సింహపురితో ఎనలేని అనుబంధం 

28 Jun, 2019 13:25 IST|Sakshi

సాక్షి, నెల్లూరు : నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా సుప్రసిద్ధురాలైన విజయనిర్మలతో సింహపురికి ఎనలేని అనుబంధం ఉంది. ప్రఖ్యాత సినీ నటి విజయనిర్మల హఠాన్మరణం పట్ల నెల్లూరుకు చెందిన కళాకారులు, నటులు ఆమెతో ఉన్న అనుబంధాన్ని గురువారం గుర్తుచేసుకున్నారు. నెల్లూరుకు 70వ దశకంలో ‘దేవుడు చేసిన మనుషులు’ శతదినోత్సవ వేడుకలకు నటిగా ఆమె హాజరయ్యారని, అలాగే గూడూరు ప్రాంతంలోజరిగిన ఓ చలనచిత్రం షూటింగ్‌లో పాల్గొన్నారని,  కాంగ్రెస్‌పార్టీ నుంచి కృష్ణ పార్లమెంటుసభ్యుడిగా పోటీచేసిన సమయంలో ఆయనతోపాటు నెల్లూరు వీఆర్‌ కళాశాల మైదానంలో జరిగిన ఆ పార్టీ ప్రచారసభల్లో సైతం విజయనిర్మల పాల్గొన్నారని గుర్తుచేసుకున్నారు. నటిగా, దర్శకురాలిగా గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు సాధించినప్పటికీ తన తోటి నటీనటులతో, దర్శకులతో, నిర్మాతలతో, అభిమానులతో ఎంతో హుందాగా, అప్యాయతానురాగాలతో వ్యవహరించేవారని విజయనిర్మలతో అనుబంధం ఉన్న వారు గుర్తుచేసుకున్నారు. 

‘తుంగా’పండగలో పాల్గొన్న కృష్ణ, విజయనిర్మల దంపతులు
లాయర్‌ వారపత్రిక వ్యవస్థాపకుడు, ప్రముఖ పాత్రికేయుడు తుంగా రాజగోపాలరెడ్డి జయంతిని పురస్కరించుకుని లాయర్‌ వారపత్రిక నిర్వహించిన ‘తుంగా’పండగలో నటశేఖర కృష్ణతో కలిసి విజయనిర్మల నెల్లూరుకి విచ్చేశారు. కేవీఆర్‌ పెట్రోల్‌బంక్‌ సమీపంలోని శ్రీవెంకటేశ్వర కస్తూర్బా కళాక్షేత్రంలో 1998 నవంబర్‌ 8వ తేదీన లాయర్‌ వారపత్రిక వ్యవస్థాపకుడు తుంగా రాజగోపాలరెడ్డి 69వ జయంత్యుత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ‘తుంగా’పండగలో నటశేఖర కృష్ణకు ‘తుంగా రాజగోపాలరెడ్డి’ అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో విజయనిర్మల సైతం పాల్గొన్నారు. ఆమెను సైతం నాడు ప్రముఖ వైద్యుడు సీఎంకే రెడ్డి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి డాక్టర్‌ సి.నారాయణరెడ్డి, జేకేరెడ్డి, మాగుంట పార్వతమ్మ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు