మార్కెట్ యార్డులో విజిలెన్స్ తనిఖీలు

20 Jan, 2014 23:47 IST|Sakshi

సాక్షి, గుంటూరు: గుంటూరు వ్యవసాయ మార్కెట్‌యార్డులో సోమవారం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ అధికారులు తనిఖీలు చేశారు. గతంలో మార్కెట్‌యార్డులో అగ్నిప్రమాదం సంభవించినప్పుడు హమాలీలకు ప్రభుత్వం చెల్లించిన పరిహారంపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. రెండు విడతలుగా పంపిణీ చేసిన పరిహారం మొత్తం విలువ రూ.41లక్షల వరకు ఉంది. బాధితుల వివరాలు, పరిహారం అందజేత సంతకాలకు సంబంధించిన ఫైలు యార్డులో మాయమైందని అధికారులు తేల్చారు.

వాస్తవాలపై విచారించి నివేదిక పంపాలని ప్రభుత్వం విజిలెన్స్ అధికారులకు ప్రత్యేక ఆదేశాలిచ్చింది. విజిలెన్స్ ఎస్పీ ఆర్‌ఎన్ అమ్మిరెడ్డి ఆదేశాల మేరకు తాజాగా విజిలెన్స్ సీఐ షేక్ ఖాశింసైదా, కె.వెంకట్రావు యార్డుకు వెళ్లారు. యార్డు కార్యదర్శి ఐ.నరహరిని కలిసి సదరు ఫైలు మాయంపై లిఖితపూర్వకంగా వివరాలను సేకరించారు. అనంతరం అప్పట్లో పరిహారం అందజేసిన యార్డు ఉద్యోగులు వి.ఆంజనేయులు, ఐ. వెంకటేశ్వరరెడ్డి, రమేష్, సుబ్రమణ్యం లను పిలిపించారు. వారి సమక్షంలోనే రికార్డు గదిని తెరి పించి ఫైళ్లు తనిఖీచేశారు.

 పరిహారం తీసుకున్న హమాలీల జాబితా, వారి సంతకాలు, ఏఏ బ్యాంకుల ఖాతాల్లో పరిహారం జమచేసిందనే అంశాలపై యార్డు ఉద్యోగులను విచారించారు. ఈ సందర్భంగా విజిలెన్స్ ఎస్పీ అమ్మిరెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ హమాలీల పరిహారం అందజేతపై విచారణను సగానికి పైగా పూర్తిచేశామని.. వీలైనంత త్వరలోనే వాస్తవాల్ని వెలుగులోకి తెస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు