వాల్తేరు డివిజన్‌ను చేజారనివ్వం

4 Aug, 2019 04:21 IST|Sakshi
మాట్లాడుతున్న ఎంపీ విజయసాయిరెడ్డి

విశాఖ జోన్‌లో నుంచి తీసేస్తే ఒక చేయి పోయినట్లే

జోన్, పెండింగ్‌ ప్రాజెక్టులపై రైల్వే మంత్రిని కలుస్తాం

ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడి

సాక్షి, విశాఖపట్నం: పురాతమైన, అధిక ఆదాయం కలిగిన వాల్తేరు రైల్వే డివిజన్‌ను చేజారనివ్వబోమని ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. విశాఖ జిల్లా ఇన్‌చార్జి మంత్రి మోపిదేవి వెంకటరమణ అధ్యక్షతన శనివారం నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాల్లో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటు అనేది ప్రధాన అంశమన్నారు. జోన్‌ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించినా వాల్తేరు డివిజన్‌ విషయంలోనే తేడా వస్తోందని చెప్పారు. వాల్తేరుతో పాటు విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లతో విశాఖ జోన్‌ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌కు కట్టుబడి ఉన్నామన్నారు.

రైల్వే జోన్‌ ఇచ్చి వాల్తేరు డివిజన్‌ను తీసేస్తే మనకు ఒక చేయి తీసేసినట్లే అవుతుందన్నారు. దీనికి అంగీకరించకూడదని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారన్నారు. వాల్తేరు డివిజన్‌లో ఉన్న కొత్తవలస–కిరండూల్‌ (కేకే) రైల్వే లైన్‌లో ఒడిశా రాష్ట్ర పరిధిలో ఉన్న భాగాన్ని అవసరమైతే రాయగడ డివిజన్‌లో చేర్చుకోవాలన్నారు. అలా కాకుండా మొత్తం కేకే లైన్‌ను రాయగడ డివిజన్‌లో కలపడమంటే విశాఖ జోన్‌కు అన్యాయం చేయడమేనని వ్యాఖ్యానించారు. జోన్‌కుపై అన్ని వివరాలతో నివేదిక తయారు చేశామని, సోమవారం రైల్వే మంత్రిని కలుస్తామన్నారు. జిల్లాలో జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులకు ఏ ప్రతిపాదనలు ఉన్నా, సమస్యలు ఉన్నా ప్రజలు ఎంపీల ద్వారా తన దృష్టికి తీసుకురావాలని కోరారు. 

భూ ఆక్రమణలపై మరో సిట్‌
విశాఖలో భూ ఆక్రమణలపై విచారణకు గత టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను ఏర్పాటు చేసినప్పటికీ ఆ నివేదిక బయట పెట్టలేదని, ఇప్పుడు ముఖ్యమంత్రి ఆదేశాలతో కొత్తగా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించారని వెల్లడించారు. 

ముస్లింల ప్రయోజనాలను మర్చిపోం
వైఎస్సార్‌సీపీ ముస్లింల ప్రయోజనాలను ఎప్పుడూ మరిచిపోదని విజయసాయిరెడ్డి అన్నారు. పార్టీ మైనార్టీ సెల్‌ ఆధ్వర్యంలో విశాఖలో శనివారం ఆయనను సన్మానించారు. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ పార్టీ తరఫున ఉన్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి ముస్లింలకు కేటాయిస్తున్నామన్నారు. ముస్లింల ప్రయోజనాలను కాపాడేందుకు త్రిపుల్‌ తలాక్‌ బిల్లును వ్యతిరేకించాలని పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించడంతో పార్లమెంట్‌లో బిల్లును వ్యతిరేకించామని తెలిపారు. మంత్రులు మోపిదేవి, అవంతి శ్రీనివాసరావు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, మైనార్టీసెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫరూఖీ, వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు