సీజనల్‌ హాస్టల్స్‌ అవినీతి బట్టబయలు!

27 Feb, 2019 13:02 IST|Sakshi
ఉల్లిపాలెంలో రికార్డులు తనిఖీ చేస్తున్న అధికారులు

విజిలెన్స్‌ తనిఖీల్లో వెలుగు చూసిన నిర్వాహకుల బాగోతం

విద్యార్థినులకు కాస్మొటిక్స్‌ చార్జీలు ఇవ్వని వైనం

విద్యా వలంటీర్ల జీతాల్లోనూ చేతివాటం

కోడూరు (అవనిగడ్డ): సర్వశిక్షా అభియాన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సీజనల్‌ హాస్టల్స్‌లో జరుగుతున్న అవినీతి విజిలెన్స్‌ తనిఖీల్లో బట్టబయలైంది. ఎన్‌జీవోల పర్యవేక్షణలో సాగాల్సిన ఈ హాస్టల్స్‌ నిర్వహణ పాఠశాలల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో జరుగుతున్నట్లు విజిలెన్స్‌ అధికారులు గుర్తించారు. మండలంలోని విశ్వనాథపల్లి, కోడూరు, ఉల్లిపాలెం ప్రాథమికోన్నత పాఠశాలల్లో నిర్వహిస్తున్న హాస్టల్స్‌పై మంగళవారం విజిలెన్స్‌ సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సిబ్బంది అకస్మిక దాడులు నిర్వహించారు. మూడు హాస్టల్స్‌లో విద్యార్థుల సంఖ్యకు రికార్డుల్లో ఉన్న సంఖ్యకు సంబంధం లేకపోవడంపై సీఐ నిర్వాహకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం, సాయంత్రం వేళల్లో మెనూ ప్రకారం భోజనం వండకుండా ఇష్టమొచ్చినట్లుగా వంటలు సిద్ధం చేస్తున్నారని సీఐ గుర్తించారు. ప్రతి నెల ఇవ్వాల్సిన కాస్మెటిక్స్‌ చార్జీలను సైతం నిర్వాహకులు విద్యార్థినులకు ఇవ్వకుండా తమ ఖాతాల్లో జమ చేసుకుంటున్నట్లు తనిఖీల్లో బయటపడింది. ఇళ్ల వద్ద నుంచి వచ్చే డబ్బులతోనే కావాల్సిన వస్తువులను కొనుగోలు చేసుకుంటున్నట్లు విద్యార్థులు అధికారులకు తెలిపారు.

విద్యా వలంటీర్ల జీతాల్లోనూ చేతివాటం..
ప్రస్తుతం హాస్టల్స్‌లో ఉండే విద్యార్థుల సంరక్షణతో పాటు బోధన చేసేందుకు విద్యా వలంటీర్లను నియమించారు. వీరికి ప్రభుత్వం రూ.5 వేలు జీతం కూడా ఇస్తుంది. అయితే ఈ నగదును నిర్వాహకులు పూర్తిగా వాలంటీర్లకు ఇవ్వకుండా చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు సీఐ తెలిపారు. వారికి నిర్వాహకులు కేవలం రూ.3 వేలు మాత్రమే ఇచ్చి మిగిలిన రూ.2 వేలను కాజేస్తున్నట్లు తమ దర్యాప్తులో తెలిందన్నారు. కొన్ని చోట్ల హాస్టల్స్‌ నిర్వహణ బాగానే ఉన్నా, మరికొన్ని చోట్ల అధికారుల పర్యవేక్షణ లోపంతో మరీ అధ్వానంగా ఉందన్నారు. డీఎస్పీ విజయపాల్‌ ఆదేశాల మేరకు ఈ ఆకస్మిక దాడులు చేశామని, వీటిపై నివేదిక సిద్ధం చేసి ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు సీఐ వెంకటేశ్వర్లు వివరించారు. ఎఫ్‌ఆర్‌ఓ తిమోతి, డీఈ వెలుగొండయా, సీనియర్‌ అసిస్టెంట్‌ మణికుమార్, కానిస్టేబుల్‌ నాగభూషణం, ఎంఈవో టీవీఎం. రామదాసు తదితరులు తనిఖీల్లో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు