సంకల్ప 'సింహా'

3 Jun, 2020 09:05 IST|Sakshi

పుట్టుకతోనే అంధుడైనా పట్టుదలతో ఐఏఎస్‌ సాధన 

2019 బ్యాచ్‌లో 457వ ర్యాంకు సాధించి ముస్సోరీలో శిక్షణ 

గోదారమ్మ ఒడిలో పుట్టి విద్యలనగరంలో కొలువు 

అసిస్టెంట్‌ కలెక్టర్‌ కట్టా సింహాచలంతో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ 

సంకల్పం తోడుంటే వైకల్యం అవరోధం కాదని నిరూపించారు. అంధత్వాన్ని జయించి... అత్యున్నత స్థానానికి చేరుకున్నారు. ఆ దైవాన్ని ఎదిరించి.. పేదరికాన్ని తలదించేలా చేశారు. కష్టాల వారధి దాటి... అనంద ప్రయాణం చేస్తున్నారు. ఆయనే... తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం, గూడపల్లి గ్రామానికి చెందిన కట్టా సింహాచలం. 2019 ఐఏఎస్‌ బ్యాచ్‌లో 457వ ర్యాంకు సాధించి ముస్సోరీ లో శిక్షణ పూర్తిచేసుకుని విజయనగరం జిల్లా  అసిస్టెంట్‌ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించా రు. ఎన్ని అవరోధాలున్నా మన లక్ష్యం మరచి పోకుండా నిరంతర శ్రమ, కఠోర దీక్ష, దృఢ సంకల్పంతో సాగితే అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేయగలమని చెప్పారు. కష్టాల తీరం నుంచి విజయపథానికి ఎలా చేరుకున్నదీ ‘సాక్షి ప్రతినిధి’తో మంగళవారం పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... 

నిరుపేద కుటుంబంలో పుట్టి... 
మా స్వగ్రామం గూడపల్లి. మా తల్లిదండ్రులు కట్టా వాలి, వెంకట నర్సమ్మ. వారికి మేం అయిదుగురం పిల్లలం. అందరిలోనూ నేను చిన్న వాడిని. కుటుంబ పోషణకు మా నాన్నగారు పాత గోనెసంచుల వ్యాపారం చేసేవారు. వాటిని కొబ్బరి వ్యాపారస్తులకు ఇచ్చేవారు. అలా వచ్చిన ఆదాయంతోనే సంతానాన్ని పెంచి పెద్ద చేశారు. మా అమ్మ కడుపుతో ఉన్నప్పుడు ఆమెకు సరైన పోషకాహారం లభించలేదు. ఫలితంగా నేను పుట్టుకతోనే అంధుడనయ్యాను. నా తండ్రికి కుమారుడిని చదివించే  స్థోమత లేదు. ఆ పేదరికంతో పోరాడుతూనే పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోని ఆంధ్రా బ్రెయిలీ స్కూల్‌లో చదువుకున్నాను. మలికిపురం ఎంవీఎన్‌జేఎస్‌ అండ్‌ ఆర్వీఆర్‌ డిగ్రీ కళాశాలలో దాతల సహకారంతో డిగ్రీ పూర్తి చేశాను. ఆ సమయంలోనే నా తండ్రి అనారోగ్యంతో 2008లో మాకు దూరమయ్యారు.

పదిమందికి స్ఫూర్తిగా నిలవాలని... 
కలెక్టర్‌ అంటే ఏంటో మా అమ్మకు తెలియదు. అటువంటి పరిస్థితుల నుంచి వచ్చాను. నా కథ పదిమందికి స్ఫూర్తికావాలనే ఈ విషయాన్ని చెబుతున్నాను. సమాజంలో ఇటువంటి ప్రాబ్లమ్‌(అంధత్వం) ఉంటే ఏం చేయలేరన్న అపోహ ఉంది. ఎవరికి డిజేబిలిటీ లేదు చెప్పండి. ప్రతీ ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లెమ్‌ ఉంది. కొందరికి కనబడేదైతే... మరికొందరికి కనబడనిది. నేను ఐఏఎస్‌ అవ్వడం ఏంటి.? ఇది అందరికీ ఆశ్చర్యపరిచే ప్రశ్న. ప్రజలకు ఏదైనా మంచి చేయడానికి ఐఏఎస్‌ ఒక అవకాశం. చేస్తారో లేదో నెక్ట్స్‌. ముందు అవకాశం వస్తుంది. చేయగలరనుకుంటే  ఏదైనా చేయగలరు. చేయాలన్న తపన, కోరిక, చేయడానికి అపర్ట్యూనిటీ కావాలి. ఐఏఎస్‌కు మిగిలిన వాటికి ఉండే తేడా ఏంటంటే, దాతృత్వం అనేది ఐఏఎస్‌కు  ఉండాలి. బాగా సక్సెస్‌ అయిన వ్యక్తుల్లో 12 స్కిల్స్‌ ఉంటాయి. వాటిలో దాతృత్వం ఒకటి. చదవండి: జగన్‌ చూపిన ఆప్యాయతతో నూతనోత్తేజం

ఛాలెంజెస్‌నే అవకాశాలుగా మలచుకుంటే... 
నాకు నా బ్రదర్‌ కుమారుడు నాగబాబు చదివి వినిపించేవాడు. ఎవరికైనా క్రెడిట్‌ ఇవ్వాలంటే నా తల్లి, తండ్రి తరువాత నాగబాబుకే ఇవ్వాలి. మనం దేనినీ మరచిపోకూడదు. మరచిపోదామన్నా మనస్సాక్షి ఒప్పుకోదు. ఇంకా పెళ్లి కాలేదు. నేను కోరుకుంటున్నట్లు చదువుకున్న మంచి అమ్మాయి దొరికితే తప్పకుండా చేసుకుంటాను. నేను ఖాళీ సమయాల్లో చదువుకుంటాను. సినిమాలు చూస్తాను. పాటలు వింటాను. ఫ్యామిలీతో ఎక్కువగా గడుపుతాను. ఎవరి జీవితంలోనైనా డిఫికల్టీస్‌ అంటూ ఏమీ ఉండవు. ఛాలెంజెస్‌ ఉంటాయి. వాటిని అవకాశాలుగా మలుచుకుంటే విజయం దానంతట అదే వరిస్తుంది.   చదవండి: సీఎం ఇంటికి బాంబు బెదిరింపు  

డాక్టర్‌ కావాలన్న కోరిక ఉన్నా... 
నాకు డాక్టర్‌ కావాలని కోరిక. కానీ కుదరదు. అందుకే ఐఏఎస్‌ కావాలన్న దృఢ సంకల్పాన్ని నా మనస్సులో గట్టిగా నాటుకున్నాను. ఆ క్రమంలోనే బీఈడీ కూడా చదివి తిరుపతి కేంద్రీయ విద్యాలయంలో టీచర్‌ ఉద్యోగంలో చేరాను. 2014 సంవత్సరంలో సివిల్‌ సర్వీస్‌ పరీక్షలు రాశాను. 1212 ర్యాంకు సాధించాను. కలెక్టర్‌ అయ్యే అవకాశం కొద్దిలో మిస్‌ అయింది. అయినా నిరాశ చెందలేదు. 2016లో ఐఆర్‌ఎస్‌ సాధించి ఇన్‌ కమ్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌గా ఢిల్లీ, హైదరాబాద్‌లో పని చేస్తూనే నా ఆశయం అయిన ఐఏఎస్‌కు ప్రిపేర్‌ అయ్యారు. 2019 ఐఏఎస్‌ ఫలితాల్లో ర్యాంకు సాధించాను.  చదవండి: పండు.. మామూలోడు కాదు! 

పర్సనల్‌ పవర్‌తోనే గుర్తింపు 
నేను ఇప్పటి వరకు నాలుగు ఇంటర్వ్యూలు ఫేస్‌ చేశాను. అన్నింటి కంటే ఐఏఎస్‌ ఇంటర్వ్యూలోనే తక్కువ మార్కులు వచ్చాయి. అందరికీ అన్నీ తెలియాలని లేదు కదా.. కొందరికి కొన్ని తెలియవు. నేను ఒక ఐఏఎస్‌లా కనిపించాలనుకోను. పొజిషన్‌ పవర్‌ వచ్చేసింది. ఇక రావాల్సింది పర్సనల్‌ పవర్‌. ఎవరిదైనా చరిత్ర గుర్తు పెట్టుకుంటున్నామంటే వారి పర్సనల్‌ పవర్‌తోనే తప్ప పొజిషన్‌ పవర్‌తో కాదు. నేను ఐఏఎస్‌ చేయగలనని ఎప్పుడూ అనుకోలేదు. నేను సక్సెస్‌ అయితే మా ఫ్యామిలీకి తోడుండగలను అనే నమ్మకంతోనే అయ్యాను. నేను అనుకున్నది జరిగితే  సమాజానికి సందేశం ఇవ్వగలను కదా.

 – బోణం గణేష్‌, సాక్షిప్రతినిధి, విజయనగరం    

మరిన్ని వార్తలు