రేషన్‌ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకున్న విజిలెన్స్‌

19 Nov, 2018 08:21 IST|Sakshi
రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, లారీ డ్రైవర్‌ను అరెస్ట్‌ చేసిన విజిలెన్స్‌ అధికారులు

16 టన్నుల బియ్యంతో లారీ సీజ్‌  

పశ్చిమగోదావరి , ద్వారకాతిరుమల: అక్రమంగా రేషన్‌ బియ్యాన్ని తరలిస్తున్న లారీని విజిలెన్స్‌ అధికారులు అడ్డుకున్నారు. అనంతరం వాహనంతో పాటు రూ.3.68 లక్షల విలువైన 16 టన్నుల రేషన్‌ బియ్యాన్ని వారు స్వాధీనం చేసుకుని ద్వారకాతిరుమల పోలీస్టేషన్‌కు తరలించారు. ఈ ఘటన తిమ్మాపురంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. విజిలెన్స్‌ సీఐ ఎన్‌వీ.భాస్కర్‌ కథనం ప్రకారం ఖమ్మం నుంచి తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామంకు అక్రమంగా రేషన్‌ బియ్యం తరలివెళుతుందన్న సమాచారాన్ని అందుకున్న విజిలెన్స్‌ అధికారులు మండలంలోని తిమ్మాపురం వద్ద కాపు కాశారు. ఈ క్రమంలో ఖమ్మం జిల్లా మంగలగూడెంకు చెందిన శ్రీరంగం సత్యం, శివనాగుల శ్రీనులకు చెందిన రేషన్‌ బియ్యం లోడు లారీని ఆపి విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

16 టన్నుల రేషన్‌ బియ్యం అక్రమంగా తరలి వెళుతుండడాన్ని గుర్తించిన విజిలెన్స్‌ అధికారులు వాహనంతో సహా సరుకును సీజ్‌ చేశారు. అనంతరం లారీ డ్రైవర్‌ వేముల ఎల్లయ్యను అరెస్ట్‌ చేసి, క్రిమినల్‌ కేసు నమోదు చేశారు.ఆ తరువాత కామవరపుకోట డెప్యూటీ తహసీల్దార్‌ ఆర్‌వీ.మురళీకృష్ణ, వీఆర్వో లక్ష్మీపతి ద్వారకాతిరుమల పోలీస్టేషన్‌లో అప్పగించారు. దీనిపై విజిలెన్స్‌ సీఐ భాస్కర్‌ మాట్లాడుతూ లారీ డ్రైవర్‌ ఎల్లయ్య రెండు నెలల క్రితం రేషన్‌ బియ్యాన్ని తరలిస్తూ దేవరపల్లిలో తమ చేతికి చిక్కాడన్నారు. మళ్లీ ఇప్పుడు దొరికాడన్నారు. ఈ దాడిలో విజిలెన్స్‌ ఎస్సై కె.సీతారాము తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు