నుంచి విజిలెన్స్‌ అధికారులు లేఖను తీసుకున్నారు.

లోపాల పుట్ట..
జబ్బు చేసి చికిత్స కోసం వచ్చిన రోగులకు పెట్టే ఆహారంలో అనేక లోపాలు ఉన్నట్లు విజిలెన్స్, ఆహార నియంత్రణ అధికారులు గుర్తించారు. కంపుకొట్టే శసన పిండి, బూజు పట్టిన మినపగుళ్లతో పాటు, నాసిరకం కారం, నూనెలు వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. డైట్‌ క్యాంటీన్‌లో రేషన్‌ బియ్యం సైతం 20 కేజీలు వాడటాన్ని గుర్తించారు. ఆహారం తయారు చేసేందుకు ఆర్‌ఓ వాటర్‌ వాడాల్సి ఉండగా, బోరు వాటర్‌ వాడటాన్ని గుర్తించారు. అంతేకాకుండా రోగులకు ఆహారం తయారు చేసే క్యాంటీన్‌ అపరిశుభ్రంగా ఉండటంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆహార పదార్థాలు తయారు చేసేందుకు వాడే బియ్యం, ఉప్పు, కారం, నూనెల శాంపిళ్లను సేకరించారు.

ఫుడ్‌ కంట్రోల్‌ సర్టిఫికెట్టే లేదు..
వెయ్యి పడకల ప్రభుత్వాస్పత్రిలో రోగులకు ఆహారం పెట్టే కాంట్రాక్టర్‌కు ఫుడ్‌కంట్రోల్‌ సర్టిఫికెట్‌ సైతం లేదని విజిలెన్స్‌ తనిఖీల్లో                వెల్లడైంది. అసలు ఈ సర్టిఫికెట్‌ లేకుండా కాంట్రాక్టు ఎలా ఇచ్చారనేది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు రేషన్‌ బియ్యాన్ని రైస్‌ మిల్లులో పాలిష్‌ పట్టించి సన్నబియ్యంగా వాడుతున్నారని నిర్థారణకు వచ్చారు. ఆస్పత్రి ప్రాంగణంలో ఉన్న ప్రైవేటు క్యాంటీన్‌ను సైతం అధికారులు తనిఖీలు చేయగా, అక్కడ కూడా ఆహార పదార్థాలు నాణ్యత లోపించినట్లు గుర్తించారు. ఈ తనిఖీలో జిల్లా అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ నూతలపాటి పూర్ణచంద్రరావు, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ శేఖర్‌రెడ్డి, ఎస్‌ఐ సత్యనారాయణ, ఎడీఏ కళ్యాణ్‌కుమార్, హెడ్‌కానిస్టేబుల్స్‌ అన్సారీ, నాగభూషణంలు పాల్గొన్నారు.

కాంట్రాక్టరుకునోటీసులు ఇస్తాం..
ప్రభుత్వాస్పత్రిలో డైట్‌ కాంట్రాక్టరు నిర్వహించేందుకు ఫుడ్‌ కంట్రోల్‌శాఖ నుంచి సర్టిఫికెట్‌ లేదు. దీనిపై నోటీసులు జారీ చేస్తాం. మజ్జిగ, సాంబారు నాసిరకంగా ఉండటంతో పాటు, సుద్ద అన్నం పెడుతున్నట్లు మాకు ఫిర్యాదులు అందాయి. దీంతో తనిఖీలు నిర్వహించాం. బోరు నీటితో వంట చేయడంతో పాటు, అనేక లోపాలు గుర్తించి శ్యాంపిళ్లను సేకరించాం.– నూతలపాటి పూర్ణచంద్రరావు, విజిలెన్స్‌ అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా