ట్రాన్స్‌జెండర్లపై వివక్ష తగదు

27 Nov, 2019 05:10 IST|Sakshi

ట్రాన్స్‌జెండర్‌ (హక్కుల పరిరక్షణ) బిల్లుపై చర్చలో ఎంపీ విజయసాయిరెడ్డి 

సాక్షి, న్యూఢిల్లీ: ట్రాన్స్‌జెండర్లపై సమాజంలో కొనసాగుతున్న వివక్షను రూపుమాపాల్సి ఉందని వైఎస్సార్‌సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ట్రాన్స్‌జెండర్‌ (హక్కుల పరిరక్షణ) బిల్లుపై మంగళవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, తరతరాలుగా సమాజంలో ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తులు వివక్ష, అవహేళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాన్స్‌జెండర్‌ వర్గాల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు తమ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ బిల్లు ద్వారా ట్రాన్స్‌జెండర్ల ప్రయోజనాల పరిరక్షణతోపాటు వారికి విద్య, ఆరోగ్యం, ఉపాధి వంటి కనీస సదుపాయాలు పొందే చట్టబద్ధమైన అర్హత లభిస్తుందని చెప్పారు. ‘జిల్లా మేజిస్ట్రేట్‌ జారీ చేసే గుర్తింపు పత్రం ద్వారా ఒక వ్యక్తిని ట్రాన్స్‌జెండర్‌గా గుర్తించవచ్చని బిల్లులో చెబుతున్నారు. అలాగే స్వయం ప్రకటిత మార్గం ద్వారా కూడా ట్రాన్స్‌జెండర్‌ను గుర్తించడం జరుగుతుందని బిల్లులో చెబుతున్నారు. ఈ వైరుధ్యంపై బిల్లులో ఎక్కడా స్పష్టత, వివరణ లేదు’అని అన్నారు. 

ఖాతాదారులు నష్టపోతే వ్యవస్థీకృత రక్షణ ఉండాలి 
చిట్‌ ఫండ్స్‌లో పొదుపు చేసే ఖాతాదారులు నష్టపోయినప్పుడు వారిని ఆదుకునేందుకు వ్యవస్థీకృత రక్షణ ఉండాలని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం రాజ్యసభలో చిట్‌ ఫండ్స్‌ (సవరణ) బిల్లు–2019పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘చిట్‌ఫండ్‌ ఖాతాదారులు, ముఖ్యంగా ఆర్థికంగా బలహీన వర్గాల ప్రజల ప్రయోజనాలు కాపాడేందుకు వీలుగా పలు చర్యలు తీసుకున్నారు. ఈ బిల్లుకు కొన్ని సూచనలతో మద్దతు ఇస్తున్నాం. ఏపీలో జరిగిన అగ్రిగోల్డ్‌ స్కామ్‌లో 32 లక్షల మంది నష్టపోయినప్పుడు.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.10 వేల వరకు నష్టపోయిన వారికి ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించారు. ఇలా నష్టపోయిన పరిస్థితుల్లో పేదలకు వ్యవస్థ అండగా ఉండాల్సిన అవసరం ఉంది..’అని పేర్కొన్నారు. 

పొగాకును నిషేధించాలి 
ఈ–సిగరెట్లనే కాకుండా సిగరెట్లు సహా మొత్తం పొగాకు ఉత్పత్తులను నిషేధించాలని, అదే సమయంలో పొగాకు రైతుల ప్రయోజనాలు కాపాడాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ మార్గాని భరత్‌ కేంద్రాన్ని కోరారు. సభాపతి స్థానంలో ఉన్న ప్యానల్‌ స్పీకర్‌ మెహతాబ్‌ స్పందిస్తూ ‘భరత్‌ ఎల్లవేళలా మంచి సలహాలతో వస్తారు. రైతుల ప్రయోజనాలు ఎలా కాపాడాలన్న అంశంపై సలహాలు ఇచ్చారు..’అని ప్రశంసించారు. కాగా, నవరత్నాల పేరుతో ఆంధ్రప్రదేశ్‌ అమలుచేస్తున్న ప్రజాసంక్షేమ కార్యక్రమాలకు కేంద్రం సాయం చేయాలని లోక్‌సభ జీరో అవర్‌లో ఎంపీ మార్గాని భరత్‌ కోరారు. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. 

సింగపూర్‌లో ఉన్నవారు మాత్రమే డిజైన్‌ చేస్తారని బాబు నమ్మించారు 
నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ సవరణ బిల్లు–2019పై జరిగిన చర్చలో వైఎస్సార్‌సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడారు. అమరావతిలోని ఎన్‌ఐడీ సహా భోపాల్, జోర్హాట్, కురుక్షేత్రలోని ఎన్‌ఐడీలకు జాతీయస్థాయి ప్రాధాన్యత గల సంస్థలుగా గుర్తిస్తూ ఈ బిల్లును ప్రతిపాదించారు. బిల్లుపై లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. ‘మా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదంతం ఒకటి ఇక్కడ ప్రస్తావించాలి. ఒక రాజధానిని మన దేశంలో డిజైన్‌ చేయలేమని అందరూ నమ్మేలా చేసేశారు. సింగపూర్‌లోనో, లండన్‌లోనో ఉండేవాళ్లు మాత్రమే రాజధానిని డిజైన్‌ చేయగలరని నమ్మేలా చేశారు. అందువల్ల మన సంస్థలు డిజైన్‌ అందించేలా చూడాల్సిన అవసరం ఉంది. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి. ప్రత్యేక హోదా సహా అన్ని హామీలు నెరవేర్చాలి..’అని కోరారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా