జీడి పరిశ్రమపై విజి‘లెన్స్’

20 May, 2014 01:15 IST|Sakshi
జీడి పరిశ్రమపై విజి‘లెన్స్’

 పలాస, న్యూస్‌లైన్ : ఉన్నట్టుండి ఒక్కసారిగా తమపై విజి‘లెన్స్’ పడటం.. దాడులు చేసి పెద్ద మొత్తంలో జీడిపప్పు నిల్వలు స్వాధీనం చేసుకోవడంతో పలాస జీడి పరిశ్రమ ఉలిక్కిపడింది. దాడుల భయంతో చాలా ఫ్యాక్టరీలు, షాపులు మూతపడ్డాయి. సోమవారం ఉదయం విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు జీడి పరిశ్రమల కేంద్రమైన పలాసలో దాడులు, సోదాలు జరిపారు. రికార్డుల్లో చూపకుండా నిల్వ చేసిన సుమారు కోటి రూపాయల విలువైన జీడిపప్పును స్వాధీనం చేసుకోవడంతోపాటు ఇద్దరు యజమానులపై కేసులు నమోదు చేశారు. దాడుల విషయం తెలిసి పలువురు వ్యాపారులు దుకాణాలు మూసివేసి వెళ్లిపోయారు. స్థానిక పారిశ్రామికవాడతోపాటు పట్టణంలోని పలు ఫ్యాక్టరీల పై విజిలెన్స్ అధికారులు దాడులు చేసి రికార్డులు, నిల్వలు పరిశీలించారు. రికార్డుల్లో చూపిన లెక్కకు.. వాస్తవంగా ఉన్న నిల్వలకు తేడా ఉన్న రెండు సంస్థలపై కేసులు నమోదు చేశారు. శ్రీనివాసనగర్‌లోని గణేష్ కాష్యూ ఇండస్ట్రీలో రికార్డుల్లో చూపకుండా నిల్వ చేసిన రూ.57,44,987 విలువైన పప్పును స్వాధీనం చేసుకున్నారు. పరిశ్రమ యజమాని బెల్లాల సత్యనారాయణపై కేసు నమోదు చేశారు.
 
 అలాగే సీతారామనగర్‌లోని కన్నన్ కాష్యూ ఇండస్ట్రీపై కూడా ఏకకాలంలో దాడులు చేసి అక్కడ నిల్వ ఉన్న సుమారు రూ.40 లక్షల విలువైన జీడిపప్పును పట్టుకున్నారు. పరిశ్రమ యజమాని మల్లా కాంతారావు నుంచి వివరణ తీసుకొని కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో శ్రీకాకుళం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంటు సీఐ సీహెచ్ ఉమాకాంత్, ఇన్ స్పెక్టర్ ఎల్.రాధమ్మ, డీసీటీవో ఎ.రఘురాం, హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణరావు, రామ్మోహన్‌రావు, బాబూరావు, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజిలెన్స్ ఎస్‌ఐ రాాధమ్మ ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ గణేష్ కాష్యూ ఇండస్ట్రీకి సంబంధించిన నిల్వ ఉన్న పప్పును పరిశీలించామన్నారు. దానికి సంబంధించి ఎటువంటి పత్రాలు లేవన్నారు. యజమాని బెల్లాల సత్యనారాయణను ప్రశ్నించగా ఇన్‌స్పెక్షన్ కోసం రికార్డులను పంపించామని త్వరలోనే వాటిని అప్పగిస్తామని చెప్పారన్నారు. సరైన రికార్డులు లేనట్లయితే వారి నుంచి అపరాధ రుసుము వసూలు చేస్తామన్నారు.
 

>
మరిన్ని వార్తలు