గ్యాంగ్‌ వార్‌ : వెలుగులోకి కీలక అంశాలు

2 Jun, 2020 16:36 IST|Sakshi

సాక్షి, విజయవాడ : నగరంలో జరిగిన గ్యాంగ్‌ వార్‌కు సంబంధించి కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘర్షణలో పాల్గొన్న తోట సందీప్‌, కేటీఎం పండు గ్రూపుల మధ్య భూ వివాదాలతోపాటుగా, వ్యక్తిగత పోరు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. తొలుత సందీప్‌, పండులు సన్నిహితులైనప్పటికీ.. విబేధాలు తలెత్తటంతో రెండు గ్యాంగ్‌లుగా విడిపోయారు. వీరిద్దరు కూడా టీడీపీకి చెందిన ఓ నాయకుడికి ముఖ్య అనుచరులుగా ఉన్నట్టుగా తెలుస్తోంది. (చదవండి : బెజవాడలో అలజడి)

మరోవైపు గుంటూరు జిల్లాలోని వివాదాస్పద భూముల వ్యవహారంలో సందీప్‌, పండు వర్గాల జోక్యం ఉన్నట్టుగా పోలీసుల విచారణలో తేలింది. బెజవాడలో ల్యాండ్‌ సెటిల్‌మెంట్లకు గుంటూరు నుంచి యువకులను, గుంటూరులో ల్యాండ్‌ సెటిల్‌మెంట్లకు బెజవాడ యువకులను తీసుకెళ్లినట్టుగా పోలీసులు గుర్తించారు. ఇలా చేయడం ద్వారా బయటి వ్యక్తులను గుర్తుపట్టే అవకాశం ఉండదని వారు భావించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. గ్యాంగ్‌ వార్‌లో రెండు జిల్లాలకు చెందిన వారు పాల్గొన్నట్టుగా ఆధారాలు సేకరించారు. అలాగే సందీప్‌, పండులకు ఉన్న టిక్‌టాక్‌, ఫేస్‌బుక్‌ అకౌంట్ల ఫాలోవర్స్‌ను కూడా విచారించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. కాగా, శనివారం పటమటలో జరిగిన గ్యాంగ్‌ వార్‌లో సందీప్‌ మృతిచెందగా, పండుతో పాటుగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పండు పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. (చదవండి : బెజవాడ గ్యాంగ్‌వార్‌ కేసు.. పోలీసుల హైఅలర్ట్)

మరిన్ని వార్తలు