'స్పిన్నింగ్‌ మిల్లులను సంక్షోభం నుంచి గట్టెక్కించాలి'

31 Jul, 2019 12:42 IST|Sakshi

ఎంపీ విజయసాయి రెడ్డి

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లోని స్పిన్నింగ్‌ మిల్లులను కేంద్ర ప్రభుత్వమే సంక్షోభం నుంచి గట్టెక్కించాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి డిమాండ్‌ చేశారు. ఆయన బుధవారం జీరో అవర్‌ సమయంలో ఈ ప్రతిపాదనను రాజ్యసభలో ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీలోని స్పిన్నింగ్‌ మిల్లులు ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయని తెలిపారు.

మిల్లులుకు సరఫరా చేసే పత్తి ధర అమాంతంగా పెరిగిపోవడం, సేకరించిన పత్తి నిల్వలను సీసీఐ దాచేస్తుందని ఆరోపించారు. దీంతో టెక్స్‌టైల్‌ రంగం విపరీతమైన నష్టాలలో కూరుకుపోతుందని వెల్లడించారు. కాగా, భారమవుతున్న ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోవడానికి ప్రొడక్షన్‌ హాలిడే ప్రకటించాల్సిన దుస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోతున్న స్పిన్నింగ్‌ మిల్లులను కేంద్ర ప్రభుత్వమే ఆదుకోవాలని విజయసాయిరెడ్డి డిమాండ్‌ చేశారు.  

మరిన్ని వార్తలు