ఐబీసీ సవరణ బిల్లుతో మరింత మేలు

13 Mar, 2020 05:14 IST|Sakshi

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి

సాక్షి, న్యూఢిల్లీ: ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బాంక్రప్టసీ కోడ్‌ (ఐబీసీ) సవరణ బిల్లుతో మరింత మేలు జరుగుతుందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈబిల్లుపై గురువారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. 2016లో ఐబీసీ రాకమునుపు దివాలా ప్రక్రియకు నాలుగైదేళ్లు పట్టేదని, ఇప్పుడు ఆరు నుంచి ఎనిమిది నెలల్లో ప్రక్రియ పూర్తవుతోందని వివరించారు. రుణదాతల్లో పది శాతం లేదా 100 మంది ఈ దివాలా ప్రక్రియ ఆరంభించేందుకు సవరణ బిల్లు వీలు కల్పిస్తుందని, తద్వారా రుణగ్రహీతల్లో జవాబుదారీతనం పెరుగుతుందని వివరించారు. ఆర్థిక సంస్థలపై విశ్వాసాన్ని పాదుగొల్పేందుకు దోహదపడే ఈ బిల్లుకు తాము మద్దతు తెలుపుతున్నట్టు తెలిపారు. అలాగే మినరల్‌ లా (సవరణ) బిల్లుకు వైఎస్సార్‌సీపీ మద్దతు పలుకుతోందని విజయసాయిరెడ్డి తెలిపారు. ప్రాజెక్టులు వేగవంతంగా అమలయ్యేందుకు, సులభతర వాణిజ్యానికి, ప్రక్రియ సరళీకరణకు, స్థానికంగా ప్రాజెక్టుతో ముడిపడి ఉన్న వారందరికీ ప్రయోజనం కలిగించేందుకు ఈ బిల్లు దోహదపడుతుందని వివరించారు.

ఈ ఏడాది 200 మంది ఐపీఎస్‌లు
యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్‌సీ) నిర్వహించే సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష ద్వారా ఈ ఏడాది 200 మంది ఐపీఎస్‌ అధికారులను నియమించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. విజయసాయిరెడ్డి ప్రశ్నకు ప్రధాన మంత్రి కార్యాలయంలోని సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ ఈ మేరకు జవాబిచ్చారు.

దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ పనులు పూర్తిచేయండి
దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ప్రకటించి ఏడాది గడుస్తున్నా పనులు ప్రారంభం కాలేదని, త్వరితగతిన పనులు పూర్తిచేయాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్రాన్ని కోరారు. లోక్‌సభలో రైల్వే పద్దులపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఎలక్ట్రిక్‌ లోకో యూనిట్‌ను కాకినాడలో ఏర్పాటు చేయాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ వంగ గీతావిశ్వనాథ్‌ కేంద్రాన్ని కోరారు. రైల్వే పద్దులపై జరిగిన చర్చలో ఆమె మాట్లాడుతూ పోర్ట్‌ సిటీ, ఫర్టిలైజర్స్‌ సిటీ, ఎస్‌ఈజడ్‌ సిటీగా ప్రసిద్ధిగాంచిన కాకినాడలో ఈ యూనిట్‌ పెడితే మరింత అభివృద్ధికి అవకాశం ఉంటుందన్నారు. ప³ంటల బీమా ప్రిమియం చెల్లింపులో ఇటీవల చేసిన సవరణను ఉపసంహరించుకుని పాత పద్ధతినే తిరిగి ప్రవేశపెట్టాలని ఎంపీ రఘురామ కృష్ణంరాజు కేంద్రాన్ని కోరారు. లోక్‌సభలో ప్రత్యేక ప్రస్తావన కింద ఆయన ఈ అంశంపై మాట్లాడారు. ఇప్పటి వరకు ప్రిమియంలో 2 శాతం రైతు, 49 శాతం కేంద్రం, 49 శాతం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేవని ఆయన చెప్పారు.

మరిన్ని వార్తలు