విజయవాడ: గగనతరమైన స్వచ్ఛ గాలి

21 Jun, 2019 10:36 IST|Sakshi

విజయవాడ కాలుష్య పూరితమే.. 

కమ్మేస్తున్న కాలుష్య భూతం

శబ్ద కాలుష్యం అధికమే.. 

విజయవాడలో కాలుష్యకారకాలు ప్రమాదఘంటికలు మోగిస్తున్నాయి. తినే తిండి ఎలాగూ కలుషితమైపోగా.. చివరకు పీల్చే గాలిలో కూడా హానికర పరిస్థితులున్నాయంటూ కాలుష్య నియంత్రణ మండలి లెక్కలుగట్టి మరీ హెచ్చరిస్తోందంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. నగరంలోని ఐదు ప్రాంతాల్లో ఈ సంస్థ సేకరించిన గణాంకాలు అందరినీ విస్తుపోయేలా చేస్తున్నాయి. 

సాక్షి, అమరావతి బ్యూరో : విజయవాడను కాలుష్య భూతం కమ్మేసింది. ఇక్కడ సూక్ష్మధూళి కణాల పరిమాణం రోజురోజుకీ అధికమవుతోంది. దీంతో స్వచ్ఛమైన గాలి గగనమైంది. వాహనాల రణ, గొణ ధ్వనులు.. వాయు కాలుష్య ఉద్గారాలు నిత్యం పెరుగుతుండడమే ఇందుకు కారణం. ఫలితంగా నగరంలో పలు ప్రాంతాలు ధూళిమయమవుతున్నాయి. మొక్కల పెంపకం తగ్గిపోవడం.. అడవుల విస్తీర్ణం క్రమంగా క్షీణిస్తుండడం.. వాహనాలు అంతకంతకు పెరుగుతుండడం.. చెత్త, ప్లాస్టిక్‌ తగులబెడుతుండడం వంటి చర్యలతో నగరంలో కాలుష్య కణాలు మితిమీరిపోతున్నాయి. 

విజయవాడ కాలుష్య పూరితమే.. 
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్దేశిత పరిమితుల ప్రకారం పీఎం 10 సూక్ష్మదూళి కణాల వార్షిక సగటు ఘనపు మీటరు గాలిలో 60 మైక్రో గ్రాములకు మించి ఉండకూడదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల మేరకైతే 20 మైక్రో గ్రాములకు దాటకూడదు. అంతకు మించిచే ఆ ప్రాంతంలో గాలి కాలుష్య పూరితమే. గాలిలో పీఎం 10 పరిమాణం వార్షిక సగటు చూస్తే విజయవాడ నగరంలో పీఎం 10 తీవ్రత ఎక్కువగానే ఉంది.
 కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి గణాంకాల ప్రకారం చూస్తే..  నగరంలో ప్రమాదకర కార్బన్‌ మోనాక్సైడ్‌ ఆందోళనకర స్థాయిలో విడుదల అవుతోంది. ఇది గాలిలో 2 శాతం ఉంటోంది.

గాలిలో ధూళి కణాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. ముఖ్య కూడళ్లలో పీఎం 10 ప్రమాణాలు (సూక్ష్మ ధూళి కణాలు) వందకు 80 వరకు నమోదవుతున్నాయి. పీఎం 2.5 (అతి సూక్ష్మ ధూళి కణాలు) గణాంకాలు కూడా ఇదే రీతిలో ఉంటున్నాయి. గాలిలో సన్నటి ధూళిని ఈ ప్రమాణం సూచిస్తుంది. ఇది 60కు 58 వరకు ఉంటోంది. విజయవాడ సమీపంలోని కొండపల్లిలోని వీటీపీఎస్‌ తాప విద్యుత్తు ఉత్పత్తిలో భాగంగా వెలువడే ఉద్గారాలు వాయు కాలుష్యానికి మరింత జతకడుతున్నాయి. 

శబ్ద కాలుష్యం అధికమే.. 
కృష్ణా జిల్లాలో మొత్తం 11.36 లక్షల వాహనాలు తిరుగుతున్నాయి. వాటిలో రవాణా వాహనాలు 1.33 లక్షలు, రవాణేతర.. 10.02 లక్షలు ఉన్నాయి. ఎక్కువగా విజయవాడ నగర పరిధిలోనే 88,210 రవాణా, 5.93 లక్షల రవాణేతర వాహనాలు ఉన్నాయి. అలాగే ఆసియాలోనే అతిపెద్ద ఆటో మొబైల్‌ హబ్‌గా విజయవాడ గుర్తింపు పొందింది. దాదాపు 175 ఎకరాల్లో ఆటోనగర్‌ ఏర్పాటైంది. ఇందులో 500 పెద్ద, చిన్న పరిశ్రమలు వచ్చాయి. ఇవి కాకుండా 4 వేలకు పైగా సర్వీస్‌ యూనిట్లు కూడా ఏర్పాటయ్యాయి.

ఎక్కువగా ప్లాస్టిక్‌ పరిశ్రమలు, ఆయిల్‌ కంపెనీలు, లూబ్రికెంట్లు, పరుపుల తయారీ యూనిట్లు నెలకొల్పారు. నట్లు, బోల్టుల తయారీ పరిశ్రమలు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. వీటి నుంచి విడుదలవుతున్న రసాయనాలు, వాయువులు వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. వాతావరణ కాలుష్యంతో నగరంలో కొన్ని వ్యాధుల విస్తృతి పెరిగిపోయింది. ప్రత్యేకించి ఆస్తమా, క్యాన్సర్, కళ్ల ఎలర్జీ, దగ్గూ, జలుబు బారిన పడటం సాధారణమైపోయింది. వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు ఎక్కువగా ఏదో ఒక వ్యాధితో తరచూ ఇబ్బంది పడుతున్నారు. 

ప్రధాన ప్రాంతాల్లో కాలుష్య స్థాయి ఇదీ.. 
విజయవాడ నగరంలో కాలుష్య నియంత్రణ మండలి పలు ప్రాంతాల్లో వాయు కాలుష్యాన్ని కొలిచే యూనిట్లను ఏర్పాటు చేసింది. వాటిల్లో ఈ ఏడాది నమోదైన వివరాలు ఇలా ఉన్నాయి..

వాయు కాలుష్యంతో పెనుముప్పు..
రాజధాని నగరంలో వాయు కాలుష్యం పెనుముప్పుగా మారింది. శ్వాస ద్వారా అధిక విష వాయువులను పీలుస్తున్నాం. దీంతో శ్వాస కోశ, చర్మ సంబంధిత వ్యాధులతోపాటు హృద్రోగ సమస్యలు తలెత్తుతున్నాయి. కాలుష్య కారకాలను పీలుస్తుండటం వల్ల దూమపానం చేయని వారు సైతం లంగ్‌ క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధులకు గురవుతున్నారు. న్యూరో లాజికల్‌ వ్యాధులూ పెరుగుతున్నాయి. వాయుశబ్ధ కాలుష్యంతో మానసిక వ్యాధులతోపాటు రక్తనాళలపై ప్రభావం చూపి గుండె జబ్బులు, రక్తపోటు వంటి వ్యాధులు సోకుతున్నాయి. 
– డాక్టర్‌ ఏవై రావు, క్యాన్సర్‌ వైద్య నిపుణులు

మరిన్ని వార్తలు