తీవ్రవాదాన్ని అణచివేసే చర్యలకు సంపూర్ణ మద్దతు

3 Aug, 2019 03:44 IST|Sakshi

చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక బిల్లుపై చర్చలో విజయసాయిరెడ్డి

సాక్షి, న్యూఢిల్లీ: తీవ్రవాదాన్ని అణచివేసే చర్యలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక బిల్లుపై శుక్రవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘తీవ్రవాదం అణచివేతలో దర్యాప్తు సంస్థలు మరింత మెరుగ్గా పనిచేసేలా వాటిని బలోపేతం చేసేందుకు, దేశాన్ని తీవ్రవాద రహితంగా చేసేందుకు ప్రధానమంత్రి, హోం మంత్రి ప్రణాళికకు వైఎస్సార్‌సీపీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోంది.

ఏరకమైన తీవ్రవాదం అయినా, ఏ ప్రాంతంలో ఉన్నా దాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకూ మేం మద్దతిస్తాం. ఈ బిల్లులో క్లాజ్‌ 8 ఇన్‌స్పెక్టర్‌ ర్యాంకు గల అధికారి దర్యాప్తు ప్రక్రియ చేపట్టేందుకు అనుమతిస్తోంది. తీవ్రవాదుల ఆస్తులు జప్తు చేసేందుకు ఇది దోహదపడటం ప్రశంసనీయం. అలాగే వ్యక్తిగతంగా తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులను తీవ్రవాదులుగా గుర్తించేందుకు ఈ బిల్లు దోహదపడుతుంది.’ అని పేర్కొన్నారు. 
 

మరిన్ని వార్తలు