ఎయిర్‌పోర్టుపై ఆంక్షలతో గందరగోళం

25 Jul, 2018 13:08 IST|Sakshi
విజయసాయిరెడ్డి

రాజ్యసభలో ప్రస్తావించిన ఎంపీ విజయసాయిరెడ్డి

సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం ఎయిర్‌ పోర్టులో పౌరవిమాన సర్వీసుల నిర్వహణపై భారత నౌకా దళం విధించిన ఆంక్షల కారణంగా విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం రాజ్యసభ జీరో అవర్‌లో ఈ అంశాన్ని లేవనెత్తారు. ఈ ఎయిర్‌పోర్టు నుంచి విమానాల రాకపోకలపై విధించే ఎలాంటి ఆంక్షలైనా  దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులకు ఆటంకం కలిగిస్తాయన్నారు. పర్యాటక, వాణిజ్య రంగాలపై దీని ప్రభావం పడుతుందన్నారు. వారానికి అయిదు రోజులు, రోజుకు ఐదు గంటల పాటు విమానాశ్రయాన్ని రక్షణ విభాగం అవసరాలకోసం వినియోగించాలని, వారంతంలో రన్‌వే నిర్వహణ కోసం మరి కొన్ని గంటలు విమానాల రాకపోకలను రద్దు చేయాలని భార త నౌకా దళం నిర్ణయించడంతో గందరగోళ పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయని వివరించారు.

ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ ప్రజలు,  ప్రజా సంఘాల నుంచి  ప్రతిఘటన ఎదురుకావడంతో  సమయాన్ని  కొంత సడలించిందన్నారు. ఈ ఏడాది జూన్‌ 15న ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎఎఐ)తో జరిపిన సమావేశంలో ప్రతిరోజు రాత్రి ఏడు గంటల నుంచి 9 గంటల మధ్య పౌర, మిలిటరీ విమానాల రాకపోకలను కొనసాగించాలని నౌకాదళం అధికారులు ప్రతిపాదించారు. ఈ వేళల్లో మిలటరీ విమానాల రాకపోకలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, అలాగే ఈ వేళల్లో కొత్తగా విమాన సర్వీసులేవీ ప్రవేశపెట్టడానికి వీల్లేదని నౌకాదళం అధికారులను ఆదేశించారని ఎంపీ వివరించారు. ఈ నిర్ణయం వల్ల జెట్‌ ఎయిర్‌వేస్‌ విమాన సర్వీసులను ఉపసంహరించుకుందన్నారు. విశాఖ–బ్యాంకాక్‌ మధ్య అదే వేళల్లో సర్వీసులను ప్రవేశపెట్టాలని ప్రయత్నిస్తున్న స్పేస్‌ జెట్‌ తన ప్రయత్నాలను విరమించుకుందన్నారు. విశాఖ–దుబాయ్‌ మధ్య నడిచే ఎయిర్‌ ఇండియా విమాన సర్వీసును రీ షెడ్యూల్‌ చేయాలని ఆదేశించడం వల్ల ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉందన్నారు. నౌకాదళం తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోకపోతే సర్వీసులను ఉపసంహరించుకుంటామని శ్రీలంక ఎయిర్‌లైన్స్‌ తెగేసి చెప్పిందని ఎంపీ వివరించారు.

సురక్షితం కాదు
2018 నవంబర్‌ 1వనుంచి ఈ ఆంక్షలు అమల్లోకి వస్తే పరిస్థితి ఎలాఉండబోతుందో ఎవరికీ అర్థం కావడంలేదని విజయసాయిరెడ్డి ఆందోళన వ్య క్తం చేశారు. విశాఖ ఎయిర్‌పోర్టు పరిసరాల్లోనే హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీ, భారీ ఆయిల్‌ ట్యాంకులు ఉన్నందున సైనిక విమానాల్లో శిక్షణకు ఈ ప్రాం తం ఏ విధంగానూ సేఫ్టీ జోన్‌ కాదన్నారు. భోగా పురంలో కొత్తగానిర్మించే విమానాశ్రయం అందుబాటులోకి వచ్చేవరకు విజయనగరంజిల్లా బా డంగిలోని ఎయిర్‌స్ట్రీప్‌ను అభివృద్ధిచేసి దానిని సైనికవిమానాల శిక్షణకోసం వినియోగించుకోవచ్చునని సూచించారు. విశాఖజిల్లాలోని రాంబిల్లి వద్ద నేవీ ఆల్టర్నేట్‌ ఆపరేటింగ్‌ బేస్‌వద్ద కూడా ఎయిర్‌స్ట్రివ్‌ నిర్మించి అక్కడకూడా శిక్షణా కార్యక్రమాలను నిర్వహించుకునేలా భారతనౌకాదళాన్ని ఆదేశించాలని ఎంపీ విజయసాయిరెడ్డి రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు