గవర్నర్‌పేట బస్‌ డిపో మాయం

19 Oct, 2017 11:20 IST|Sakshi

4 ఎకరాల్లోని డిపో ఖాళీ చేయాలని కలెక్టర్‌ ఆదేశాలు

కాలువల ఆధునీకరణ కోసం రూ.500 కోట్ల విలువైన భూమి

గన్నవరంలో ఇది వరకే రూ.250 కోట్ల స్థలాల అప్పగింత

ఈ చర్యలు సంస్థకు నష్టమేనంటూ కార్మిక సంఘాల ఆందోళనలు

సాక్షి, అమరావతి /అమరావతి బ్యూరో: విజయవాడ గవర్నర్‌పేట ఆర్టీసీ బస్‌ డిపో వైభవం కనుమరుగు కానుంది. ఈ డిపోను ఖాళీ చేయాలని జిల్లా కలెక్టర్‌ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. నగర అభివృద్ధి, కాలువల ఆధునీకరణ పేరుతో రూ.500 కోట్ల విలువైన ఈ 4 ఎకరాల భూమిని ఓ కార్పొరేట్‌ సంస్థకు అప్పగించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే గన్నవరంలో ఆర్టీసీకున్న రూ.250 కోట్ల విలువైన 28 ఎకరాల భూముల్ని హెచ్‌సీఎల్‌ కంపెనీ అధినేత శివనాడార్‌కు అప్పగించారు. దానికి బదులుగా ఆర్టీసీకి ఇంతవరకు ప్రత్యామ్నాయ భూములు ఇవ్వకపోవడం గమనార్హం.  

ఆర్టీసీకి ఆయువుపట్టు...
ఏపీఎస్‌ఆర్‌టీసీకి 13 జిల్లాల్లో 1,960 ఎకరాల భూములున్నాయి. వీటి విలువ ఇప్పుడున్న రెవెన్యూ రికార్డు ప్రకారం సుమారు రూ.15 వేల కోట్లు. మార్కెట్‌ రేటు ప్రకారం రూ.50 వేల కోట్ల విలువ ఉంటుందని అంచనా. ఆర్టీసీ ఆస్తులపై కన్నేసిన కొందరు పెద్దలు అభివృద్ధి ముసుగులో ఒక్కొక్కటిగా బడా వ్యాపార వేత్తలకు, ఐటీ కంపెనీలకు కట్టబెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే మొన్న గన్నవరం, నేడు గవర్నర్‌పేట స్థలాలు అప్పగించేస్తున్నారు. ఆర్టీసీకి విజయవాడలోని గవర్నర్‌ పేట –2 డిపోకు 5.2 ఎకరాల భూమి ఉంది. ఆర్టీసీ యాజమాన్యం 1970 మార్చిలో గజానికి రూ.16 వేల చొప్పున రూ.4.6 లక్షలు ప్రభుత్వానికి చెల్లించి ఆర్టీసీ ఆ భూమిని కొనుగోలు చేసింది. అనంతరం అందులో సంస్థ అవసరాలకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టింది. తర్వాత కాలంలో రహదారుల విస్తరణలో ఎకరా భూమి పోయింది. ఇటీవల కృష్ణా పుష్కరాల సమయంలో పార్కు అభివృద్ధి పేరుతో మరో 20 సెంట్లు భూమిని స్వాధీనం చేసుకోగా ప్రస్తుతం 4 ఎకరాలు ఉంది. దీన్ని ఇప్పుడు ఓ కార్పొరేట్‌ సంస్థ దక్కించుకోబోతోంది. నగరాభివృద్ధి ముసుగులో సంస్థ పెద్దలు సైతం ఈ నిర్ణయానికి తల ఊపినట్లు సమాచారం. ఇక్కడ ఉన్న డిపోను 30రోజుల్లో ఖాళీ చేయాలంటూ కలెక్టర్‌ నుంచి ఆదేశాలు వచ్చాయి. రూ.500 కోట్లు విలువైన ఈ భూమిలో ప్రైవేటు భాగస్వామ్యంతో మంచి భవనాలు నిర్మిస్తామని, కాలువలు ఆధునీకరిస్తామని చెప్పడం కార్మిక సంఘాలను విస్మయపరుస్తోంది.

లీజుల పేరిట ఆస్తుల అప్పగింత నష్టదాయకం
రాష్ట్రంలో గుంటూరు, ఏలూరు, తిరుపతి, విశాఖపట్టణం, విజయనగరం, విజయవాడలలో ఆర్టీసీ స్థలాల్ని బీవోటీ (నిర్మించు–నిర్వహించు–బదలాయించు) విధానంలో ఆర్టీసీ యాజమాన్యం ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తోంది. గుంటూరు, తెనాలిలలో స్విస్‌ ఛాలెంజ్‌ విధానంలో స్థలాల్ని ఇప్పటికే కట్టబెట్టారు. ఈ స్థలాలన్నింటినీ 49 ఏళ్లకు నామమాత్రపు ధరలతో లీజుకు అప్పగిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గుంటూరు నడిబొడ్డున ఉన్న రూ.వంద కోట్ల విలువైన రెండెకరాల స్థలాన్ని లీజు విధానంలో సింగిల్‌ టెండర్‌కు అప్పగించారు. నర్సీపట్నంలో ఓ మంత్రికి సన్నిహితంగా ఉన్న గ్రీన్‌ హుడ్‌ కంపెనీకి రూ.20 కోట్ల విలువైన స్థలాన్ని ఏకపక్షంగా అప్పగించడంపై మంత్రి అయ్యన్నపాత్రుడు తప్పు పట్టిన సంగతి తెలిసిందే.

సేవ్‌ ఆర్టీసీ పేరిట ధర్నాలు: ఎన్‌ఎంయూ
సేవ్‌ ఆర్టీసీ పేరిట నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ రాష్ట్ర వ్యాప్తంగా 128 డిపోలలో నిరసన, ధర్నా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 24న మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చామని ఎన్‌ఎంయూ అధ్యక్షుడు చల్లా చంద్రయ్య ఓ ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీ ఆస్తులను పప్పు బెల్లాల్లా ప్రభుత్వం తమ అనుయాయులకు పంచిపెట్టడంపై పోరాటానికి సిద్ధమవుతున్నామని వైఎస్సార్‌ సీపీ ఆర్టీసీ యూనియన్‌ నేత రాజారెడ్డి ప్రకటించారు. ఆర్టీసీ ఆస్తులను కాపాడుకునేందుకు ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని, ఎన్‌ఎంయూతో కలిసి ఐక్య ఉద్యమం నిర్వహిస్తామని ఈయూ నేత పద్మాకర్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు