సంక్షేమంలో తనిఖీల కలవరం!

7 Sep, 2018 13:45 IST|Sakshi
గుడ్లూరు ఎస్సీ హాస్టల్‌లో విద్యార్థుల వివరాలు సేకరిస్తున్న ఎండీవో నారాయణరెడ్డి

మొన్న ఏసీబీ.. నిన్న విజిలెన్స్‌..

హాస్టళ్లలో సంక్షేమాధికారుల ఆకస్మిక తనిఖీలు

ఇటీవల పశ్చిమలో బాలికల వసతి గృహాన్ని పరిశీలించిన న్యాయమూర్తి

వరుస దాడులతో సిబ్బందిలో ఆందోళన

ఒంగోలు టూటౌన్‌: జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల్లో తనిఖీల కలవరం పట్టుకుంది. ఇటీవల విజిలెన్స్‌ అధికారులు విస్తృత తనిఖీలు చేసి జిల్లా వ్యాప్తంగా కలవరం కలిగించగా.. ఆ తర్వాత ఏసీబీ అధికారులు ఊహించని విధంగా మార్కాపురంలోని సాంఘిక సంక్షేమ శాఖ కళాశాల వసతి గృహన్ని ఆకస్మిక తనిఖీలు చేశారు. ఇటీవల ఒక న్యాయమూర్తి సైతం పశ్చిమ ప్రాంతంలోని బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేశారు. ఆగస్టు నెల ప్రారంభంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ఉమాదేవి ఒంగోలు నగరంలోని వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహన్ని తనిఖీ చేశారు. తాజాగా గురువారం విజిలెన్స్‌ డీఎస్పీ రజనీకుమారి ఆధ్వర్యంలో జిల్లాలోని ఆరు  సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఏకకాలంలో  దాడులు నిర్వహించారు. ఇలా వరుస తనిఖీలతో అటు వసతి గృహాల సంక్షేమాధికారులతో పాటు ఆయా శాఖల జిల్లా అధికారులు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు. 

సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో 79 సంక్షేమ వసతి గృహాలు నడుస్తున్నాయి. మొత్తం 8,100 మంది మంజూరు సంఖ్యకుగాను 8,067 మందికి అవకాశం కల్పించారు. వీటిలో 62 వసతి గృహాల్లో బాలురు, 17 వసతి గృహాల్లో బాలికలు ఉండి విద్యనభ్యసిస్తున్నారు. బీసీ వసతి గృహాలు 77 ఉండగా వీటిలో 58 బాలురకు, 18 బాలికలకు కేటాయించారు. మొత్తం దాదాపు 6,749 మంది వరకు విద్యార్థులు ఈ వసతి గృహాలో ఉండి చదువుకుంటున్నారు. కళాశాల వసతి గృహాలు మరో 24 వరకు ఉన్నాయి. వీటిలో 12 బాలురకు, 12 బాలికల కోసం నడుపుతున్నారు. దాదాపు 18 63 మంది విద్యార్థులు ఉన్నారు. 77 వసతి గృహాల్లో 44 వసతి గృహాలు ప్రభుత్వ భవనాలు కలిగి ఉండగా, మిగిలిన వసతి గృహలు ప్రైవేట్‌ భవనాల్లో కొనసాగుతున్నాయి. గిరిజన సంక్షేమశాఖ ద్వారా 14 రెసిడెన్సియల్‌ పాఠశాలలు, 3 గిరిజన వసతి గృహాలు, 3 కళాశాల వసతి గృహాలు, 17 ఆశ్రమ పాఠశాలలు నడుస్తున్నాయి. వీటిలో 4,778 మంది విద్యార్థులు ఉన్నారు.

తనిఖీలతో వెలుగులోకి వస్తున్న సమస్యలు..
నిఘా సంస్థలు వసతి గృహాలపై ఆకస్మిక తనిఖీలు చేస్తుండటంతో పేద పిల్లల పడుతున్న ఇబ్బందులు వెలుగులోకి వస్తున్నాయి. ఒక్కొక్క హాస్టలో విద్యార్థులు  అనుభవిస్తున్న కష్టాలు విని చలించిపోతున్నారు. గత నెలలో జిల్లాలోని సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలపై పలుచోట్ల ఏకకాలంలో దాడులు చేయడంతో అనేక సమస్యలు వెలుగు చూశాయి. ఒంగోలులోని సాంఘిక సంక్షేమ శాఖ ఆనంద నిలయంలో విద్యార్థిను బాధలు అన్నీ, ఇన్నీ కావు, ఇచ్చిన మెను సక్రమంగా అమలు కావడం లేదు. సరిపడా బాత్‌రూమ్‌లు లేవు, ఇరుకు గదుల్లో తీవ్ర అగచాట్లు పడుతుండటం చూసిన తనిఖీ అధికారులు గుండె చెరువైయింది. అదే విధంగా శింగరాయకొండ బాలుర వసతి గృహం, అద్దంకి ఇలా పలు హాస్లళ్లలో పిల్లలు పడుతున్న బాధలు, కష్టాలు కళ్లకు కట్టినట్లు అధికారులకు కనపడ్డాయి. చాలా వసతి గృహాల్లో ఇప్పటికి నీటి వసతి లేని పరిస్థితి నెలకొంది. పశ్చిమ ప్రాంతంలో ఇటీవల ఒక న్యాయమూర్తి ఆకస్మికంగా ప్రభుత్వ బాలికల వసతి గృహన్ని తనిఖీ చేయడం, విద్యార్థినులు పడుతున్న అవస్థలు చూడటం, సంక్షేమ అధికారిణి పిల్లలను అవమాన కరంగా మాట్లాడుతుందో పిల్లల నోట విని విస్తుపోవాల్సి వచ్చింది.

సరుకు నిల్వల్లోనూ వ్యత్యాసం..
అదే విధంగా మంగళవారం జిల్లాలోని మార్కాపురంలోని సంక్షేమ శాఖ కళాశాల వసతి గృహంలో అవినీతి నిరోధక శాఖ ఆకస్మిక తనిఖీలు చేయడంతో అనేక వాస్తవాలు వెలుగు చూశాయి. రిజిస్టర్‌లో నమోదు చేసిన సంఖ్యకు వాస్తవంగా ఉన్న విద్యార్థుల సంఖ్యకు తేడా ఉన్నట్లు గుర్తించారు. నిత్యవసర వస్తువుల నిల్వలోనూ తేడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రభుత్వం ఇచ్చిన మెనూ ఎక్కడ అమలు కాని పరిస్థితి నెలకొంది. అదే విధంగా వలేటివారిపాలెంలోని ఎస్సీ వసతి గృహంలోనూ తనిఖీలు జరిగాయి. మరుగుదొడ్లు, నీటి వసతి లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. గత విజిలెన్స్‌ తనిఖీల సమయంలోనూ, ఇప్పుడు ఏసీబీ తనిఖీల సమయంలో చాలా భవనాలు మరమ్మతులకు గురై కనిపించాయి.

స్థానికంగా నివాసం ఉండని వార్డెన్లు..
రెండు నెలల క్రితం వసతి గృహాల్లో మెను సక్రమంగా అమలు కావడం లేదని నివేదికలు అందుకున్న కలెక్టర్‌ ఒకరిద్దరు వార్డెన్లను సస్పెండ్‌ చేశారు. ప్రతిరోజు ఆయా సంక్షేమ శాఖల అధికారులు హాస్టళ్లను తనిఖీలు చేస్తున్నా.. ఎక్కడా మార్పు కనిపించడం లేదు. కొంతమంది వార్డెన్లు స్థానికంగా ఉండకుండా చుట్టపు చూపుగా వెళ్లొస్తున్నారు. పిల్లలను వంట, వాచ్‌మెన్, సిబ్బందికి వదిలేసి వస్తున్నారు. ఇటీవల సాక్షి బృందం కూడా జిల్లాలోని పలు సంక్షేమ వసతి గృహాలను విస్తృతంగా పరిశీలించింది. విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు అయినా నేటికి విద్యార్థులు సమస్యలతో సతమతమవుతున్న పరిస్థితులు ఉన్నాయి. కొంతలో కొంతైనా నిఘా సంస్థలు తనిఖీలతో ఆయా సంక్షేమ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎప్పుడు ఏ వసతి గృహం తనిఖీ చేస్తారోనని భయం మాత్రం అందని వార్డెన్లలో నెలకొంది.

పాలకుల నిర్లక్ష్యంలో హాస్టళ్లు..
వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలు దశాబ్దాలుగా విద్యార్థును వెంటాడుతూనే ఉన్నాయి. పాలకుల నిర్లక్ష్యంలో కొట్టుమిట్టాడుతూనే ఉన్నాయి. ఏటా మరమ్మతుల పేరుతో తాత్కాలిక పనులు చేసి చేతులు దులుపుకోవడం పాలకులకు పరిపాటయింది. చాలా చోట్ల సొంత భవనాలు లేక అద్దె భవనాలలో ఏళ్ల తరబడి కొనసాగించాల్సి వస్తోంది. కొన్ని చోట్ల విద్యార్థులు తక్కువగా ఉన్నారన్నా కారణం చూపి వసతి గృహాలను మూసివేశారు. ఆయా వసతి గృహాలు ఇప్పటికి చిల్లచెట్లలో నిరూపయోగంగా పడి ఉన్నాయి.
 పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యాను అందించాలన్న లక్ష్యం ఏ కోశానా ప్రభుత్వంలో కనిపించని పరిస్థితి నెలకొంది. సంక్షేమ వసతి గృహలలో పేద పిల్లలకు కనీస మౌలిక చదుపాయాలు కల్పించాలని దళిత, గిరిజన, బీసీ నేతలు ఏ నాడు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన పాపన పోలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయా కులాల పేరుచెప్పి పదవులు అనుభవించడం తప్ప.. జాతి సంక్షేమం కోసం ప్రభుత్వంపై పోరాడిన నాయకులు కనిపించడం లేదని మండి పడుతున్నారు.

స్టాకులో తేడాలు..
గురువారం విజిలెన్స్‌ డీఎస్పీ రజనీకుమారి ఆధ్వర్యంలో జిల్లాలోని ఆరు  సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో  ఏకకాలంలో  దాడులు నిర్వహించారు. గుడ్లూరు, కొండపి, వెలిగండ్ల, దర్శి నియోజకవర్గంలోని కాకర్ల, కొత్తపట్నం మండలంలోని బాలుర, బాలికల వసతి గృహాలను తనిఖీ చేశారు. వీటిలో కొన్ని చోట్ల ఆహార పదార్థాల స్టాక్‌లో తేడాలు గుర్తించారు. కొత్తపట్నం మండంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో నూనె నిల్వలో కొంత తేడా గుర్తించగా, మెనూ సక్రమంగా అమలవుతుందని గుర్తించారు. మంచినీటి సమస్య అలానే ఉండటంపై వార్డెన్‌ను ప్రశ్నించారు. అదే విధంగా బాలికల వసతి గృహంలో మెనూతో పాటు రిజిస్టర్‌లో ఉన్న విద్యార్థుల సంఖ్యకు, వసతి గృహంలో ఉన్న విద్యార్థుల సంఖ్యకు పెద్ద తేడా లేదని గుర్తించారు. గుడ్లూరు వసతి గృహంలో బియ్యం నిల్వలో తేడాను గమనించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా