టీఆర్ఎస్ నుంచి విజయశాంతి సస్పెన్షన్

1 Aug, 2013 00:46 IST|Sakshi
హైదరాబాద్: మెదక్ ఎంపీ విజయశాంతిని టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ బుధవారం అర్ధరాత్రి ఆదేశాలు జారీ చేశారు. విజయశాంతి అనేకసార్లు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని, ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కూడా కలిసినట్లు తమకు సమాచారం ఉందని ఈ సందర్భంగా కేసీఆర్ అన్నారు. అందుకే ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 
 
కొన్నాళ్లుగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్న ఆమె.. కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న వార్తలు వినిపించాయి. బుధవారం కూడా కేసీఆర్తో సంబంధం లేకుండానే ఆమె మీడియాతో మాట్లాడారు. విడివిడిగా ఇంటర్వ్యూలు ఇచ్చారు. చేరిన కొత్తల్లో పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి, పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లోపల ఒక ప్రత్యేక ఛాంబర్ కేటాయించి, ప్రధానమైన సమావేశాలన్నింటిలోను కేసీఆర్ పక్కనే స్థానం కల్పించేవారు. కానీ, ఇటీవలి కాలంలో మాత్రం పార్టీకి... విజయశాంతికి మధ్య దూరం బాగా పెరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అనుకూల నిర్ణయాన్ని ప్రకటించిన సందర్భంగా తెలంగాణ భవన్ అంతటా భారీ ఎత్తున సంబరాలు చేసుకుంటున్నా.. రాములమ్మ మాత్రం వాటికి దూరంగానే ఉండిపోయింది. 
 
ఇక రెండోరోజైన బుధవారం కూడా.. పార్టీ అధినేత చంద్రశేఖర్ రావును కలవకుండా, మీడియాకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఇది తెలంగాణ ప్రజల విజయమని ఆమె 'సాక్షి'తో చెప్పింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం టీఆర్ఎస్ 13 ఏళ్ల నుంచి పోరాడుతుంటే, తాను 16 ఏళ్లుగా కష్టపడుతున్నానని, రాజకీయ పార్టీలకన్నా.. త్యాగాలు చేసినవారికే క్రెడిట్‌ ఇవ్వాలని ఆమె చెప్పారు. 2014లో నేను ఏ పార్టీ తరఫున పోటీ చే్యాలో దేవుడే నిర్ణయిస్తాడంటూ వేదాంతం వల్లించారు.
మరిన్ని వార్తలు