‘ఏపీ హైకోర్టులో ఖాళీగా 22 జడ్జీల పోస్టులు’

5 Dec, 2019 17:25 IST|Sakshi

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ప్రస్తుతం 22 న్యాయమూర్తుల పదవులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ వెల్లడించారు. గురువారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. అదేవిధంగా మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ.. హైకోర్టులో న్యాయమూర్తుల బదిలీ లేదా పదవులు ఖాళీ కావడానికి ముందుగానే వాటిని భర్తీ చేసే ప్రక్రియను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తే చేపడతారని ఆయన తెలిపారు. అయితే ఈ ఆరు మాసాల కాలవ్యవధిని విధిగా పాటించాల్సిన అవసరం లేదని మంత్రి పేర్కొన్నారు. 

న్యాయమూర్తి పోస్టుల భర్తీ లేదా బదిలీ అనేది ప్రభుత్వం, న్యాయవ్యవస్థ మధ్య సమన్వయంతో నిరంతరం జరిగే ప్రక్రియ అని ఆయన తెలిపారు. వివిధ రాజ్యాంగ వ్యవస్థలు, రాష్ట్రాలు, కేంద్ర స్థాయిలో సంప్రదింపులు జరిపి అనుమతులు పొందాల్సి ఉండటం వల్ల జడ్జీల నియామకంలో జాప్యం నెలకొంటోందని ఆయన వెల్లడించారు. ఖాళీలను వేగంగా భర్తీ చేయడానికి ఒకవైపు చురుగ్గా చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. పదోన్నతులు, పదవీ విరమణ, న్యాయమూర్తుల సంఖ్యాబలం పెంపు వంటి కారణాల వలన హైకోర్టు జడ్జీల పదవులకు ఖాళీలు ఏర్పడుతూనే ఉంటాయని మంత్రి వివరించారు.

మరిన్ని వార్తలు