ఆక్రమణదారులకు ‘సిట్‌’తో శిక్ష తప్పదు : విజయసాయి రెడ్డి

30 Oct, 2019 06:40 IST|Sakshi
సభలో జ్యోతిప్రజ్వలన చేస్తున్న ఎంపీ విజయసాయి రెడ్డి

సాక్షి, విశాఖపట్నం: విశాఖలో జరిగిన భూ కుంభకోణాలు, భూ దందాలపై ప్రభుత్వం నియమించిన సిట్‌తో అవినీతికి పాల్పడిన వారికి కఠిన శిక్షలు తప్పవని ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, ఎంపీ వి.విజయసాయిరెడ్డి అన్నారు. భూ కుంభకోణాల్లో నష్టపోయిన, భూములు కోల్పోయిన బాధితులకు త్వరలో న్యాయం జరుగుతుందన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో పలు వార్డుల్లో రోడ్లు, వంతెనలు, కాలువల నిర్మాణ పనులకు మంగళవారం రాష్ట్ర పర్యాటక శాఖమంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం వైఎస్సార్‌ సీపీ ఉత్తర సమన్వయకర్త కె.కె.రాజు ఆధ్వర్యంలో డీఎల్‌బీ గ్రౌండ్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలనలో పుష్కలంగా ప్రాజెక్టులు నిండాయని, నాలుగు లక్షల మందికి పైగా నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు మంచి రోజులొచ్చాయని, ప్రభుత్వ ఆస్పత్రులు కార్పొరేట్‌ స్థాయిలో అభివృద్ధి చెందనున్నాయని తెలిపారు. చెప్పిన దాని కన్నా ముందే.. చెప్పిన దాని కంటే ఎక్కువగా రైతులకు భరోసా అందిందన్నారు. బీసీ, ఎస్సీ ఎస్టీ, మైనారిటీ వర్గాలన్నింటికీ నామినేటెడ్‌ పోస్టులు, కాంట్రాక్ట్‌ పనుల్లో 50 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తున్నట్టు చట్టం కూడా చేశామన్నారు. రానున్న నాలుగున్నరేళ్లలో 25 లక్షల మంది పేదలకు ఇళ్లు ఇవ్వనున్నట్టు తెలిపారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో దేశంలోనే అగ్రగామిగా రాష్ట్రం నిలుస్తుందన్నారు. ఉపాధి కల్పించే కోర్సులు ప్రవేశపెడుతున్నట్టు తెలిపారు. జాతీయస్థాయిలో చక్రం తిప్పుతున్నానని చెప్పుకుంటున్న చంద్రబాబు.. ప్రస్తుతం ఒక కులానికి లబ్ధి చేకూర్చేందుకే పాకులాడుతున్నారని ఆరోపించారు.

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న విజయసాయిరెడ్డి, శ్రీనివాస్, ద్రోణంరాజు శ్రీనివాస్‌ తదితరులు
పవన్‌ కల్యాణ్‌ గాజువాక ప్రజలకు క్షమాపణ చెప్పాలి  
పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇసుక సమస్యపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ లాంగ్‌ మార్చ్‌ చేస్తానని ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. గాజువాకలో తనకు ఓట్లు వేసి రెండో స్థానంలో నిలిపిన ప్రజలను ఇంతవరకు కనీసంగా పలకరించడానికి కూడా రాని పవన్‌ ఇప్పుడు.. లాంగ్‌మార్చ్‌ పేరిట షోలు చేస్తే ఎవ్వరూ నమ్మరన్నారు.  జిల్లాలో ఏ నియోజకవర్గంలో జరగని విధంగా ‘ఉత్తర’లో అభివృద్ధి జరుగుతోందని, ఇందుకు సమన్వయకర్త కె.కె.రాజు కృషే కారణమన్నారు. జీవీఎంసీ ఇప్పటివరకు రూ.17 కోట్లు నిధులు విడుదల చేస్తే.. అందులో రూ.కోటికి సంబంధించి ఇక్కడే రోడ్లు, బ్రిడ్జి, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశామన్నారు. మద్య నిషేధం కారణంగా రాష్ట్రంలో మహిళలంతా సుఖసంతోషాలతో ఉన్నారన్నారు. గత ప్రభుత్వం హ యాంలో విశాఖలో భూదందాలు, ఆక్రమణలు జరిగాయని, తెలుగుదేశం నేతలు చేసిన తప్పులకు రెవెన్యూ అధికారులు బలయ్యారన్నారు. 

సభలో మాట్లాడుతున్న ఎంపీ విజయసాయిరెడ్డి 
వీఎంఆర్డీఏ చైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన ఐదు నెలల్లోనే 80 శాతం హామీలను అమలు చేసిన ఏకైక సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని కొనియాడారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక చంద్రబాబు కపటవేషాలు వేస్తూ.. ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా మారి.. ప్రభుత్వానికి సహకరించాలని సూచించారు. అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ మాట్లాడుతూ విశాఖ నగరాన్ని ఎంపీ విజయసాయిరెడ్డి దత్తత తీసుకోవడం కాదని, ప్రజలే ఆయన్ని దత్తత తీసుకున్నారన్నారు. పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు మాట్లాడుతూ దళితుల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కె.కె.రాజు మాట్లాడుతూ జీవీఎంసీ ఎన్నికల్లో ఉత్తర నియోజకవర్గంలోని అన్ని వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ జెండా ఎగురవేస్తామన్నారు.

కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్‌ జి.సృజన, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శులు రొంగలి జగన్నాథం, సనపల చంద్రమౌళి, ముఖ్య నాయకులు కొయ్య ప్రసాదరెడ్డి, చొక్కాకుల వెంకట్రావు, ఫరూఖీ, నగర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బెహరా భాస్కరరావు, డీసీసీబీ చైర్మర్‌ సుకుమార్‌ వర్మ, రాష్ట్ర అదనపు కార్యదర్శులు రవిరెడ్డి, ఫక్కి దివాకర్, నగర, పార్లమెంట్‌ అనుబంధ సంఘాల అధ్యక్షులు పీలా వెంకటలక్ష్మి, శ్రీనివాస్‌ గౌడ్, తుల్లి చంద్రశేఖర్, గుంటూరు నరసింహమూర్తి, కాళిదాసురెడ్డి, బర్కత్‌ అలీ, రెయ్యి వెంకటరమణ, రాధా, కృష్ణ, వార్డు అధ్యక్షులు కటుమూరి సతీష్, రత్నాకర్, బాబా, రాయుడు శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు