మాస్ కాపీయింగ్‌పై నిఘా

6 Mar, 2014 02:56 IST|Sakshi

 కర్నూలు:
 ఇంటర్మీడియెట్ బోర్డు తొలిసారిగా పరీక్ష కేంద్రాలపై సెల్ టవర్ల సహాయంతో నిఘా సారించనుంది. ఈనెల 12 నుంచి పరీక్షలు ప్రారంభం కానుండటంతో మాస్ కాపీయింగ్.. అవకతవకలను అరికట్టేందుకు అత్యాధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించేందుకు సిద్ధమవుతోంది.

 

హైదరాబాద్‌లోని ఇంటర్ బోర్డు ప్రధాన కార్యలయంలో ఏర్పాటు చేసిన జీపీఎస్‌తో అన్ని పరీక్షా కేంద్రాలను అనుసంధానించి సెల్‌టవర్ల సహాయంతో పర్యవేక్షించనున్నారు. సెల్‌ఫోన్లు, ఇంటర్నెట్ ద్వారా మాస్‌కాపీయింగ్ జరుగుతోందనే సమాచారంతో బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. యేటా కీలక పరీక్షల సమయంలో ఇన్విజిలేటర్లు, కొందరు ఉద్యోగులు అక్రమాలకు తెరతీస్తున్నారు. పరీక్షల ప్రారంభానికి ముందు ఫోన్ల ద్వారా ప్రశ్నపత్రం లీక్ చేస్తుండటంతో ప్రతిభావంతులైన విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతోంది.

 

కొన్ని కళాశాలలు పరస్పర ఒప్పందంతోఅవకతవకలకు తెరతీస్తున్నారు. వీటన్నింటినీ అడ్డుకట్ట వేసేందుకు జీపీఎస్ పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత ముగిసే వరకు ఇంటర్ బోర్డు కార్యాలయం నుంచి సెల్‌టవర్ల ద్వారా మొత్తం ప్రక్రియపై నిఘా వేయనున్నారు. పరీక్ష కేంద్రంలో సెల్‌ఫోన్ మోగినా, ఏదైనా సెల్‌కు మెసేజ్ వచ్చినా, ఇంటర్నెట్ వాడకం జరిగినా వెంటనే ఆ సమాచారం ఇంటర్ బోర్డు ప్రధాన కార్యాలయానికి చేరేలా ఏర్పాట్లు చేపట్టారు. ఆ వెంటనే బోర్డు అధికారులు తనిఖీ బృందాలను అప్రమత్తం చేసి మాస్ కాపీయింగ్‌ను అడ్డుకునేలా చర్యలు తీసుకున్నారు.
 
 9 గంటల తర్వాత
 అనుమతించబోం: ఆర్‌ఐఓ
 విద్యార్థులను నిర్ణీత సమయం 9 గంటల తర్వాత పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని ఆర్‌ఐఓ టీ.వీ.ఎస్. రావు ‘సాక్షి’కి తెలిపారు. గతంలోనూ పరీక్ష 9 గంటలకు ప్రారంభమవుతున్నా.. 9.45 గంటల వరకు అనుమతించేవారు. తాజా సంస్కరణల నేపథ్యంలో ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించకూడదని బోర్డు నిర్ణయించింది. కొన్ని పరీక్ష కేంద్రాల్లో ప్రశ్నపత్రం విప్పగానే సెల్‌ఫోన్ సహాయంతో ప్రశ్నలు చేరవేయడం.. విద్యార్థులు సమాధానాలు చదువుకుని కాస్త ఆలస్యంగా పరీక్షకు వెళ్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిర్ణీత సమయం తర్వాత విద్యార్థులను అనుమతించకూడదని బోర్డు ఆదేశించినట్లు ఆర్‌ఐఓ వెల్లడించారు

>
మరిన్ని వార్తలు