విజయశాంతిపై సస్పెన్షన్ వేటు

1 Aug, 2013 01:48 IST|Sakshi
కాంగ్రెస్ వైపు చూస్తున్నారనే వార్తలు వెలువడిన నేపథ్యంలో మెదక్ ఎంపీ విజయశాంతిని టీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ చేశారు. బుధవారం అర్ధరాత్రి 12.30 తర్వాత కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పోలిట్‌బ్యూరో సభ్యులతో చర్చించిన పిదపే... పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న విజయశాంతిని సస్పెండ్ చేయాలనే నిర్ణయానికి కేసీఆర్ వచ్చారని టీఆర్‌ఎస్ వర్గాలు వివరించాయి. ఆమె పలుమార్లు పార్టీకి వ్యతిరేకంగా వెళ్లినా, మాట్లాడినా క్షమించామని... ఈసారి మాత్రం చర్య తీసుకోక తప్పదని కేసీఆర్ భావించినట్లు సమాచారం. కొంతకాలంగా విజయశాంతి టీఆర్‌ఎస్ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలతో టచ్‌లో ఉన్న ఆమెకు మెదక్ టిక్కెట్టుపై హామీ లభించినట్లు పేర్కొంటున్నారు. తెలంగాణ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ ప్రకటనతో మంగళవారం తెలంగాణ వాదులు, టీఆర్‌ఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగితేలగా... రాములమ్మ ఎక్కడా కనపడలేదు. పైగా ఆమె ఇంటివద్ద కేసీఆర్ పోస్టర్ల స్థానంలో ఉన్నట్లుండి ఇందిరాగాంధీ చిత్రపటాలు వెలిశాయి. ఆమె కాంగ్రెస్‌లోకి వెళుతున్నట్లుగా తనకెలాంటి సమాచారం లేదని మంగళవారం రాత్రి విలేకరు సమావేశంలో చెప్పిన కేసీఆర్... విజయశాంతి కదలికలను ధ్రువీకరించుకొని మరుసటిరోజే సస్పెండ్ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. పార్టీ నుంచి బహిష్కరించే ముందు ఎందుకు చర్య తీసుకోకూడదో తెలపాలంటూ టీఆర్‌ఎస్ ఆమెకు షోకాజ్ నోటీసు జారీ చేయనుంది. 
 
 టీఆర్‌ఎస్ కంటే నేనే ఎక్కువ కష్టపడ్డా: విజయశాంతి
 తాను కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ జరిగిన ప్రచారాన్ని  విజయశాంతి బుధవారం మధ్యాహ్నం తనను కలిసిన విలేకరులతో మాట్లాడిన సందర్భంగా  ఖండించలేదు. అలాగని ధ్రువీకరించనూ లేదు. తెలంగాణ సాధన టీఆర్‌ఎస్ గొప్పదనమే అని చెప్పకపోగా, తెలంగాణ అమరవీరులదే ఆ ఘనత అని విజయశాంతి చేసిన వ్యాఖ్యల్ని చూస్తే.. టీఆర్‌ఎస్ అధినాయ కత్వంతో ఆమెకు దూరం పెరిగిందనేది స్పష్టమ వుతోంది. కాగా తెలంగాణ ఏర్పాటుకోసం టీఆర్‌ఎస్ కంటే తానే ఎక్కువగా కష్టపడ్డానని ఆమె చెప్పారు. తెలంగాణ ఏర్పాటు ఘనత ఏ రాజకీయపార్టీదో కాదని, ప్రాణాలను అర్పించిన అమరవీరులదే అని వ్యాఖ్యానించారు. అధికార రాజకీయాల చుట్టూ తిరిగే పార్టీలకు తాను క్రెడిట్ ఇవ్వదలచుకోలేదని, త్యాగాలు చేసిన అమరులకే క్రెడిట్ ఇస్తానని అన్నారు. తెలంగాణ కోసం తాను 16 ఏళ్లుగా కష్టపడ్డానని, టీఆర్‌ఎస్ 13 ఏళ్లుగానే, పోరాడుతోందని అన్నారు. తెలంగాణకోసం  టీఆర్‌ఎస్ కంటే తానే ఎక్కువగా కష్టపడ్డానన్నారు. 2014 ఎన్నికల్లో తాను ఏ పార్టీ తరఫున పోటీచేస్తాననే విషయంపై ఇప్పుడే మాట్లాడలేనన్నారు.
>
మరిన్ని వార్తలు