నేల‘పాలు’

7 Mar, 2019 13:03 IST|Sakshi
ప్యాకెట్ల బాక్సు నుంచి కారుతున్న పాలు

అంగన్‌వాడీ పాల ప్యాకెట్లు 90 రోజులు నిల్వ ఒట్టిమాటే

ఉబ్బిపోయి దుర్వాసన వస్తున్న ప్యాకెట్లు

కొన్ని ప్యాకెట్ల నుంచి పురుగులు వస్తున్న వైనం

బి.కొత్తకోట మండలంలో వెలుగుచూసిన సంఘటన

చిత్తూరు, బి.కొత్తకోట: అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్న విజయాపాలు నేలపాలవుతోంది. 90 రోజులు నిల్వ ఉంటుందని అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రభుత్వం సరఫరా చేస్తోంది. నిల్వ ఉండకపోగా భరించలేని దుర్వాసన వెదజల్లుతున్నాయి. ఈ ఘటన బుధవారం బి.కొత్తకోటలో వెలుగుచూసింది.

పాలల్లో పురుగులు
రాష్ట్రంలోని పలు జిల్లాలకు ప్రభుత్వ డెయిరీ విజయా ద్వారా ప్యాకింగ్‌ చేసిన పాలను సరఫరా చేస్తోంది. సరఫరా చేసిన పాలకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ద్వారా బిల్లులు చెల్లిస్తున్నారు. ఈ నెల 22న బి.కొత్తకోట మండలంలోని అంగన్‌వాడీ కేంద్రాలకు 500 మి.లీ. పాల ప్యాకెట్లను సరఫరా చేశారు. నిబంధనల ప్రకారం ప్యాకెట్లు 90రోజుల పాటు నిల్వ ఉండాలి. కేంద్రాల పరిధిలోని బరువున్న పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారంగా ప్రతిరోజూ 200 మి.లీ.పాలను అందించాలి. దీనికి అనుగుణంగా ప్యాకెట్లు సరఫరా చేస్తారు. మండలానికి సరఫరా చేసిన ప్యాకెట్లు గరళంగా మారాయి. బాక్సుల్లో వచ్చిన ప్యాకెట్లు పగిలిపోయాయి. పాలు కారిపోవడం, ప్యాకెట్లు ఉబ్బిపోయి పగిలేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ ప్యాకెట్ల నుంచి భరించలేనంత దుర్వాసన వస్తోంది. కొన్ని ప్యాకెట్ల నుంచి పురుగులు కూడా వచ్చాయి. వీటిని గమనించిన కేంద్రాల సిబ్బంది దుర్వాసన భరించలేక పారబోశారు. ఐసీడీఎస్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్తే మందలిస్తారన్న భయంతో కొందరు మిన్నకున్నారు. నష్టాన్ని భరించాల్సి వస్తుందని మరికొం దరు పరిస్థితిని అధికారులకు తెలియజేశారు.

కరువైన పర్యవేక్షణ
90 రోజులు నిల్వ ఉండాల్సిన పాలు కొన్ని రోజులకే పాడవుతున్న విషయంపై సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేద ని తెలిసింది. ఇలాంటి పాలను అందిస్తే రోగాలబారిన పడే ప్రమా దం ఉంది. ఈ పరిస్థితి జిల్లా మొత్తం ఉందని తెలుస్తోంది. అధికా రులు బయటకు పొక్కనీయకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారని తెలుస్తోంది. పాలను సరఫరా చేసే ముందు డెయిరీ అధికారులు పరిశీలిస్తున్నారా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కర్ణాటకలో తయారు
కేంద్రాలకు సరఫరా చేస్తున్న 500 మి.లీ. ప్యాకెట్లు కర్ణాటకలోని కోలారుతో తయారు చేయిస్తున్నామని మదనపల్లె విజయా డెయిరీ పాలశీతలీకరణ కేంద్రం డెప్యూటీ డైరెక్టర్‌ చెప్పారు. ఈ విషయమై  బుధవారం ఆయన మాట్లాడుతూ కోలారులోని ప్రయివేటు కేంద్రంలో పాలను ప్యాక్‌ చేసి సరఫరా చేస్తుందన్నారు. దీనికి కవర్లు తాము సరఫరా చేస్తామని, కేంద్రం పాలను నింపి అందిస్తుందని చెప్పారు. చెడిన పాల ప్యాకెట్లపై విచారణ చేయిస్తామని చెప్పారు. కాగా ప్రయివేటు డెయిరీలో జరుగుతున్న పాల ప్యాకింగ్‌ పర్యవేక్షణపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని వార్తలు