జక్కంపూడి రాజాపై దాడిని ఖండించిన వైఎస్‌ఆర్‌ సీపీ

30 Oct, 2017 13:33 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజాపై పోలీసుల దాడిని ఆ పార్టీ తీవ్రంగా ఖండించింది. దాడికి పాల్పడిన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ విశాల్‌ గున్నీని ...వైఎస్‌ఆర్‌ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి డిమాండ్‌ చేశారు. అలాగే ఈ దాడి విషయాన్ని ఆయన ...ఏపీ డీజీపీ సాంబశివరావు దృష్టికి కూడా తీసుకు వెళ్లారు. ఎస్‌ఐపై తక్షణమే చర్యలు తీసుకుంటామని డీజీపీ హామీ ఇచ్చినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ... ‘తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గత మూడున్నరేళ్ల కాలంలో వందలమంది వైఎస్‌ఆర్‌ సీపీ కార్యకర్తలు, నాయకులను అధికార పార్టీ వారు హత్య చేశారు. పత్తికొండలో చెరుకులపాడు నారాయణరెడ్డిని దారుణంగా నరికి చంపారన్నారు. వైఎస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యేలతో పాటు, కార్యకర్తలపై లెక్కలేనన్ని అక్రమ కేసులు పెట్టారు. రాష్ట్రంలో శాంతిభద్రతలే లేకుండా చేసిన సీఎం చంద్రబాబు సర్కార్‌ ఇప్పుడు రాష్ట్ర నాయకుల మీద కూడా దాడులు చేయడానికి పోలీసుల్ని ఉపయోగించుకుంటున్న విషయం తాజాగా జక్కంపూడి రాజా మీద దాడితో స్పష్టం అవుతుంది. ఎస్‌ఐ నాగరాజును తక్షణమే విధుల నుంచి తొలగించడంతో పాటు చట్టపరంగా అన్ని చర్యలు తీసుకోవాలి. అలాగే ఎస్‌ఐ వెనక ఎవరున్నారన్నది వెలికి తీయాలి. లేనిపక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తదుపురి కార్యాచరణకు సిద్ధం అవుతుందని ఆయన హెచ్చరించారు.

మరోవైపు దాడి కేసుకు సంబంధించి... వైఎస్‌ఆర్‌ సీపీ నేతలు ఇవాళ జిల్లా ఎస్పీ విశాల్‌ గున్నీని కలిశారు. దాడి ఘటనకు సంబంధించి ఫిర్యాదు చేశారు. కాగా ఈ కేసు విచారణ నిమిత్తం డీఎస్పీ మురళీమోహన్‌ను ఎస్పీ నియమించారు.


 

>
మరిన్ని వార్తలు