మొండి బకాయిలపై కొరడా..!

15 Nov, 2018 13:50 IST|Sakshi
షాపు యజమానులను విచారిస్తున్న విజిలెన్స్‌ సీఐ నాగరాజు

మున్సిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌ల బకాయిలు రూ. 2.32 కోట్లు

విజిలెన్స్‌ విచారణ

వైఎస్‌ఆర్‌ జిల్లా , ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని షాపింగ్‌ కాంప్లెక్స్‌లకు సంబంధించిన బకాయిల వసూళ్లపై విజిలెన్స్‌ అధికారులు బుధవారం విచారణ చేపట్టారు. విజిలెన్స్‌ సీఐ నాగరాజు ఆయా షాపింగ్‌ కాంప్లెక్స్‌ల గదుల్లో ఉన్నవారిని పిలిపించి విచారణ చేశారు. షాపు యజమానులతోపాటు ఆర్‌ఓ మునికృష్ణారెడ్డి, సంబంధిత మున్సిపల్‌ సిబ్బందిని విచారించారు. మున్సిపాలిటీ పరిధిలో ఎస్‌బీఐ షాపింగ్‌ కాంప్లెక్స్, వసంతపేట షాపింగ్‌ కాంప్లెక్స్, టీబీ కాంప్లెక్స్, కోనేటి కాలువ వీధి కాంప్లెక్స్, మార్కెట్‌ కాంప్లెక్స్, శివాలయం వీధి కాంప్లెక్స్‌ల్లో మొత్తం 215 షాపింగ్‌ గదులు ఉన్నాయి. వీటిలో 61 వాటికి సంబంధించి ఏళ్లతరబడి బకాయిలు ఉన్నాయి. ఈ మొత్తం రూ.2.32 కోట్లుగా అధికారులు గుర్తించారు. విజిలెన్స్‌ సీఐ వెంట హెడ్‌కానిస్టేబుల్‌ హరి, సిబ్బంది ఉన్నారు.

అన్ని గదులు ఖాళీనే..
ఎస్‌బీఐ కాంప్లెక్స్‌ పరిధిలో 19 గదులను, వసంతపేట కూరగాయల మార్కెట్‌ పరిధిలోని కాంప్లెక్స్‌లో 22 గదులను రూ.కోట్లు వెచ్చించి మున్సిపాలిటీ నిర్మించింది. వీటి నిర్మాణం తర్వాత రాజకీయ కారణాల వల్ల మూడేళ్ల పాటు ఇవి నిరుపయోగంగా ఉన్నాయి. ఎట్టకేలకు 2015 జనవరి 15న వీటికి వేలం పాట నిర్వహించారు. ఎస్‌బీఐ కాంప్లెక్స్‌లో 13, వసంతపేట షాపింగ్‌ కాంప్లెక్స్‌లో 11 గదులకు వేలం నిర్వహించారు. ఈ ప్రకారం షాపుల యజమానులు బకాయిలు ఉన్నట్లు ప్రతి నెలా మున్సిపల్‌ అధికారులు రికార్డులో రాసుకుంటున్నారు. వాస్తవానికి ఎస్‌బీఐ కాంప్లెక్స్‌లో ఒకటి, వసంతపేట కాంప్లెక్స్‌లో నాలుగు గదులను నడుపుతున్నారు. అయితే విద్యుత్‌ మీటర్లు, ఇతర మౌలిక వసతులు కల్పించకపోవడంతో లీజుకు తీసుకున్న గదులను కూడా కొంతమంది వినియోగించడం లేదు. ఈ రెండు కాంప్లెక్స్‌లకు సంబంధించే రూ.65 లక్షలు బకాయి ఉన్నట్లు సమాచారం.

గదిని వినియోగంచలేదు
ఎస్‌బీఐ కాంప్లెక్స్‌లో తనది 9వ గది. విద్యుత్‌ మీటర్‌ లేని కారణంగా తాను ఇంకా గదిని వినియోగించలేదు. ఇక్కడ మాత్రం బకాయి ఉన్నట్లు రాశారు. నా పేరు మీద రూ.3,57,500 బకాయి ఉన్నట్లు అధికారులు తెలిపారు.– జాఫర్‌ బాషా, దుకాణదారుడు

>
మరిన్ని వార్తలు