దోచుకొని దాచుకున్న మీరా విమర్శించేది?

20 Nov, 2019 11:38 IST|Sakshi
విలేకరులతో మాట్లాడుతున్న విజయలక్ష్మి, పార్టీ వివిధ విభాగాల నాయకులు  

మాజీ ఎమ్మెల్యే వెంకటేష్‌పై వైఎస్సార్‌ సీపీ పీఏసీ సభ్యురాలు విజయలక్ష్మి ధ్వజం 

సాక్షి, కోరుకొండ (రాజానగరం): గత టీడీపీ ప్రభుత్వంలో దొరికినంత దోచుకొని దాచుకున్న మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌కు జక్కంపూడి కుటుంబాన్ని విమర్శించే అర్హత లేదని వైఎస్సార్‌ సీపీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. మంగళవారం కోరుకొండ శ్రీ వల్లీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి కళావేదిక పై ఆమె విలేకరులతో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే వెంకటేష్‌ చేస్తున్న అసత్య ఆరోపణలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఒక్కరికి ఓటు వేస్తే ముగ్గురం నియోజకవర్గ ప్రజలకు సేవలు అందిస్తామని ఆనాడే చెప్పామన్నారు. మా కుటుంబంలో ఎటువంటి గొడవలు లేవని నన్ను నా పిల్లలు దేవతగా కొలుస్తారని, నా మాటను శాసనంగా భావిస్తారని అన్నారు. తన కుటుంబంపై వెంకటేష్‌ తరుచూ ఆసత్య ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే మానసిక వ్యాధితో బాధపడుతున్నట్టు అనిపిస్తోందని అన్నారు. ఇసుక, మట్టి దోచుకోవడం, ధనార్జనే థ్యేయంగా పనిచేయడంతోనే టీడీపీ, ఎమ్మెల్యేగా పోటీ చేసిన మీకు ప్రజలు గుణపాఠం చెప్పార న్నారు. మీరు గాలివాటున రాజకీయాల్లోకి వచ్చారని అన్నారు.

గతంలో మీ సతీమణి అన్నపూర్ణకు టీడీపీ ఎమ్మెల్యే సీటు ఇస్తే ఓడిపోయారని, మరోసారి ఎన్నికల్లో ఆమెకు సీటు ఇవ్వకుండా మీరు ఎలా లాక్కున్నారో అందరికి తెలుసు అన్నారు. స్వచ్ఛ కోరుకొండ కార్యక్రమంలో గ్రామ వలంటీర్లు పాల్గొంటున్నారని దానిని మాజీ ఎమ్మెల్యే రాజకీయం చేయడం సిగ్గుచేటుగా ఉందన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో దోమలపై దండయాత్ర, వనం–మనం కార్యక్రమంలో ప్రభుత్వాధికారులను, విద్యార్థులను ఎలా ఉపయోగించుకున్నారో మీరు మర్చిపోయారా అని ప్రశ్నించారు. సీతానగరం మండలంలో ఇసుక దోపిడీ చేస్తున్న దృశ్యాలను చిత్రీకరించడానికి వెళ్లిన ఎలక్ట్రానిక్, ప్రింట్‌ మీడియా విలేకరులపై మీ ప్రోత్సాహంతోనే దాడిచేసిన సంఘటన అందరికీ తెలిసిందేనని అన్నారు. కోరుకొండ భూముల రిజిస్ట్రేషన్లకు అనుమతిని ఎమ్మెల్యే, కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ జక్కంపూడి రాజా తీసుకువచ్చారన్నారు. దానిని కూడా రాజకీయం చేయడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా దిగజారుడు రాజకీయాలు మానుకొని నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని, లేకుంటే ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. వైఎస్సార్‌ సీపీ వివిధ విభాగాల నాయకులు తిరుమలశెట్టి సత్యనారాయణ, నక్కా రాంబాబు, బొరుసు బద్రి, తాడి హరిశ్చంద్రప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు. 

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
తాడితోట (రాజమహేంద్రవరం ) :  వైద్య విధానపరిషత్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని జక్కంపూడి విజయలక్ష్మి పేర్కొన్నారు. సోమవారం ఆంధ్రప్రదేశ్‌ హెల్త్‌ మెడికల్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిని సంఘం గౌరవ అధ్యక్షురాలు విజయలక్ష్మి మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగుల సమస్యల పరిస్కారానికి కృషి చేస్తానన్నారు. ఉద్యోగుల సమస్యలు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళతానన్నారు. ఈ సంఘం వైఎస్సార్‌ సీపీ టీయూసీకి అనుబంధంగా పని చేస్తుందని తెలిపారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల కమిటీలను ఎన్నుకున్నారు. ఎన్నికకు వైఎస్సార్‌ సీపీ టీయూసీ తరఫున ఉభయ గోదావరి జిల్లాల ఇన్‌చార్జి మస్తానప్ప ఎన్నికల పర్యవేక్షణాధికారిగా వ్యవహరించారు.

మరిన్ని వార్తలు