రెవెన్యూ లోటును కేంద్రమే పూడ్చాలి

9 Apr, 2020 05:46 IST|Sakshi
ప్రధాని మోదీతో వీడియోకాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న విజయసాయిరెడ్డి

రేషన్‌ కార్డుదారులకు అందిస్తున్న సాయాన్నీ భరించాలి

ప్రధాని మోదీకి సీఎం జగన్‌ తరఫున విజయ సాయిరెడ్డి విన్నపం  

సాక్షి, విశాఖపట్నం: లాక్‌ డౌన్‌ వల్ల రాష్ట్రంలో ఏర్పడుతున్న రెవెన్యూ లోటును కేంద్ర ప్రభుత్వమే పూడ్చాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి దేశ ప్రధాని మోదీకి విన్నవించారు. కోవిడ్‌–19 నివారణ చర్యల్లో భాగంగా దేశంలోని వివిధ రాజకీయ పార్టీల సలహాలు, సూచనలను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం స్వీకరించారు. వైఎస్సార్‌సీ పీపీ తరఫున విజయసాయిరెడ్డి విశాఖ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనగా.. పార్టీ ఎంపీలు ఎంవీవీ సత్య నారాయణ, బి.సత్యవతి కూడా హాజరయ్యారు. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున వివిధ అంశాలను విజయసాయిరెడ్డి ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

► కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినందుకు.. రాష్ట్రానికి సహాయం అందిస్తున్నందుకు ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రజల తరఫున ప్రధానికి కృతజ్ఞతలు.
► కరోనా హాట్‌స్పాట్లు, రెడ్‌జోన్లతో పాటు కోవిడ్‌ కేసులు కేంద్రీకృతమైన ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ కొనసాగించాలి.
► సినిమా హాళ్లు, విహార ప్రదేశాలు, జనసమ్మర్ధం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనూ లాక్‌ డౌన్‌ ఉండాలి.
► ప్రజల అవసరాల దృష్ట్యా మిగతా ప్రాంతాల్లో సమగ్ర పరిశీలన తర్వాత దశల వారీగా లాక్‌డౌన్‌ ఆంక్షలను ఉపసంహరించాలి. 
► విదేశాల్లో చిక్కుకున్న వారికి ఆ దేశాల్లోనే వైద్య పరీక్షలు జరిపించి కరోనా సోకలేదనే నివేదిక వచ్చిన వారిని స్వదేశానికి రప్పించాలి.
కరోనా నివారణ మందుల్ని కనిపెట్టే వరకు రోగ నిరోధక శక్తి పెంచే యోగా, ధ్యానం వంటి సంప్రదాయ విధానాలను ఆచరించేలా ప్రజలకు అవగాహన కల్పించాలి.
► డ్వాక్రా మహిళలకు మాస్క్‌లు, గ్లౌజ్‌లు, సబ్బులు, శానిటైజర్లను ఇళ్ల వద్ద ఎలా తయారు చేయాలో టీవీల ద్వారా శిక్షణ ఇప్పించాలి. 
► ఎంపీ ల్యాడ్స్‌ను సీఎం సహా య నిధికి జమ చేయాలి. రాష్ట్రానికి 2 లక్షల ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్‌లు, 2 లక్షల ఎన్‌–95 మాస్క్‌లు, 2వేల వెంటిలేటర్ల ను సరఫరా చేయాలి. మరో నాలుగు వైరాలజీ ల్యాబ్‌లను మంజూరు చేయాలి.
► రాష్ట్రంలో రేషన్‌ కార్డుదారు లకు అదనంగా చేపట్టిన సంక్షేమ చర్యలతో రూ.900 కోట్లు, రూ.వెయ్యి చొప్పున ఇవ్వడం వల్ల సుమారు రూ.1,400 కోట్లు ఖర్చయ్యాయి. మొత్తం మీద రూ.2,300 కోట్లను కేంద్రం సాయంగా అందించాలి.
► లాక్‌డౌన్‌తో రోజుకు సుమారు రూ.165 కోట్ల చొప్పున నెలకు దాదాపు రూ.4,500 కోట్ల వరకూ రాష్ట్రానికి రెవెన్యూ నష్టం కలుగుతోంది. ఈ లోటును మానవీయ కోణంలో కేంద్రమే భర్తీ చేయాలి.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా