అమ్మా.. మేమున్నాం: ద్వారక తిరుమల

30 Nov, 2019 11:03 IST|Sakshi

సాక్షి, అమరావతి : ‘అమ్మా... మీకేదైనా ప్రమాదం సంభవించినా, సమస్య ఏదైనా తలెత్తవచ్చనే అనుమానం కలిగినా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయోద్దు.. తక్షణం 100కు డయిల్‌ చేయండి. వాట్సాప్‌ నంబరు 73289 09090కు సమాచారం ఇవ్వండి. నగర పరిధిలో నాలుగు నిమిషాల్లో మీ చెంతకు చేరుకుంటాం. శివారు ప్రాంతాలకైతే ఆరు నిమిషాల్లో వచ్చేస్తాం. సమస్య మీదే కాకపోవచ్చు.. మీ పక్కన, పరిసరాల్లో ఎక్కడైనా, ఎవరికైనా ప్రమాదం పొంచి ఉందనే అనుమానం కలిగినా ఆలోచించవద్దు..’ అని విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు నగర ప్రజలకు భరోసా కల్పించారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలో పశువైద్య శాలలో వైద్యురాలిగా పనిచేస్తున్న ప్రియాంకరెడ్డి దారుణహత్య నేçపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా మహిళలు, యువతులు, ఆడపిల్లలు తగుజాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ ఏ సమయంలోనైనా పోలీసులు అందుబాటులో ఉన్నారన్న   విషయాన్ని మరచిపోవద్దని కోరారు.  

వెనువెంటనే స్పందిస్తారు.. 
విజయవాడ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ఎవరైనా ఆపదలో ఉండి డయల్‌ 100కి ఫోన్‌ చేస్తే పోలీసులు సగటున నాలుగు నిమిషాల్లోనే సంఘటనా స్థలానికి చేరుకుని సమస్యపై స్పందిస్తారన్నారు. నగర శివార్లకు వెళ్లేందుకు ఆరు నిమిషాలు తీసుకుంటున్నా... సత్వరమే ఫిర్యాదీదారులు చెప్పిన ప్రాంతానికి పోలీసులు చేరుకుంటారని చెప్పారు. డయల్‌ 100కి ఫోన్‌ వచ్చిన వెంటనే సమీపంలో ఉన్న రక్షక్, బ్లూకోట్స్‌ సిబ్బందికి సమాచారం చేరవేయడమే కాకుండా వెనువెంటనే వచ్చేస్తారని పేర్కొన్నారు. ఇవే కాకుండా ఇంటర్‌సెప్టార్‌  12 వాహనాలు ప్రజలకు అందుబాటులో ఉంచామని.. నగరంలోని బెంజిసర్కిల్, స్టేట్‌ గెస్ట్‌హౌస్, బస్టాండు, రైల్వేస్టేషన్, బీసెంట్‌ రోడ్డు తదితర ముఖ్య కూడళ్ల వద్ద ఈ వాహనాలు 24 గంటలు అందుబాటులో ఉంటాయన్నారు. ఉదాహరణకు ఎవరైనా వ్యక్తిని కిడ్నాప్‌ చేసి వాహనంలో  తీసుకెళుతున్నా... ఏదైనా వాహనం అతి వేగంతో వెళుతున్నా వాటిని నియంత్రించడానికి, చర్యలు తీసుకోవడానికి సిబ్బంది వెంబడిస్తారన్నారు.   

7328909090 నంబరుకు చెపితే...   
డయల్‌ 100 మాదిరిగానే విజయవాడ నగర పోలీసులు ప్రత్యేకంగా రూపొందించిన 7328909090 వాట్సాప్‌ నంబరు కూడా ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని సీపీ చెప్పారు. ఈ వాట్సాప్‌ నంబరుకు సంక్షిప్త సందేశం కాని, చిత్రాలు కాని, వీడియోలు కాని పంపవచ్చని చెప్పారు.  24 గంటలు టోల్‌ఫ్రీ నంబర్లు 100, 112, 181, 1091.

చేరువ ద్వారా అవగాహన..  
నగరంలో జరుగుతున్న నేరాల పట్ల, సైబర్‌ నేరగాళ్ల బారిన పడకుండా ఉండేలా ప్రజల్లో అవగాహన కలి్పంచడానికి చేరువ కార్యక్రమాన్ని చేపట్టామని సీపీ ద్వారకా తిరుమల రావు చెప్పారు. చేరువ వాహనాల ద్వారా సిబ్బంది వీధివీధినా తిరుగుతూ ప్రజలకు నేరాలు, చట్టాల పట్ల అవగాహన కలి్పస్తున్నారని వివరించారు. 

జీపీఆర్‌ఎస్‌తో అనుసంధానం
మహిళల రక్షణ కోసం పోలీసులు ప్రత్యేక సర్వీసును ప్రవేశపెట్టారు. మీరు ఎప్పుడైనా కారు, కాబ్, ఆటోలో ఒంటరిగా ప్రయాణిస్తుంటే..ఆ వాహనం నంబర్‌ను 9969777888కు ఎస్‌ఎంఎస్‌ చేయాలి. ఆ నంబర్‌ను వెంటనే జీపీఆర్‌ఎస్‌కు అనుసంధానించి.. మీరు పంపిన నంబర్‌కు ఒక రిటర్న్‌ ఎస్‌ఎంఎస్‌ వస్తుంది. వాహన గమనం ఎలా ఉందో గుర్తిస్తుంది.

జాగ్రత్తలు చెప్పాలి..  
పిల్లలకు తల్లిదండ్రులు, ఇంట్లోని పెద్దలు భద్రత గురించి చెప్పాలని, ఏదైనా సమస్య తలెత్తితే ఎలా దాన్ని అధిగమించాలో వివరిస్తుండాలని సీపీ సూచించారు. ప్రస్తుతం సెల్‌ఫోన్ల వినియోగం ఎక్కువగా ఉన్నందున ఆపత్కాలంలో ఎవరిని సంప్రదించాలో ప్రత్యేకంగా నంబర్లు నోట్‌ చేసుకోవాలని కోరారు. విద్యా సంస్థలు కూడా ఈ విషయంలో విద్యార్థులకు అవగాహన కల్పించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ప్రమాదం ఏదీ చెప్పి రాదని అందువల్లే అప్రమత్తత ముఖ్యమన్నారు. 

మరిన్ని వార్తలు