దిగ్విజయంగా విజయదశమి

14 Oct, 2013 03:46 IST|Sakshi
సాక్షి, కాకినాడ : జిల్లా అంతా విజయదశమి సందర్భం గా ఘనంగా సంబరాలు జరిగాయి. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు శ్రవణ నక్షత్రయుక్తంగా దశమి ప్రవేశించడంతో ఆదివారమే దసరా అని పలువురు పండితులు చెప్పడతో ఈరోజే దసరా పండుగ చేసుకున్నారు. సూర్యోదయంతో కూడిన తిథినే పండుగలకు ప్రమాణంగా తీసుకోవడం ఆచారం. కావడంతో సోమవారం విజయదశమి చేసుకునేందుకు కూడా చాలామంది ఏర్పాట్లు చేసుకున్నారు.  ఆ రకంగా రెండురోజుల పాటు దసరా సందడి నెలకొననుంది. 
 
 ఆదివారం తెల్లవారు జాము నుంచి అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.అపరాజిత పూజలు, శమీపూజలు, ఆయుధ పూజలు, కుంకుమార్చనలు, ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. గత తొమ్మిదిరోజులూ నవావతారాలలో దర్శనమిచ్చిన అమ్మ ఆదివారం సౌందర్య రూపిణిగా, శాంతమూర్తిగా కనిపించింది. పలు ఆలయాల్లో శ్రీచక్ర నవావరణార్చన, ఆదికుంభేశ్వరస్వామికి ఏకాదశ రుద్రాభిషేకం, చండీహోమం, మూలమంత్ర లలిత హోమాలను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. నవరాత్రిపందిళ్లు కూడా ఆదివారం భక్తులతో కిటకిట లాడాయి. పలు పందిళ్లలో కొలువుదీరిన అమ్మవార్లను మేళతాళాలు, బాణాసంచా మెరుపుల మధ్య ఊరేగించారు. పలువురు కొత్త వాహనాలకు పూజలు చేయించారు. 
 
 కాకినాడలో పోటెత్తిన భక్తజనం
 కాకినాడలోని శ్రీ బాలాత్రిపురసుందరి సమేత శ్రీరామ లింగేశ్వరస్వామి వారి ఆలయంలో నవరాత్రి సంబరాలు అంబరాన్ని తాకాయి. వేలాది మందితో ఆలయం కిక్కిరిసింది. బాలాత్రిపురసుందరి అమ్మవారు బంగారు చీరలో దర్శనమివ్వగా భక్తులు పరవశించారు. రామలింగేశ్వరునికి ఏకాదశ రుద్రాభిషేకం, అమ్మవారికి సహస్ర కుంకుమార్చన, చండీహోమం, నవవరణార్చనలు నిర్వహించారు. రాజమండ్రిలో అమ్మవారికి నిర్వహించిన తెప్పోత్సవం కన్నులపండువగా జరిగింది. వేలాది మంది ఈ నయానందకర దృశ్యాన్ని వీక్షించారు. అమలాపురంలో శ్రీదేవి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. చెడీ తాలింఖానా విన్యాసాలు, శక్తి వేషాలతో వాహనాల ఊరేగింపు అంగరంగ వైభవంగా సాగింది. 
 
 ఆ ఇళ్లల్లో కానిరాని సందడి
 సమైక్యాంధ్ర ఉద్యమ ప్రభావం దసరా సంబరాలపై స్పష్టంగా కన్పించింది. 65 రోజులుగా సమ్మె చేస్తున్న ఏపీ ఎన్జీఓలు దసరా సంబరాలకు దూరంగా ఉన్నారు. తాజాగా సమ్మె విరమించిన ఆర్టీసీ కార్మికులు, ఉపాధ్యాయుల ఇళ్లల్లో కూడా దసరా సందడి కానరాలేదు. దరల పెరుగుదల కూడా దసరా పండుగపై ప్రభావం చూపింది. 
 
మరిన్ని వార్తలు