టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది

4 Aug, 2019 15:34 IST|Sakshi

సాక్షి, విజయవాడ : టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పడంతో భయపడిన తెలుగుదేశం పార్టీ నాయకులు అభివృద్ధిని అడ్డుకుంటున్నామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుల పేరిట చేసిన వేల కోట్ల రూపాయల దోపిడీని అడ్డుకొని రాష్ట్ర ఖజానాలో నిధులు ఆదా చేయడానికి సీఎం అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు. అలాగే పార్టీ కోసం కృషి చేస్తున్న కార్యకర్తలకు రాజధానిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో 13 జిల్లాలకు 13 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామని, అక్కడి నుంచి వారికి త్వరలో సేవలు అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు.

‘అక్టోబర్ నెలలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ముందుగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు తర్వాత కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతాయి. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ డిసెంబర్ కల్లా పూర్తవుతుంది. కార్యకర్తలు స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి. విజయావకాశాలు ఉన్న నాయకులకు టికెట్లు ఖాయం. పార్టీకి ప్రయోజనం కల్పించే ఇతర పార్టీ వ్యక్తులను తీసుకుంటాం. జీవీఎంసీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కార్యకర్తలు కృషిచేయాలి. విశాఖ కార్పొరేషన్ మేయర్ పదవి బీసీ అభ్యర్థికి ఇస్తాం’ అని తెలిపారు. శాసనసభ ఎన్నికల్లో ఇచ్ఛాపురం, టెక్కలి, విశాఖలోని నాలుగు సీట్లలో వైఎస్సార్‌సీపీ ఓటమికి కారణం పార్టీ నాయకుల మధ్య సమన్వయం లేకపోవడమేనని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు