బీపీఎల్‌పై విజి‘లెన్సు’

24 Feb, 2014 02:27 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, కడప: బిల్డింగ్ ఫీనలైజేషన్ స్కీమ్ (బీపీఎల్) దుర్వినియోగం అయింది. అక్రమార్కులకు అధికారయంత్రాంగం అండగా నిలిచింది. కోట్లాది రూపాయల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు అందాల్సి ఉండగా కార్పొరేషన్ నిర్లక్ష్యం ప్రదర్శించింది. బడా బాబులకు అండగా నిలుస్తూ ప్రభుత్వ ఆదాయానికి  శఠగోపం పెడుతున్న  యంత్రాంగంపై విజిలెన్సు దృష్టి సారించింది.
 
 కడప కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలను రెగ్యులర్ చేయించుకునేందుకు బీపీఎల్ స్కీమ్‌ను ప్రవేశ పెట్టారు. కారణాలు ఏమైనప్పటికీ అనుమతి లేకుండా నిర్మించిన భవనాలకు ఇదో సదవకాశం. కడప నగరంలో 4120 బిల్డింగ్‌లు బీపీఎల్ పరిధిలో ఉన్నట్లు గుర్తించారు. వీటన్నింటికీ నోటీసులు జారీ చేశారు. వీటిలో 3279  దరఖాస్తులకు పరిష్కారం లభించింది. ఈమేరకు సుమారు రూ. 5కోట్ల ఆదాయం లభించింది. అందులో సగం ఆదాయం సమకూర్చే మరో 911  భారీ భవనాలకు చెందిన దరఖాస్తులను  మరుగునపర్చారు. వీటిపై విజిలెన్సు యంత్రాంగం దృష్టి సారించింది.
 
 విఐపీలే అధికం...
 బీపీఎల్ ద్వారా రెగ్యులర్ చేసుకునేందుకు  పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులలో  వీఐపీలకు చెందినవే అధికంగా ఉన్నట్లు సమాచారం.  కార్పొరేషన్ యంత్రాంగాన్ని ఇంతకాలం రాజ్యాంగేతర శక్తి శాసిస్తూ వచ్చింది.  బిల్డింగ్ నిర్మించాలన్నా, కూలగొట్టాలన్నా తెరవెనుక ఉన్న  నేత కనుసైగలతో శాసించేవారు. ‘శివుని ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదు’ అన్నట్లుగా రాజ్యాంగేతర శక్తిని కాదని  ఎటువంటి  అనుమతి జారీ అయ్యేది  కాదు.
 
 ఇందులో భాగంగానే   బీపీఎల్‌కు సంబంధించి 911 భవనాలకు చెందిన దరఖాస్తులు  రెగ్యులర్ కాలేదు. రాజకీయ ప్రమేయంతో పాటు అధికారుల చేతులు బరువెక్కడం కారణంగానే ఈ దరఖాస్తులు మరుగున పడినట్లు తెలుస్తోంది. ఇందులో జరిగిన తెరవెనుక  బాగోతంపై  అందుకు సహకరించిన యంత్రాంగంపై కడప విజిలెన్సు డీఎస్పీ  రామకృష్ణ, తహశీల్దార్ శరత్‌చంద్రారెడ్డి విచారణ చేపట్టినట్లు విశ్వసనీయ సమాచారం.  సమగ్ర నివేదికను ప్రభుత్వానికి పంపనున్నట్లు తెలుస్తోంది. ఈవిషయం తెలుసుకున్న అధికారులు తేలుకుట్టిన దొంగల్లా వ్యవవహరిస్తున్నట్లు సమాచారం.
 

మరిన్ని వార్తలు