చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాల్సిందే

22 Jun, 2019 05:21 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి విజ్ఞప్తి  

జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఉండాలి  

ఓబీసీల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి  

రాజ్యసభలో విజయసాయిరెడ్డి ప్రైవేట్‌ బిల్లు

సాక్షి, న్యూఢిల్లీ: వెనుకబడిన తరగతులకు(ఓబీసీ) లోక్‌సభ, శాసనసభల్లో జనాభా దామాషా ప్రకారం ప్రాతినిధ్యం కల్పించడానికి రిజర్వేషన్లు అమలు చేసేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లు–2018 (కొత్త ప్రకరణలుగా 330ఎ, 332ఎ చేర్చుట)ను ఆమోదించాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి కోరారు. గతంలో ఆయన ప్రవేశపెట్టిన ఈ ప్రైవేట్‌ బిల్లుపై చర్చకు శుక్రవారం రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ అనుమతించారు. ఈ బిల్లుపై జరిగిన చర్చలో ముందుగా విజయసాయిరెడ్డి మాట్లాడారు.  ‘‘దేశ జనాభాలో సగం కంటే ఎక్కువగా ఓబీసీలు ఉన్నారు. పార్లమెంట్‌లో ఓబీసీల ప్రాతినిధ్యం వారి జనాభాకు అనుగుణంగా లేదు.

1984లో లోక్‌సభలో ఓబీసీల ప్రాతినిధ్యం 11 శాతం, 2009లో 18 శాతం. ప్రస్తుత 17వ లోక్‌సభలో 20 శాతం లోపే ఉంది. దాదాపు 2,400 ఓబీసీ కులాలు ఉండగా, అందులో 2,200 కులాలకు పార్లమెంట్‌ ఉభయ సభల్లో, శాసన సభల్లో ఇప్పటివరకు ప్రాతినిధ్యమే లభించలేదు. వారు ఇప్పటికీ చట్టసభల్లో అడుగు పెట్టలేదని చెప్పాల్సి రావడం సిగ్గుపడాల్సిన అంశం. మెజారిటీ రాష్ట్రాల్లో ఓబీసీల జనాభా 50 శాతం కంటే ఎక్కువగా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2011 జనాభా లెక్కల ప్రకారం 50.4 శాతం ఓబీసీలు ఉన్నారు. ఏపీ సీఎం ఇటీవల తన మంత్రివర్గంలో దాదాపు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 60 శాతం పదవులు కేటాయించారు. ఐదు ఉప ముఖ్యమంత్రి పదవులను ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ వర్గాలకు కట్టబెట్టి ఆదర్శంగా నిలిచారు.

ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే.. ఓబీసీ వర్గాలకు జనాభా దామాషా ప్రకారం లోక్‌సభలో, శాసనసభలో సీట్లను రిజర్వ్‌ చేయాలి. ఆర్టికల్‌ 330, 332లు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల గురించి చెబుతున్నాయి. వీటికి అదనంగా ఓబీసీలకు సైతం వారి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు వర్తింపజేయాలి. అప్పుడే వారికి సామాజిక న్యాయం దక్కుతుంది. 2,400 ఓబీసీ కులాలు ఉండగా, 1,400 కులాలు చాలా పేదరికంలో ఉన్నాయి. ఓబీసీల సామాజిక, ఆర్థిక పరిస్థితులను అంచనా వేసేందుకు తగిన వనరులు లేవు. 1953లో కేల్కర్‌ కమిషన్, 1978లో మండల్‌ కమిషన్‌ను నియమించారు. కేల్కర్‌ కమిషన్‌ 40 సిఫారసులు చేయగా, కేవలం 2 సిఫారసులను మాత్రమే అమలు చేశారు. 2021లో మరోసారి  జనగణన ఉంటుంది.

ఓబీసీలకు సంబంధించి సమగ్ర అధ్యయనం ఉండాలి. సమగ్ర ప్రశ్నావళి ఉండాలి. తద్వారా విధానపరమైన నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఓబీసీలకు చట్టపరమైన రక్షణ కల్పించాలి. వేధింపులు, అవమానాల నుంచి రక్షించాలి. ఓబీసీల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి. వారిలో సాంకేతిక నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయించాలి. అన్ని పార్టీలు ఈ బిల్లుకు మద్దతు పలకాలని, ఓబీసీలకు రిజర్వేషన్లు దక్కాలని కోరుతున్నా. ఈ బిల్లు ఆమోదం పొందాలని ఆశిస్తున్నా’’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.  

బిల్లుకు రాజకీయ పార్టీల మద్దతు  
రాజ్యసభలో విజయసాయిరెడ్డి ప్రవేశపెట్టిన ప్రైవేట్‌ బిల్లులపై శుక్రవారం దాదాపు 2 గంటల పాటు ఈ చర్చ జరిగింది. దాదాపు 10 రాజకీయ పార్టీలు ఈ చర్చలో పాల్గొన్నాయి. ఓబీసీ రిజర్వేషన్లకు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ బిల్లు ప్రవేశపెట్టినందుకు విజయసాయిరెడ్డిని కాంగ్రెస్‌ పార్టీ సభ్యుడు బి.కె.హరిప్రసాద్‌ అభినందించారు. ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు అమలైతేనే సామాజిక న్యాయం దక్కుతుందని తేల్చిచెప్పారు. బిల్లుపై రాజ్యసభలో బీజేపీ సభ్యుడు డాక్టర్‌ వికాస్‌ మహాత్మే, ఆర్జేడీ సభ్యుడు ప్రొఫెసర్‌ మనోజ్‌ కుమార్‌ ఝా, డీఎంకే సభ్యుడు టి.కె.ఎస్‌.ఇలంగోవన్, బీజేపీ సభ్యుడు రామ్‌కుమార్‌ వర్మ, కాంగ్రెస్‌ సభ్యుడు ఎల్‌.హనుమంతయ్య, సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు విశంభర్‌ ప్రసాద్, ఏఐఏడీఎంకే సభ్యుడు గోకులకృష్ణన్, ఆమ్‌ ఆద్మీ పార్టీ సభ్యుడు సంజయ్‌ సింగ్, కాంగ్రెస్‌ పార్టీ సభ్యురాలు ఛాయా వర్మ తదితరులు మాట్లాడారు.    

వైఎస్సార్‌సీపీ చొరవ భేష్‌ 
ధన్యవాదాలు తెలిపిన జస్టిస్‌ ఈశ్వరయ్య 
జనాభా దామాషా ప్రకారం ఓబీసీలకు పార్లమెంటు, రాష్ట్రాల శాసనసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చేయాలంటూ రాజ్యసభలో రెండు ప్రైవేటు బిల్లులు ప్రవేశపెట్టిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి అఖిల భారత్‌ వెనుకబడిన తరగతుల సమాఖ్య అధ్యక్షుడు జస్టిస్‌ వి.ఈశ్వరయ్య ధన్యవాదాలు తెలిపారు. ప్రైవేటు బిల్లులో వైఎస్సార్‌సీపీ చూపిన చొరవ అభినందనీయమని ఆయన కొనియాడారు. ఎస్సీ, ఎస్టీ తరహాలో జనాభా దామాషా ప్రకారం ఓబీసీలకూ రిజర్వేషన్లు అమలుచేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. 

మరిన్ని వార్తలు