రాజధానిగా బెజవాడ భేష్ అని చెప్పా: కావూరి

3 Mar, 2014 00:02 IST|Sakshi
రాజధానిగా బెజవాడ భేష్ అని చెప్పా: కావూరి

ఏలూరు, న్యూస్‌లైన్: సీమాంధ్ర రాజధానిని కృష్ణా నది ఒడ్డున విజయవాడలో ఏర్పాటుచేస్తే బాగుంటుందని, ఇదే విషయాన్ని కేంద్రానికి చెప్పానని కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరు సాంబశివరావు అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ విభజన వల్ల సీమాంధ్ర ప్రాంతానికి చాలా నష్టం జరుగుతుందని కేంద్ర కేబినెట్‌లో అనేకసార్లు చెప్పానని, అయినా కేంద్రం పట్టించుకోలేదన్నారు. అయితే, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత భద్రాచలం డివిజన్‌ను సీమాంధ్రలో కలపాలని, ఇక్కడ పరిశ్రమలు నిర్మించుకోవడానికి పెట్టుబడిదారులను ప్రోత్సహించాలని కోరిన వెంటనే కేంద్రం అంగీకరించిందన్నారు. 

తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం వల్ల అక్కడి నుంచి గెలుపొందే 10 మంది ఎంపీ సీట్లతో కేంద్రంలో అధికారాన్ని నిలుపుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందన్నారు. సీమాంధ్ర ప్రాంత ప్రజల కష్టంతో అభివృద్ధి చెందిన హైదరాబాద్‌ను చూసి అటువంటి మహానగరాన్ని  నిర్మించలేమనుకుని, డబ్బును సంపాదించుకోవడానికి తెలంగాణ ప్రాంతంలోని నాయకులు ప్రత్యేక రాష్ట్రం కావాలని కేంద్రాన్ని కోరడం, దానికి కేంద్రం అంగీకరించడం చారిత్రాత్మక తప్పిదమని కావూరు పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉందంటూనే.. వచ్చే ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ తరఫున ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్తపార్టీ ఏర్పాటు గురించి మీరేమంటారు అనే ప్రశ్నకు పార్టీ పెట్టినప్పుడు చూద్దాంలే అంటూ దాటవేశారు.

మరిన్ని వార్తలు